ఎస్సీ, ఎస్టీలకు .. ఇంటికి రూ. 12 లక్షలు ఇస్తాం : తెలంగాణ కాంగ్రెస్

ఎస్సీ, ఎస్టీలకు .. ఇంటికి రూ. 12 లక్షలు ఇస్తాం : తెలంగాణ కాంగ్రెస్
  • అవినీతి కేసీఆర్‌ సర్కారును గద్దె దించాలి: ఖర్గే
  • ప్రజల కోసం సోనియాగాంధీ రాష్ట్రం ఇచ్చారు
  • తెలంగాణ తెచ్చే శక్తి కేసీఆర్‌కు ఎక్కడిది?
  • సోనియాతో ఫొటో దిగిండు..తర్వాత మాటమార్చిండు
  • బీఆర్ఎస్, బీజేపీ బయట తిట్టుకుంటయ్​.. లోపల మంతనాలు జరుపుతయ్​
  • రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని ధీమా
  • డిక్లరేషన్​ను పక్కాగా అమలు చేస్తామని హామీ
  • రాష్ట్రంలో మరో ఉద్యమం రావాలి: రేవంత్​
  • పేదల భూములను కేసీఆర్ గుంజుకుంటున్నడు: భట్టి
  • చేవెళ్లలో ప్రజా గర్జన బహిరంగ సభ
  • ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12 శాతానికిరిజర్వేషన్లు పెంచుతం
  • ఎస్సీ వర్గీకరణ చేస్తం.. దళిత, గిరిజన డిక్లరేషన్​లో కాంగ్రెస్​ ప్రకటన

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీల్లోని ఒక్కో కుటుంబానికి అంబేద్కర్​ అభయహస్తం కింద రూ. 12 లక్షలు ఇస్తామని ఆ పార్టీ ప్రకటించింది. ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతానికి రిజర్వేషన్లు పెంచుతామని తెలిపింది. ఈ కేటగిరీల్లో టెన్త్​ నుంచి పీహెచ్​డీ స్టూడెంట్లకు ‘విద్యా జ్యోతి పథకం’ కింద రూ.10 వేల నుంచి 5 లక్షల దాకా ప్రోత్సాహకాలిస్తామని హామీ ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణ చేస్తామని తెలిపింది. 

శనివారం చేవెళ్లలోని కేవీఆర్​ గ్రౌండ్స్ లో నిర్వహించిన ‘ప్రజాగర్జన’ బహిరంగ సభలో దళిత, గిరిజన డిక్లరేషన్​ను పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి ప్రకటించారు. దీన్ని ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున ఖర్గే విడుదల చేశారు.  దళితులు, గిరిజనులకు రిజర్వేషన్ల పెంపు, ఆర్థిక సాయం, అసైన్డ్​ ల్యాండ్​ పంపకం, పోడు హక్కులు, విద్యార్థులకు లబ్ధి చేకూర్చే స్పెషల్​ రిజర్వేషన్లు సహా మొత్తం 12 పాయింట్లను ఇందులో పొందుపరిచారు. 

ఖర్గే మాట్లాడుతూ.. అవినీతి కేసీఆర్​ సర్కార్​ను వచ్చే ఎన్నికల్లో గద్దె దించాలని పిలుపునిచ్చారు. ‘‘తెలంగాణలో కేసీఆర్‌ సర్కారును గద్దె దించడానికి కాంగ్రెస్‌ నాయకులంతా  కలిసి పోరాడాలి.. ఒకరి కాళ్లు ఒకరు లాక్కోవద్దు.. కేసీఆర్​ది అత్యంత అవినీతి ప్రభుత్వం. ఈ గవర్నమెంట్‌ను ఓడించాలంటే అంతా కలిసికట్టుగా ముందుకు సాగాలి” అని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ను, లోక్​సభ ఎన్నికల్లో మోదీని ఓడించాలని సూచించారు. 

ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటే దుఃఖం ఆగదు

తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటే తనకు చాలా  దుఃఖం వస్తుందని, రాష్ట్రం కోసం ఎంతో పోరాటం జరిగిందని, ఇందులో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారని ఖర్గే చెప్పారు. ‘‘ఈ వేదిక మీద ఉన్న వారంతా తెలంగాణ కోసం పోరాడారు.. తెలంగాణ ప్రజల కోసం రాష్ట్రాన్ని సోనియాగాంధీ ఇచ్చారు. కానీ తెలంగాణ వల్ల ఒకే కుటుంబం లాభపడింది. వాళ్ల కోసమే తెలంగాణ వచ్చింది అనుకుంటున్నరు.. 

తెలంగాణ తెచ్చే శక్తి కేసీఆర్‌కు ఎక్కడిది? కేంద్రంలో వాళ్లకు పవర్‌ ఉందా..? సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. మాకు మద్దతు ఇవ్వాల్సిన కేసీఆర్ ఇవ్వలేదు. తెలంగాణ క్రెడిట్ అంతా తనదే...అంతా తానే చేసినట్లు కేసీఆర్ వ్యవహరిస్తున్నడు. తెలంగాణ ఇచ్చినందుకు అప్పట్లో సోనియా నివాసానికి కేసీఆర్​ వచ్చి ధన్యవాదాలు తెలిపిండు.. ఫొటోలు దిగిండు. జనపథ్‌ దాటగానే మాట మార్చిండు.. అని అన్నారు.

 అధికారంలోకి వచ్చాక కేసీఆర్‌ హామీలు అమలు చేయలేదని మండిపడ్డారు. ‘‘తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తీరుతుంది. అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలు అమలు చేసి తీరుతం. కాంగ్రెస్‌ పార్టీ ఏదైతే చెప్తుందో వాటిని అమలు చేసి చూపుతుంది. కర్నాటకలో 5 వాగ్దానాలను ఇచ్చినం..ఇప్పుడు వాటిని అమలు పరుస్తున్నం. తెలంగాణలో ఇస్తున్న 12 వాగ్దానాలను కూడా అమలు చేస్తం” అని చెప్పారు. 

అమిత్​షా వస్తున్నడు.. కాంగ్రెస్​ ఏం చేసిందంటడు

‘‘తెలంగాణకు అమిత్‌షా వస్తున్నడు. గత 53 ఏండ్లలో కాంగ్రెస్ ఏం చేసిందని అడుగుతడు. కాంగ్రెస్‌ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశ స్వరూపమే మార్చింది. కాంగ్రెస్‌ ఏం చేసిందో ఆయనకు ప్రజలే చెప్పాలి” అని మల్లికార్జున ఖర్గే అన్నారు. కేసీఆర్ పార్టీకి బీజేపీతో అంతర్గత ఒప్పందం ఉందని, అందుకే కేసీఆర్ బీజేపీని, బీజేపీ కేసీఆర్​ను ఏమీ అనడం లేదని ఆరోపించారు. హైదరాబాద్ సంస్థానానికి స్వేచ్ఛ, స్వాతంత్య్రం కల్పించింది కాంగ్రెస్. మా పార్టీ నేతలు పటేల్, నెహ్రూ కలిసి హైదరాబాద్ సంస్థానంతో పాటు 562 సంస్థానాలను ఇండియాలో కలిపారు. 

ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని ఇచ్చింది కాంగ్రెస్. ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్‌, ఇస్రో, డీఆర్‌డీఓ, ఓన్‌జీసీ ఇవన్నీ  ఏర్పాటు చేసింది కాంగ్రెస్సే. హైదరాబాద్‌లో ఉన్న జాతీయ సంస్థలన్నీ నెహ్రూ హయాంలోనే ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో ఎన్నో పరిశ్రమలు ఏర్పాటు చేశాం” అని ఆయన తెలిపారు.  ‘‘ఆహార భద్రత చట్టాన్ని మేమే తెచ్చాం.. తెలంగాణలోని సాగు నీటి ప్రాజెక్టులను కట్టింది కాంగ్రెస్‌ పార్టీనే.  మేం చేసిన అభివృద్ధి పనుల వల్లే ఆహారధాన్యాల ఉత్పత్తి పెరిగింది. పీవీ నర్సింహారావు హయాంలో భూసంస్కరణలు చేశారు. కొందరు ప్యూడల్‌ వ్యక్తులు ఆయనను దించారు. 

ఇందిరాగాంధీ దేశవ్యాప్తంగా భూసంస్కరణలు తీసుకువచ్చారు. బ్యాంకుల జాతీయం చేశారు. కాంగ్రెస్‌ హయాంలో వైట్‌ రెవెల్యూషన్‌ , గ్రీన్‌  రెవెల్యూషన్‌ తీసుకువచ్చినం. రాజీవ్‌ గాంధీ కంప్యూటర్‌, మొబైల్‌ రివెల్యూషన్‌ తీసుకువచ్చారు. ఆయన వల్లే నేడు టెక్నాలజీ రంగం ఇంత అభివృద్ధి సాధించింది. ఉపాధిహామీ పథకం తెచ్చింది కాంగ్రెస్సే” అని ఆయన వివరించారు. పాకిస్తాన్‌ను రెండుగా విడదీసి బంగ్లాదేశ్‌ను ఏర్పాటు చేసింది కాంగ్రెస్‌ పార్టీనేనని, కాంగ్రెస్‌ ఏం చేసిందనే వాళ్లు ఇవన్నీ తెలుసుకోవాలని ఖర్గే అన్నారు. ‘‘కాంగ్రెస్‌ పార్టీ, రాజ్యాంగం లేకపోతే, ప్రజాస్వామ్యం లేక పోతే నేను కాంగ్రెస్‌ పార్టీ ప్రెసిడెంట్‌ను అయ్యేవాడ్ని కాదు” అని తెలిపారు. 

మోదీ సర్కార్‌ను  ఓడించేందుకు ఏకమైనం

‘‘దేశవ్యాప్తంగా కాంగ్రెస్​తోపాటు మొత్తం 24 పార్టీలు కలిసి మోదీ సర్కారును గద్దె దించేం దుకు సిద్ధమయ్యాయి. కేసీఆర్‌ ఒక మీటింగ్‌కు కూడా రాలేదు. మోదీని ఓడించడానికి సెక్యూ లర్‌ పార్టీలు అంతా ఒక్కటైతే  ఇక్కడ సెక్యూ లర్‌ అని చెప్పుకునే కేసీఆర్‌  మాత్రం మోదీతో మిలాఖత్‌ అయ్యిండు. కేసీఆర్‌ బయట బీజేపీ ని తిడతడు. లోపల మంతనాలు జరుపుతడు” అని ఖర్గే అన్నారు. 

రాష్ట్రంలో కేసీఆర్​ ఓడిపో వడం ఖాయమని, కాంగ్రెస్​ అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్​ నేతలంతా కలిసికట్టుగా ముందుకు సాగాలని, వర్కింగ్‌ కమిటీలో తెలంగాణ నేతలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు. ఇంకా లిస్ట్‌ ఉందని, ఇంకా వచ్చేది ఉందని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డితోపాటు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితుడు దామోదర రాజనర్సింహ,  ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, నేతలు సంపత్​ కుమార్​, మధుయాష్కీ గౌడ్​, షబ్బీర్​ అలీ, జానా రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, సీతక్క తదితరులు పాల్గొన్నారు. 

కాంగ్రెస్​ దళిత, గిరిజన డిక్లరేషన్​లో 12 పాయింట్లు

1. రిజర్వేషన్లు: జనాభా దామాషా ప్రకారం ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతానికి రిజర్వేషన్ల పెంపు. ఎస్సీల్లో ఏ, బీ, సీ, డీ వర్గీకరణ. 
2. అంబేద్కర్​ అభయ హస్తం: ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ. 12 లక్షల ఆర్థిక సాయం
3. స్పెషల్​ రిజర్వేషన్లు: అన్ని ప్రభుత్వం కాంట్రాక్టుల్లోనూ ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం ప్రత్యేక రిజర్వేషన్ల అమలు. ప్రైవేటు విద్యా సంస్థలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు పొందే ప్రైవేటు కంపెనీల్లోనూ స్పెషల్​ రిజర్వేషన్లు. 
4. ఇందిరమ్మ ఇండ్లు: ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీలకు ఇండ్ల స్థలాలు. అందులో ఇల్లు కట్టుకునేందుకు రూ. 6 లక్షల ఆర్థిక సాయం
5. భూ హక్కులు: ఎస్సీ, ఎస్టీలకు అసైన్డ్​ ల్యాండ్స్​పై యాజమాన్య హక్కులను కల్పిస్తం. అసైన్డ్​ భూములకు యజమానులను చేస్తం. 
6. పోడు హక్కులు: పోడు భూములపై ఎస్టీలకు సర్వాధికారాలు. అమ్ముకోవాలన్నా, బ్యాంకులో తాకట్టు పెట్టుకోవాలన్నా పూర్తి హక్కులు గిరిజనులకే. 2006లో సోనియా గాంధీ తీసుకొచ్చిన అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు హక్కుల పట్టాలు.
7. సమ్మక్క, సారక్క గిరిజన గ్రామీణాభివృద్ధి పథకం: ప్రతి తండా, గిరిజన గూడేలు, గిరిజన పంచాయతీలకు ఏటా రూ. 25 లక్షల నిధులు. వాటి అభివృద్ధికి సహకారం. 
8. ఎస్సీలకు కార్పొరేషన్లు: దళితుల కోసం మూడు కార్పొరేషన్ల ఏర్పాటు. మాల, మాదిగతోపాటు ఎస్సీ ఇతర ఉపకులాలకు కార్పొరేషన్లు. దళితుల అభ్యున్నతి కోసం ప్రతి కార్పొరేషన్​కు ఏటా రూ. 750 కోట్ల కేటాయింపు. 
9. ఎస్టీ కార్పొరేషన్లు: గిరిజనుల కోసం కూడా మూడు కార్పొరేషన్ల ఏర్పాటు. తుకారాం ఆదివాసీ కార్పొరేషన్​, సంత్​ సేవాలాల్​ లంబాడా కార్పొరేషన్​, ఎరుకల కార్పొరేషన్​ ఏర్పాటు. వారి అభ్యున్నతి కోసం ప్రతి కార్పొరేషన్​కు ఏటా రూ.500 కోట్లు కేటాయింపు. 
10. ఐటీడీఏలు, ఆస్పత్రులు: మైదాన ప్రాంతాల్లోని గిరిజనుల కోసం ఐదు కొత్త ఐటీడీఏలు, 9 సూపర్​ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటు. నల్గొండ, మహబూబాబాద్​, ఖమ్మం, నిజామాబాద్​, మహబూబ్​నగర్​ జిల్లాల్లో వాటి ఏర్పాటు.

11. విద్యాజ్యోతి పథకం: ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చదువుల్లో మంచి ప్రతిభ కనబరిస్తే ఆర్థిక ప్రోత్సాహకాలు. పదో తరగతి పాస్​ అయితే రూ. పది వేలు, డిగ్రీ పూర్తి చేస్తే రూ.25 వేలు, పీజీ కంప్లీట్​ చేస్తే రూ. లక్ష, ఎంఫిల్​, పీహెచ్​డీ పూర్తి చేసిన వారికి రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక ప్రోత్సాహకాలు,  ఇంటర్​ పాసైతే రూ.15 వేలు.

12. గురుకులాలు: ప్రతి మండలంలోనూ ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యాసంస్థల ఏర్పాటు. వారికోసం ప్రతి మండలంలోనూ ప్రత్యేక హాస్టళ్ల ఏర్పాటు. ఫీజు రీయింబర్స్​మెంట్​ ద్వారా అందరికీ విద్య. గ్రాడ్యుయేషన్​, పీజీ చేసే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉచితంగా హాస్టల్​ సదుపాయం. విదేశీ యూనివర్సిటీల్లో ప్రవేశం పొందిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఆర్థిక సాయం.