రెండేళ్లుగా డోపింగ్ టెస్టులకు కోహ్లీ డుమ్మా.. ఈ జాబితాలో మరో 11 మంది భారత ఆటగాళ్లు

రెండేళ్లుగా డోపింగ్ టెస్టులకు కోహ్లీ డుమ్మా.. ఈ జాబితాలో మరో 11 మంది భారత ఆటగాళ్లు

డోపింగ్ టెస్ట్ అనగానే వెనకడుగు వేస్తున్న భారత ఆటగాళ్ల లిస్ట్ చాలా పెద్దగానే ఉంది. ఇందులో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.. వంటి ఆటగాళ్లు కూడా ఉన్నారు. సమాచార హక్కు చట్టం 2005 కింద ఈ వివరాలు బయటకొచ్చాయి.

2021- 22 మధ్య భారత ప్రభుత్వ ఆధీనంలో ఉన్న నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) తగినన్ని డోప్ పరీక్షలు నిర్వహించలేదని ప్రపంచ డోపింగ్ నిరోధక ఏజెన్సీ (వాడా) ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డోప్ టెస్ట్ ఎదుర్కొన్న అథ్లెట్లు, ఆటగాళ్ల వివరాలు తెలుకునేందుకు ఓ జాతీయ ఛానల్.. సమాచార హక్కు చట్టం 2005 కింద నాడాను సమాచారం కోరగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.  

ఆ లెక్కల ప్రకారం 2021-2022 మధ్య రెండేళ్లలో 5,961 మంది భారత క్రీడాకారులకి డోపింగ్ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 114 మంది భారత క్రికెటర్లు కాగా, మిగిలిన 1717 మంది అథ్లెట్స్. 

రోహిత్ శర్మ ఆరుసార్లు

గడిచిన రెండేళ్లలో అత్యధిక సార్లు డోపింగ్ టెస్టు చేయించుకున్న ఏకైక క్రికెటర్ రోహిత్ శర్మ మాత్రమే. హిట్‌మ్యాన్ గడిచిన రెండేళ్లలో ఆరు సార్లు డోపింగ్ పరీక్షల్లో పాల్గొన్నారు. అయితే దీని వెనుక బలమైన కారణమే ఉంది. 2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న రోహిత్, గతేడాది ఆడిన మ్యాచుల కంటే ఆడని మ్యాచులే ఎక్కువ. గాయాలతో కొన్ని మ్యాచులకు దూరమైన రోహిత్, అనంతరం కరోనా బారిన పడ్డారు. దీని నుంచి కోలుకోవడానికి మందులు వాడిన తర్వాత డోప్ టెస్టుకి శాంపిల్స్ ఇవ్వడం తప్పనిసరైంది. ఈ క్రమంలో ఆరు సార్లు హాజరయ్యారు.

అదే సమయంలో రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, ఛెతేశ్వర్ పుజారా వంటి ఏడుగురు ఆటగాళ్లు ఒక్కసారి మాత్రమే డోప్ టెస్టు ఎదుర్కొన్నారు. వీరు కూడా గాయాల బారిన పడిన తర్వాత ఈ శాంపిల్స్ ఇవ్వడం గమనార్హం.

12 మంది బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ ఆటగాళ్లు

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఉన్న 25 మంది క్రికెటర్లలో 12 మంది ఇప్పటిదాకా నాడాకి డోప్ శాంపిల్స్ ఇవ్వలేదు. వీరిలో విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, అర్ష్‌దీప్ సింగ్, శ్రేయాస్ అయ్యర్, దీపక్ హుడా, సంజూ శాంసన్, శ్రీకర్ భరత్, వాషింగ్టన్ సుందర్‌లు ఉన్నారు. 

ఇక భారత మహిళా క్రికెటర్లలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన.. గరిష్టంగా మూడుసార్లు శాంపిల్స్ ఇచ్చిన వారిలో ఉన్నారు. ఈ వివరాలు బహిర్గతమయ్యాక.. టీమిండియా ఆటగాళ్లపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డోపింగ్ టెస్ట్ అంటే ఎందుకంత భయం అని ప్రశ్నిస్తున్నారు.