నిజామాద్ జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీ..బోధన్ సెగ్మెంట్లోని ఎడపల్లిలో భూ సేకరణ

నిజామాద్  జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీ..బోధన్ సెగ్మెంట్లోని ఎడపల్లిలో భూ సేకరణ
  • బోధన్ సెగ్మెంట్​లోని ఎడపల్లిలో భూ సేకరణ 
  • నిర్మల్, నిజామాబాద్ జిల్లాల రైతులకు మేలు 
  • షుగర్ ఫ్యాక్టరీ రీఓపెనింగ్ ఆలస్యానికి ప్రత్యామ్నాయంగా మిల్లు ఏర్పాటు

నిజామాబాద్, వెలుగు : చెరకు రైతులు ఆసక్తి చూపకపోవడంతో బోధన్​లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీ రీఓపెనింగ్ ఆలస్యమవుతోంది.  దీనికి ప్రత్యామ్నాయంగా జిల్లాలో పామాయిల్​​ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు, అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎడపల్లి మండలంలోని ఏఆర్​పీ క్యాంప్​నకు సమీపంలో సుమారు 200 ఎకరాలు కొనుగోలు చేసేందుకు మాజీ మంత్రి,  స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి రైతులతో సంప్రదింపులు జరిపారు.

సీఎం రేవంత్​రెడ్డిని జిల్లాకు రప్పించి పామాయిల్ పరిశ్రమ ప్రకటన చేయించాలని ఆలోచిస్తున్నారు. జనహిత పాదయాత్రలో భాగంగా ఈ నెల 3న జక్రాన్​పల్లి మండలం అర్గుల్ గ్రామంలో నిర్వహించిన మీటింగ్​లో టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్​గౌడ్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ స్థానంలో పామాయిల్ ఫ్యాక్టరీ రాబోతున్నట్లు తెలిపారు.  

రెండు జిల్లాలకు మేలు జరిగేలా..

జిల్లాలో పంట భూముల విస్తీర్ణం 5.60 లక్షల ఎకరాలు కాగా, వరి సాగు 4.32 లక్షల ఎకరాలు ఉంది. సాగునీటి కొరత, వర్షాధారంపై సాగవుతున్న పంటలతో రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. వరి స్థానంలో అధిక లాభాలు వచ్చే ఆయిల్​పామ్ సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని  నిర్ణయించారు. ఐదేండ్లకు ఆయిల్​పామ్​ పంట కోతకు వస్తుంది.

రూ.195 విలువగల మొక్కను రైతులకు కేవలం రూ.20 ఇవ్వడంతోపాటు ఏడాదికి పెట్టుబడి ఖర్చు కింద ప్రభుత్వం రూ.4,200 అందిస్తోంది. ప్రస్తుతం 5,625 ఎకరాలున్న ఆయిల్ పామ్ సాగును పెంచేందుకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎకరానికి రూ.లక్ష ఆదాయం వస్తుందని వ్యవసాయ, హార్టికల్చర్ అధికారులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

ఫ్యాక్టరీ ఏర్పాటుతో పంట దిగుబడి అమ్మేందుకు ఇబ్బందులు ఉండవని రైతులకు భరోసా కల్పించనున్నారు. నిజాంషుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు ప్రభుత్వం సిద్ధంగా ఉండగా, రైతులు చెరకు సాగుకు ముందుకు రావట్లేదు. దీంతో రీఓపెనింగ్ ఆలస్యమవుతోంది.  ప్రత్యామ్నాయంగా పామాయిల్ పరిశ్రమను తెరమీదకు తెచ్చిన ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి సర్కార్ రాయితీలతో పాటు భూమి ఇప్పిస్తామని ప్రీయునిక్ కంపెనీ వారిని ఒప్పించారు.

నిర్మల్​, నిజామాబాద్​ రెండు జిల్లాల రైతులకు మేలు జరిగేలా బోధన్ సెగ్మెంట్​లో పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటును ఆయన సీరియస్​గా తీసుకున్నారు. ఈ క్రమంలో నేషనల్ హైవే రోడ్ ఫెసిలిటీ గల ఏరియాలో 200 ఎకరాల ల్యాండ్ అమ్మకానికి రైతులను ఒప్పించారు. సీఎం రేవంత్ ప్రకటన తరువాత కంపెనీ మేనేజ్​మెంట్​తో కొనుగోలు చేయిస్తారు. పామాయిల్ పరిశ్రమతో పాటు బియ్యం ముడిసరుకుగా ఇథనాల్ ఫ్యాక్టరీ స్థాపనకూ ప్రయత్నాలు జరుగుతున్నాయి.  

ల్యాండ్​ చూశాం

జిల్లాలో పామాయిల్​​ ఫ్యాక్టరీ కోసం బోధన్ సెగ్మెంట్​లో అనువైన ల్యాండ్స్ పరిశీలించాం. నిర్మల్,​ నిజామాబాద్ రెండు జిల్లాల రైతులకు మేలు జరిగేలా పరిశ్రమ ఏర్పాటు కానుంది. నిజాంషుగర్ ఫ్యాక్టరీ ప్రత్యామ్నాయంగా పామాయిల్​ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కృషి చేస్తున్నాం. - శ్రీనివాస్​, హార్టికల్చర్ ఏడీ