- రెంట్‌కు తీసుకుంటున్న ఏఐ ఏజెంట్లు
- ఫుడ్, వస్తువుల డెలివరీ, హోం సర్వీసుల వంటి పనుల అప్పగింత
- క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు
- రెంట్ ఎ హ్యూమన్ ఏఐ వేదికగా ట్రెండ్
న్యూయార్క్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) రాకతో మన ఉద్యోగాలు పోతున్నాయని టెన్షన్ పడుతున్నారా? మరేం పర్వాలేదు.. ఇప్పుడు ఏఐ ఏజెంట్లే మనకు పనులు ఇస్తున్నాయి. అవి చెప్పిన పనులను చెప్పినట్టుగా చేసి పెడితే చాలు.. గంటకు ఇంత అని రేటు కట్టి మనకు డబ్బులు చెల్లిస్తున్నాయి. మన పనులను ఆటోమేటిక్ గా చేసిపెట్టేందుకని మనం ఏఐ ఏజెంట్లను సృష్టించుకుంటే.. ఇప్పుడు అవే మనుషులతో పనులు చేయించుకుంటూ కొత్త ట్రెండ్ కు తెరతీస్తున్నాయి. సర్ ప్రైజింగ్ గా ఉందా? అయితే, రెంట్ఏహ్యూమన్.ఏఐ వెబ్ సైట్ లోకి ఓ లుక్కేద్దాం రండి.
ప్రస్తుతం నడుస్తున్న ఏఐ జమానాలో మనుషులు ఆన్ లైన్ లో చేసే అనేక పనులను ఏఐ టూల్స్ క్షణాల్లో చేసి పెడుతున్నాయి. అలాగే కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్ల ద్వారా మన పనులను ఆటోమేటిక్ గా చేసి పెట్టేందుకని ప్రత్యేకంగా ఏఐ ఏజెంట్లు కూడా విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు ఏఐ ఏజెంట్లు తాము ఫిజికల్ గా చేయలేని పనుల కోసం మనుషులను రెంట్ కు తీసుకుంటున్నాయి. ఫుడ్, వస్తువుల డెలివరీ, కొత్త రకం ఆహారం, పానీయాలను రుచి చూసి టేస్ట్ టెస్ట్ చేయడం, హోం సర్వీసుల వంటి పనులను ఫిజికల్ గా చేయాల్సి ఉండటంతో వాటిని ఏఐ చేయలేదు. అందుకే ఇలాంటి పనులు చేసి పెట్టడం కోసం ‘రోబోలకు మీ శరీరం కావాలి’ అని పిలుపునిస్తోంది రెంట్ఏహ్యూమన్.ఏఐ. ఈ వెబ్ సైట్ ను అలెగ్జాండర్ లిటెప్లో అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ క్రియేట్ చేసి, ఈ మేరకు కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టాడు.
ఏఐ ‘కూలీ’ విధానం ఇలా..
ఏఐ ఏజెంట్లకు పని చేసి, డబ్బులు సంపాదించాలనుకునే వారు ముందుగా రెంట్ఏహ్యూమన్.ఏఐ వెబ్ సైట్ లోకి లాగిన్ అయి, తమ వివరాలను నమోదు చేసుకోవాలి. తమకు ఉన్న స్కిల్స్, చేయగలిగే పనులను తెలియజేయాలి. అలాగే మీరు చేసే పనికి గంటకు ఎంత డబ్బు కావాలన్నది కూడా చెప్పాలి. అంతే.. మీ ప్రొఫైల్ ను చూసి, అందులోని వివరాలకు మ్యాచ్ అయ్యే పనిని ఏఐ ఏజెంట్లు అప్పగిస్తాయి. ఉదాహరణకు.. మీరు ఉంటున్న సిటీలోని పలానా ఏరియాలో ఓ పార్సిల్ ను పికప్ చేసుకుని, పలానా అడ్రస్ కు చేరవేయాలి. లేదంటే కొత్తగా ఓపెన్ అయిన పలానా రెస్టారెంట్ కు వెళ్లి ఫుడ్ టేస్ట్ చేసి, ఎలా ఉందో చెప్పాలి. అలాగే ఎవరికైనా ఇంట్లో ఏమైన పనులు చేసి పెట్టాల్సి ఉన్నా.. వెళ్లి చేసి రావాలి. మొత్తంగా అప్పగించిన పనిని పూర్తి చేశాక.. ఆ పని కంప్లీట్ అయినట్టుగా ఫొటోలు, వీడియోలు అప్ లోడ్ చేయాలి. అంతే.. ఏఐ ఏజెంట్ ఇక మీకు డబ్బులను క్రిప్టో కరెన్సీ రూపంలో మీ అకౌంట్ లోకి ట్రాన్స్ ఫర్ చేసేస్తుందని చెప్తున్నారు.
గంటకు1 నుంచి 100 డాలర్ల వరకూ రెంట్..
రెంట్ఏహ్యూమన్.ఏఐ వెబ్ సైట్ లో కనిపిస్తున్న వివరాల ప్రకారం.. ఏఐ ఏజెంట్లకు కూలీలుగా పని చేసేందుకు ఇప్పటికే 1,23,027 మంది పేర్లను నమోదు చేసుకున్నారు. అమెరికా, కెనడా, జపాన్, ఇండియా, పాకిస్తాన్ వంటి అనేక దేశాలకు చెందినవారు ఇందులో ఉన్నారు. వీరిలో చాలా మంది గంట సేపు పని చేస్తే ఒక డాలరు ఇవ్వాలని పేర్కొనగా.. అనేక మంది పది, ఇరవై, యాబై, వంద అంటూ.. డిమాండ్ చేస్తున్నారు. కొందరైతే ఏకంగా 500 డాలర్ల వరకూ తమకు తాము రెంట్ డిసైడ్ చేసుకుంటున్నారు.
వర్కర్ల సేఫ్టీ, హక్కుల సంగతేంటీ?
ఏఐ ఏజెంట్లకు కూలీలుగా పని చేసే ట్రెండ్ బాగానే ఉన్నా.. ఇది ప్రపంచమంతా పాకి, విస్తృతంగా అందుబాటులోకి వస్తే.. పరిస్థితి ఎలా ఉంటుందోనని అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ఏఐ ఏజెంట్లు ఏం పని చెప్తాయి? ఆ పని చేసేవాళ్లకు సేఫ్టీ ఏమిటి? వారికి డబ్బులు చెల్లించకపోయినా, లేదంటే తప్పుడు పనులు చేయించినా ఎవరు బాధ్యత వహిస్తారు? ఇప్పుడు ఫుడ్ డెలివరీ, ఇతర పనులు చేసే గిగ్ వర్కర్లకు హక్కుల విషయంలో నిబంధనలు ఉన్నాయి. కానీ, ఏఐ ఏజెంట్లు కూడా గిగ్ వర్కర్లకు మేనేజర్లుగా పని చేస్తే.. అప్పుడు వారి హక్కుల సంగతి ఏమిటన్న ప్రశ్నలు వస్తున్నాయి.
