ఆన్​లైన్​ బిజినెస్​లలో.. ఆ నలుగురే!

ఆన్​లైన్​ బిజినెస్​లలో.. ఆ నలుగురే!

ఆన్​లైన్​ షాపింగ్​ మార్కెట్లో ప్రస్తుతం అమెజాన్​, ఫ్లిప్​కార్ట్‌‌ల​హవా నడుస్తోంది. వీటితో ఢీకొట్టడానికి రిలయన్స్​, టాటాలు భారీగా పెట్టుబడులను గుమ్మరిస్తున్నాయి. దీనివల్ల ఆన్​లైన్ మార్కెట్​లో చివరికి ఈ నాలుగు కంపెనీలే మిగులుతా యని స్టడీ రిపోర్టులు చెబుతున్నా యి. ఫ్లిప్​కార్ట్, రిలయన్స్​, అమెజాన్​, టాటా (ఫ్రాట్​)లు  ఆన్​లైన్​ రిటైల్​ మార్కెట్లో 80 శాతానికిపైగా వాటా దక్కించుకోగలుగుతాయని ఫారెస్టర్​ రిపోర్టు వెల్లడించింది.

న్యూఢిల్లీ: ఆన్​లైన్​లో ఏదైనా ఆర్డర్​ చేయాలంటే ముందుగా గుర్తుకు వచ్చేవి అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​లే! ఇవి జనంలోకి అంతగా చొచ్చుకుపోయాయి. ఈ రెండింటికీ తమ పేరెంట్​ అమెరికన్​ కంపెనీల నుంచి భారీగా డబ్బులు వస్తుంటాయి.   ఫండింగ్​ కారణంగా భారీగా డిస్కౌంట్లు ఇస్తూ దూసుకెళ్తున్నాయి. వీటిని బలంగా ఢీకొట్టడానికి మన దేశంలోని బడా కార్పొరేట్​ గ్రూపులు టాటా, రిలయన్స్​ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. అమెజాన్, ఫ్లిప్​కార్ట్‌‌ల మాదిరే ఆఫర్లు, డిస్కౌంట్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. ఇండియన్​ ఆన్​లైన్​ రిటైలింగ్​ మార్కెట్లో చివరికి ఈ నాలుగే మిగులుతాయని, మిగతావి నామ్​ కే వాస్తేగా నడుస్తాయని రీసెర్చ్​ అండ్​ అడ్వైజరీ సంస్థ ఫారెస్టర్​ రిపోర్టు వెల్లడించింది. దీనిప్రకారం   ఫ్లిప్​కార్ట్, రిలయన్స్​, అమెజాన్​, టాటా (ఫ్రాట్​)లు  ఆన్​లైన్​ రిటైల్​ మార్కెట్లో 80 శాతానికిపైగా వాటా దక్కించుకోగలుగుతాయి. అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​తో పోటీ పడేందుకు టాటా ‘న్యూ’ పేరుతో సూపర్​యాప్​ను తయారు చేసింది. అంతేకాదు ఫార్మా స్టార్టప్​1ఎంజీని, గ్రాసరీ స్టార్టప్​ బిగ్​బాస్కెట్​ను కొన్నది. సూపర్​ యాప్​తో టాటా గ్రూపు సంస్థల సేవలను, ప్రొడక్టులను ఆర్డర్​ చేయవచ్చు.   ఆన్​లైన్​ పేమెంట్స్ కోసం యూపీఐ యాప్​ను తెచ్చే ప్రయత్నాల్లోనూ ఈ గ్రూప్​ ఉంది. టాటా డిజిటల్​ను విస్తరించడానికి దండిగా నిధులు ఇవ్వాలని పేరెంట్​ కంపెనీ టాటా సన్స్​ను కోరింది. జియోమార్ట్​ పేరుతో రిలయన్స్​ ఆన్​లైన్​ గ్రాసరీ వెర్టికల్​ను మొదలుపెట్టి చాలా తక్కువ ధరలకు వస్తువులను అమ్ముతోంది. క్విక్​ డెలివరీ స్టార్టప్​ డంజోలోనూ ఇన్వెస్ట్​ చేసింది. 

ఆకాశమే హద్దు..

ఆన్​లైన్​ రిటైలింగ్ ​సెక్టార్​ ఏటేటా దూసుకెళ్తూనే ఉంది. అమెరికా, చైనా తరువాత ఆన్​లైన్​ షాపింగ్​ సెక్టార్​ను ఎక్కువగా డెవెలప్​ చేయగల సత్తా ఇండియాకే ఉందని ఫారెస్టర్ ​రిపోర్టు ప్రకటించింది. ఆన్​లైన్​ రిటైల్​లో 2020, 2021 సంవత్సరాల్లో ఇంటర్నేషనల్​ ఆర్గనైజేషన్లు ఎనిమిది బిలియన్​ డాలర్లు (దాదాపు రూ.61 వేల కోట్లు) ఇన్వెస్ట్​ చేశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ, సాధారణ రిటైల్​ అమ్మకాలు తగ్గినా ఆన్​లైన్​ రిటైల్​ సేల్స్​విలువ  అదనంగా  1.6 బిలియన్​ డాలర్లు (దాదాపు రూ.12 వేల కోట్లు) పెరిగింది. మొత్తం 41 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.మూడు లక్షల కోట్లు) విలువైన వస్తువులు అమ్ముడయ్యాయి. 2025 నాటికి ఈ మార్కెట్​ సైజు 85 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.6.47 లక్షల కోట్లు) చేరుతుందని అంచనా. భారతదేశంలో ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ షాపర్ల సంఖ్య 2016లో 7.15 కోట్లు నుండి 2020లో 17.95 కోట్లకు పెరిగింది. 2025 నాటికి ఈ సంఖ్య 29.15 కోట్లకు పెరుగుతుందని ఫారెస్టర్ అంచనా వేసింది. ఈ గ్రోత్​కు​ చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల జనాలు 
కారణం. సెప్టెంబర్ 2021 నాటికి, గ్రామీణ భారతదేశంలో 33.6 కోట్ల మంది ఇంటర్నెట్ సబ్‌‌‌‌స్క్రయిబర్లు ఉన్నారు. ఈ సంఖ్య 2020 కంటే 11.3శాతం పెరిగింది. 

2020 –- 25 మధ్య మొత్తం ఆన్‌‌‌‌లైన్ కొనుగోలుదారుల సంఖ్య 10.1 శాతం సీఏజీఆర్​తో పెరగనుంది. లాక్​డౌన్ల సమయంలో జనం ఇండ్లకే పరిమితం కావడంతో ఆన్​లైన్​ షాపింగ్​కు బాగా అలవాటయ్యారని ఫారెస్టర్​ వైస్​–ప్రెసిడెంట్​, రీసెర్చ్​ డైరెక్టర్​ అశుతోష్​ శర్మ అన్నారు. కోవిడ్‌‌‌‌కు ముందు, స్మార్ట్‌‌‌‌ఫోన్‌‌‌‌లు, కంప్యూటర్ హార్డ్‌‌‌‌వేర్,  సాఫ్ట్‌‌‌‌వేర్  కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ కేటగిరీల్లో అమ్మకాలు ఎక్కువ ఉండేవి. కరోనా తరువాత కిరాణా సామాగ్రి, పర్సనల్ కేర్​ప్రొడక్టులను కూడా ఆన్​లైన్​లోనే కొనడం ఎక్కువయింది.