ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్.. తొలి రెండు మ్యాచ్‌లకు షమీ దూరం

ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్.. తొలి రెండు మ్యాచ్‌లకు షమీ దూరం

ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తుంది. చీలమండ గాయం కారణంగా టీమిండియా స్టార్  ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్‌లో మొదటి 2 టెస్టులకు దూరమయ్యే అవకాశం ఉంది. సౌతాఫ్రికాతో  జరిగిన రెండు-టెస్టుల సిరీస్‌లో షమీ ఫిట్‌నెస్ పరీక్షను క్లియర్ చేయడంలో విఫలమయ్యాడు. మొదట స్క్వాడ్ లో ఎంపిక చేసినా.. పూర్తి ఫిట్ నెస్ సాధించని కారణంగా షమీ ఈ సిరీస్ అంతటా దూరమయ్యాడు. ఇంగ్లాండ్ సిరీస్ లోనైనా రీ ఎంట్రీ ఇస్తాడనుకుంటే అది జరిగేలా కనిపించడం లేదు. 

నివేదికల ప్రకారం షమీ ఇంకా బౌలింగ్ చేయడం ప్రారంభించలేదని.. అతని ఫిట్‌నెస్ నిరూపించుకోవడానికి NCA కి వెళ్తాడని పేర్కొంది. ఇటీవలే భారత్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ లో అద్భుత ప్రదర్శన తర్వాత షమీ టీంఇండియాలో కనిపించలేదు. వన్డే ప్రపంచకప్‌లో  మహమ్మద్ షమీ అదరగొట్టాడు. మొదటి నాలుగు మ్యాచ్ లకు అతనికి అవకాశం దక్కకపోగా ఆడిన 7 మ్యాచ్ ల్లో 24 వికెట్లు పడగొట్టి లీగ్‌లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. 2023లో తన సంచలన ప్రదర్శనకు గాను ప్రతిష్టాత్మకమైన అర్జున అవార్డును అందుకోబోతున్నారు.

ఇంగ్లాండ్ తో భారత్ జనవరి 25 నుంచి 5 టెస్టుల సిరీస్ ఆడుతుంది. సిరీస్ లో భాగంగా తొలి టెస్టు హైదరాబాద్ లో జరగనుంది. విశాఖపట్నం, రాజ్‌కోట్, రాంచీ, ధర్మశాలలో వరుసగా 2,3,4,5 టెస్టులు ఆడాల్సి ఉంది. గత నెలలో ఇంగ్లాండ్ జట్టును ప్రకటించగా.. త్వరలో భారత జట్టుకు ఎంపిక చేస్తారు.