
- బీఆర్కేలో ఎట్ల పన్జేయాలె
- డ్యూటీ చేయలేక ఉద్యోగుల ఇబ్బందులు
- పాత సెక్రటేరియెట్ కూల్చనప్పుడు ఎందుకు తరలించారంటూ ఆక్రోశం
- 9 ఫ్లోర్లకు రెండే లిఫ్టులు.. గంటలకొద్దీ అక్కడే వృథా
- రిపేర్ల వల్ల కమ్ముకుంటున్న దుమ్ము, ధూళి
- ముక్కుకు కర్చీఫ్ కట్టుకుని వస్తున్న కొందరు ఎంప్లాయిస్
తాత్కాలిక సెక్రటేరియెట్ బీఆర్కే భవన్‌లో డ్యూటీ చేస్తున్న ఉద్యోగులు సమస్యలతో సతమతమవుతున్నారు. మరమ్మతులు పూర్తి కాకముందే శాఖలను షిఫ్ట్ చేయటంతో ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ పనిచేసే వాతావరణం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఆదరబాదరగా పాత సెక్రటేరియెట్ నుంచి వెళ్లగొట్టారు. శాఖలను, ఉద్యోగులను ఖాళీ చేయించారు. కానీ ఇంత వరకు కూల్చివేతపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు వెళ్లగొట్టారు” అని ప్రశ్నిస్తున్నారు. 45 రోజుల నుంచి షిఫ్టింగ్ జరుగుతున్నా మరమ్మతులు మాత్రం ఇప్పటికీ పూర్తి కాలేదు. మరో 15 నుంచి 20 రోజుల వరకు పడుతుందని పనులు చేపడుతున్న వారు చెబుతున్నారు.
సగం టైమ్.. లిఫ్ట్ ల దగ్గరే
పాత సెక్రటేరియెట్ లోని అన్ని బ్లాక్ ల్లో మూడు, నాలుగు ఫ్లోర్లు మాత్రమే ఉన్నాయి. ప్రతి బ్లాక్ కు 4 లిఫ్ట్ లు ఉండటంతో ఇబ్బందులు రాలేదు. కానీ బీఆర్కే భవన్ లో 9 ఫ్లోర్లు ఉండగా, ఉద్యోగులకు, కార్మికులకు కలిపి రెండు లిఫ్ట్ లు మాత్రమే పనిచేస్తున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎంతో రద్దీ ఉంటోంది. మహిళా ఉద్యోగులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండే లిఫ్ట్ లు ఉండటం, వీటిలో పనులు చేసే కార్మికులు, సామగ్రి పైకి తీసుకెళ్తుండటంతో ఉద్యోగులకు ఒక్కటే లిఫ్ట్ ఉంది. సీఎస్, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు మరో లిఫ్ట్ ఉండగా.. అక్కడా వెయిటింగ్ తప్పడం లేదు.
ముక్కుకు కర్చీఫ్ అడ్డుపెట్టుకుని..
బీఆర్కే భవన్ లో మరమ్మతులతో దుమ్ము, ధూళి, పెయింట్స్, సున్నం నుంచి వచ్చే కెమికల్ వాసనతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. కొంత మంది ముక్కులకు కర్చీఫ్, మాస్క్ లు అడ్డుపెట్టుకుంటున్నారు. అసలే విష జ్వరాలు వస్తుండటంతో ఈ వాసన పీలిస్తే ఏ రోగాలు వస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. వెలుతురు లేకపోవటం, కిటీకీలు తీస్తే తెలుగు తల్లి ఫ్లై ఓవర్ ట్రాఫిక్ శబ్దాలు, హుస్సేన్ సాగర్ కాలుష్యం ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయని చెబుతున్నారు.
ఉద్యోగుల హాజరు తగ్గుతోంది..
రోజురోజుకు ఉద్యోగుల హాజరు తగ్గుతోంది. పని చేసే వాతావరణం లేకపోవటం, అన్ని ఫ్లోర్లలో బీరువాలు, ఫైళ్ల కట్టలు ఉండటంతో విధులకు వెనుకడుగు వేస్తున్నారు. అసెంబ్లీ ఉన్నన్ని రోజులు సెలవులు ఇవ్వకపోవటంతో ఇప్పుడు లీవ్‌లు పెట్టుకుంటున్నారు. అధికారులు కూడా చూసీచూడనట్లు
వ్యవహారిస్తున్నారు.
చాంబర్లు రెడీ కాలే
బీఆర్కే భవన్ లో సీఎస్ జోషి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తోపాటు మరో ఇద్దరు, ముగ్గురు చాంబర్లు మాత్రమే సిద్ధమయ్యాయి. మిగతా వారి చాంబర్లలో పనులు సాగుతున్నాయి. అధికారులు ముఖ్యమైన ఫైళ్లను ఇంటి నుంచే క్లియర్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
నో ఇంటర్ నెట్
బీఆర్కేలో సీఎస్, కొందరు ఆఫీసర్లకు మాత్రమే నెట్ సౌకర్యం
బీఆర్కే భవన్(తాత్కాలిక సెక్రటేరియట్)కు ఇప్పటివరకు ఇంటర్ నెట్ సౌకర్యం కల్పించలేదు. సుమారు నెల రోజుల నుంచి బీఆర్కే భవన్ నుంచే వివిధ శాఖల ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటివరకు నెట్ సౌకర్యం కల్పించకపోవటంతో ఉద్యోగులు, అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. కేవలం సీఎస్, కొందరు ఉన్నతాధికారుల చాంబర్లకు మాత్రమే ఇంటర్ నెట్ సౌకర్యం కల్పించారని ఉద్యోగులు చెబుతున్నారు. పలువురు ఉద్యోగులు ఇంటర్ నెట్ కోసం జియో డోంగిల్ ను తెచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. సెక్రటేరియట్ లో మొత్తం 36 శాఖలు ఉండగా ప్రతి శాఖ www.goir.telangana.gov.in లో జీవోలు అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనికి హై స్పీడ్ ఇంటర్ నెట్ సౌకర్యం ఉండాలి. పాత సెక్రటేరియట్ నుంచి బీఆర్కే భవన్ కు శాఖలు షిఫ్ట్ అయినా ఇంటర్ నెట్ సౌకర్యం కల్పించలేదు. పాత సెక్రటేరియట్ లో ఉన్నపుడు అన్ని శాఖలు కలిపి నిత్యం 30 నుంచి 40 వరకు జీవోలు అప్ లోడ్ చేసేవి. బీఆర్కే భవన్ కు షిఫ్ట్అయిన తరువాత జీవోల సంఖ్య 10లోపే ఉంటోంది. కొన్ని శాఖలలో 15కి పైగా సెక్షన్లు ఉండగా, అన్ని శాఖల సెక్షన్ ఆఫీసర్లకు నెట్ సౌకర్యం కల్పించలేదని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక్కో శాఖలో ఒకటి, రెండు సెక్షన్లకు మాత్రమే నెట్ సౌకర్యం కల్పించి అక్కడి నుంచే ఇతర సెక్షన్ అధికారులను కూడా జీవోలను అప్ లోడ్ చేయాలని ఉన్నతాధికారులు చెప్పారని అంటున్నారు. దాదాపు 45 రోజులు అవుతున్నా బీఆర్కే భవన్ లో మరమ్మతులు ఇప్పటికీ పూర్తి కాలేదు. రిపేర్లకు మరో 15 రోజులు సమయం పడుతుందని ఆర్ & బీ అధికారులు చెబుతున్నారు.
పూర్తికాని కేబుల్ నిర్మాణం
శాఖలు బీఆర్కే కు షిఫ్ట్అయినప్పటికి ఇంటర్ నెట్ సౌకర్యం అందించే ఓఎఫ్ సీ కేబుల్ నిర్మాణం జరగలేదు. దీంతో ఇంటర్ నెట్ సౌకర్యం అందించలేకపోతున్నట్లు ఐటీ అధికారులు చెబుతున్నారు. త్వరలో కేబుల్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
మంత్రుల చాంబర్లకు రిపేర్లు
బీఆర్కే భవన్‌లో మంత్రుల చాంబర్లలో రెనోవేషన్ పనులు ప్రారంభమయ్యాయి. మొదటి ఫ్లోర్‌ను 9 మంది మంత్రుల చాంబర్లకు కేటాయించగా రెండు రోజుల క్రితం పనులను ఆర్ అండ్ బీ అధికారులు స్టార్ట్ చేశారు. సీలింగ్‌లో మార్పులు, కరెంట్ వైర్లు మార్చడం, కొన్నిచోట్ల గోడల నిర్మాణం, క్యాబిన్ల ఏర్పాటు పనులు చేస్తున్నారు. మంత్రి ఈటల రాజేందర్ చాంబర్‌లో పనులు పూర్తికావొచ్చాయి.