రిలయన్స్​ ‘షాపింగ్​’

రిలయన్స్​ ‘షాపింగ్​’
  • దాదాపు 30 బ్రాండ్లు కొనేందుకు రెడీ
  • ఇందుకోసం ప్రత్యేక విభాగం​
  • 50 వేల కోట్ల బిజినెస్​ టార్గెట్​!

ముంబై: మనదేశంలోనే అతిపెద్ద కంపెనీ రిలయన్స్​ ‘షాపింగ్​’ మూడ్​లో ఉంది. నెస్లే, యూనిలీవర్​ వంటి ఎఫ్​ఎంసీజీ కంపెనీలను సవాల్​ చేసేందుకు దాదాపు 60 బ్రాండ్లను కొనుగోలు చేయడానికి రెడీ అయింది.  సొంతగా 6.5 బిలియన్​ డాలర్ల విలువైన వినియోగ వస్తువుల వ్యాపారాన్ని నిర్మించాలనే టార్గెట్​తో పనిచేస్తోంది. ఇందుకోసం డజన్ల కొద్దీ చిన్న కిరాణా, నాన్​–ఫుడ్​ బ్రాండ్‌‌లను కొనుగోలు చేయనుంది.  రాబోయే ఆరు నెలల్లో 60 వరకు కిరాణా, హౌస్​హోల్డ్​, పర్సనల్​ కేర్ బ్రాండ్‌‌ల పోర్ట్‌‌ఫోలియోను నిర్మించాలని కోరుకుంటోంది. వీటిని మామ్ -అండ్ -పాప్ స్టోర్‌‌లకు,  పెద్ద రిటైల్ అవుట్‌‌లెట్‌‌లకు తీసుకెళ్లడానికి పెద్ద ఎత్తున డిస్ట్రిబ్యూటర్లను నియమించుకుంటున్నది.  రిలయన్స్ రిటైల్ కన్జూమర్‌‌ బ్రాండ్స్ అనే వెర్టికల్​ కింద ఈ కొత్త బిజినెస్​ ఉంటుంది. వీటికి రిలయన్స్​ రిటైల్​ స్టోర్లతో, జియోమార్ట్ తో సంబంధం ఉండదు. ప్రపంచంలోనే అతి పెద్దదైన భారతదేశ రిటైల్​ మార్కెట్ విలువ  దాదాపు 900 బిలియన్​ డాలర్లు. రిలయన్స్ దాదాపు 30 పాపులర్ ​లోకల్​ కన్జూమర్ బ్రాండ్‌‌లను పూర్తిగా కొనుగోలు చేయడానికి లేదా అమ్మకాల కోసం జాయింట్ వెంచర్లను  ఏర్పరచుకోవడానికి చర్చలు జరుపుతున్నదని, ఇవి చివరిదశలో ఉన్నాయని కంపెనీ వర్గాలు తెలిపాయి.  ఈ బ్రాండ్‌‌లను కొనుగోలు చేయడానికి కంపెనీ ఎంత డబ్బు ఖర్చు చేస్తుందనే విషయం స్పష్టంగా తెలియదు కానీ, ఈ కొత్త వ్యాపారం నుంచి ఐదేళ్లలోపు  6.5 బిలియన్ డాలర్ల వార్షిక అమ్మకాలను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి రిలయన్స్ బ్రాండ్ల హౌస్ అవుతుందని,  ఇది ఇనార్గానిక్​ విస్తరణ​ అని కంపెనీ సీనియర్​ ఎగ్జిక్యూటివ్​ ఒకరు కామెంట్ చేశారు. 

బడా కంపెనీలతో ఢీ...

భారతదేశంలో కొన్ని దశాబ్దాలుగా బిజినెస్​ చేస్తున్న నెస్లే, యూనిలీవర్, పెప్సికో,  కోకాకోలా వంటి మల్టీ నేషనల్ కంపెనీలను రిలయన్స్ సవాలు చేయడానికి ప్రయత్నిస్తోంది. రిలయన్స్ రిటైల్ కన్జూమర్ బ్రాండ్‌‌లు రెండు వేలకుపైగా ఉన్న రిటైల్​ స్టోర్ నెట్‌‌వర్క్‌‌లోకి వస్తాయి. జియోమార్ట్, రిలయన్స్​ డిజిటల్​ ద్వారా ఆన్​లైన్​ బిజినెస్​ కూడా చేస్తోంది.  రిలయన్స్ తన సొంత రిటైల్ నెట్‌‌వర్క్‌‌లో  డ్రింక్స్,  నూడిల్ ప్యాక్‌‌లను అమ్మడానికి కాంట్రాక్ట్ తయారీదారులను నియమించుకున్నది. కొన్ని ప్రైవేట్ లేబుల్‌‌లను (సొంత బ్రాండ్లు) అభివృద్ధి చేసింది. ఏడాది అమ్మకాల్లో వీటి వాటా రూ.3,500 కోట్ల  మాత్రమే. రిలయన్స్ సూపర్ మార్కెట్ వ్యూహం గురించి విదేశీ సంస్థలు ఇప్పటికే ఆందోళన చెందుతున్నాయి. రిలయన్స్​ ప్రైవేట్ లేబుల్స్ ఎంఎన్‌సీ బ్రాండ్లతో పోటీ పడుతున్నాయి.  కొనుగోలు లేదా  జాయింట్ వెంచర్ కోసం ఇది చర్చలు జరుపుతున్న బ్రాండ్‌‌లలో గుజరాత్‌‌లోని   హజూరి సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్ సాయ్​సో ఒకటి. ఈ వ్యాపారం కోసం డానోన్,  కెల్లాగ్ కో వంటి కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్‌‌లను కూడా కంపెనీ నియమించుకుంది.