IPL 2024: ట్రావిస్ హెడ్‌పై కావ్యా పాప కళ్లు.. ఈసారి పకడ్బందీగా వ్యూహాలు

IPL 2024: ట్రావిస్ హెడ్‌పై కావ్యా పాప కళ్లు.. ఈసారి పకడ్బందీగా వ్యూహాలు

వరల్డ్ కప్ 2023 ముగిసింది.. నెక్స్ట్ ఏంటి అంటారా! ఐపీఎల్. మనదేశంలో ఈ  క్యాష్ రిచ్ లీగ్‌కు ఉన్న క్రేజ్ మీ అందరికీ తెలిసిందే. ఈ టోర్నీ మొదలవడానికి మూడు నెలల ముందు నుంచే దేశంలో సందడి వాతావరణం కనిపిస్తుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. మరో రెండు వారాల్లో ఐపీఎల్ వేలం జరగనుండటంతో ఎక్కడ చూసినా అవే మాటలు వినపడుతున్నాయి. ఒకవైపు ఆటగాళ్ల క్రయవిక్రయాలపై ఐపీఎల్ ప్రాంఛైజీలు వ్యూహాలు పన్నుతుంటే.. మరోవైపు ఎక్కడ సిట్టింగ్ వేయాలని అభిమానులు, ఏయే జట్ల బలాలు ఎలా ఉన్నాయని బెట్టింగ్ రాయుళ్లు వ్యూహాలు రచిస్తున్నారు.

డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా ఐపీఎల్ 2024 వేలం జరగనుంది. ఈ మెగా యాక్షన్‌కు ఐపీఎల్ ప్రాంఛైజీ  సన్‌రైజర్స్‌ హైదరాబాద్(ఎస్‌ఆర్‌హెచ్) సమాయత్తమవుతోంది. రిటెన్షన్ ప్రక్రియలో సంచలన నిర్ణయం తీసుకున్న ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం.. రూ. 13 కోట్ల ఆటగాడు హ్యారీ బ్రూక్‌ సహా మరో ఐదుగురిపై వేటు వేసింది. ఇప్పుడు ఆ డబ్బుతో ఎవరిని చేజిక్కించుకోవాలనే దానిపై వ్యూహాలు రచిస్తోంది. గత సీజన్‌లలో చేసిన తప్పులు పునరావృతం చేయకుండా ఈసారి చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తోందట.  

ట్రావిస్‌ హెడ్‌

భారత్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచ కప్‌లో ట్రావిస్‌ హెడ్‌ చెలరేగిపోయిన విషయం తెలిసిందే. గాయం కారణంగా మెగా టోర్నీలోకి లేట్‌గా ఎంట్రీ ఇచ్చినా.. ఘనంగా ముగించాడు. భారత్‌తో జరిగిన ఫైనల్ పోరులో ఏకంగా శతకం (137) బాది ఆసీస్ జట్టును ఆరోసారి జగజ్జేతగా నిలిపాడు. ఈ ఒక్క ప్రదర్శనతో హెడ్ ఐపీఎల్‌ మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో చేరిపోయాడు. వేలంలో ఇతన్ని చేజిక్కించుకునేందుకు మూడు నుంచి నాలుగు ప్రాంఛైజీలు పోటీ పడనున్నాయట. ఆ జాబితాలో మన తెలుగు ప్రాంఛైజీ సన్‌రైజర్స్‌ కూడా ఉందని సమాచారం.  

రూ.34 కోట్లు

రిటెన్షన్ ప్రక్రియ ముగిశాక సన్‌రైజర్స్‌ ఖాతాలో రూ.34 కోట్లు మిగిలి ఉంది. ఆ డబ్బులో సగం వెచ్చించైనా హెడ్ ను దక్కించుకోవాలని కావ్యా మారన్ సారథ్యంలోని ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం నిర్ణయించిందని సమాచారం. అతన్ని చేజిక్కికుంటే ఓపెనర్ బాధ కూడా తీరుతుందని భావిస్తోందట. ఎయిడెన్‌ మార్క్రమ్‌, రాహుల్‌ త్రిపాఠి, గ్లెన్‌ ఫిలిప్స్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌ రూపంలో మిడిల్ ఆర్డర్.. భువనేశ్వర్‌ కుమార్‌, నటరాజన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, ఫజల్‌ హక్‌ ఫారూకీ రూపంలో బౌలర్లకు కొదవలేదు కనుక హెడ్ ను దక్కించుకోవాలనే నిర్ణయం మంచిదేనని నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి వేలం రొజు కావ్యా పాప ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుందో లేదో వేచిచూడాలి.

సన్‌రైజర్స్‌ వదిలించుకున్న ఆటగాళ్లు: హ్యారీ బ్రూక్‌, ఆదిల్‌ రషీద్‌, సమర్థ్‌ వ్యాస్‌, కార్తీక్‌ త్యాగీ, వివ్రాంత్‌ శర్మ మరియు అకీల్‌ హొసేన్‌. 

సన్‌రైజర్స్‌ కొనసాగించనున్న ఆటగాళ్లు: ఎయిడెన్‌ మార్క్రమ్‌ (కెప్టెన్‌), అభిషేక్‌ శర్మ, గ్లెన్‌ ఫిలిప్స్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, రాహుల్‌ త్రిపాఠి, మయాంక్‌ అగర్వాల్‌, అబ్దుల్‌ సమద్‌, మార్కో జన్సెన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌, ఉపేంద్ర సింగ్‌ యాదవ్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, మయాంక్‌ మార్కండే, భువనేశ్వర్‌ కుమార్‌, టి నటరాజన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, ఫజల్‌ హక్‌ ఫారూకీ, సన్వీర్‌ సింగ్‌,  షాబాజ్‌ అహ్మద్‌ (ఆర్సీబీ నుంచి ట్రేడింగ్‌).