కాంగ్రెస్​కు రిపబ్లికన్​ పార్టీ ఆఫ్​ ఇండియా మద్దతు

కాంగ్రెస్​కు రిపబ్లికన్​ పార్టీ ఆఫ్​ ఇండియా మద్దతు

హైదరాబాద్​, వెలుగు: కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా బుధవారం మద్దతు తెలిపింది. పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ మహేశ్​ కుమార్​ గౌడ్ ఆ పార్టీ నేతలతో కలిసి గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్​ను అధికారంలోకి తీసుకు రావాలని ప్రజలు నిశ్చయిం చుకున్నారని తెలిపారు. తొమ్మిదేండ్లుగా రాష్ట్రంలో అరాచక పాలన చేసిన బీఆర్​ఎస్​ గద్దె దిగిపోవాలని చెప్పారు. ఈశ్వరీ బాయీ పెట్టిన రిపబ్లికన్​ పార్టీ ఆఫ్​ ఇండియా.. కాంగ్రెస్​కు మద్దతు తెలపడం శుభ పరిణామమని వెల్లడించారు. 

తెలంగాణలో కాంగ్రెస్​ అధికారంలోకి రావడం రాష్ట్ర,దేశ రాజకీయాలకు ఎంతో అవసరమన్నారు. కాంగ్రెస్​కు తమ పార్టీ బేషరతుగా మద్దతు తెలుపుతున్నదని రిపబ్లికన్​ పార్టీ ఆఫ్​ ఇండియా నేత మహేశ్ బాబు తెలిపారు. ఈ పార్టీని బాబా సాహెబ్​ అంబేద్కర్​ స్థాపించగా.. తెలుగు రాష్ట్రాలకు ఈశ్వరీ బాయీ తీసుకొచ్చారన్నారు. ఆమె ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేశారన్నారు. కాగా, కాంగ్రెస్​కు మద్దతు తెలపడంతో రిపబ్లికన్ పార్టీ ఆఫ్​ ఇండియాకు  తెలంగాణ రాష్ట్ర కమ్యూనికేషన్స్​ ఇన్​చార్జి అజయ్​ కుమార్​ ఘోష్​ కృతజ్ఞతలు తెలిపారు.