బండి సంజయ్​ని కలిసిన లోకాయుక్త కాలనీవాసులు

బండి సంజయ్​ని కలిసిన లోకాయుక్త కాలనీవాసులు

హైదరాబాద్, వెలుగు:అర్ధరాత్రి పోలీసులు వచ్చి తమ గుడిసెల్లోని సామాన్లను డీసీఎంలలో వేసుకుని తీసుకెళ్లిపోయారని, ఎంఐఎం ఎమ్మెల్యే బలాల ఒత్తిడితోనే తమను రోడ్డున పడేశారని సైదాబాద్ లోకాయుక్త కాలనీ గుడిసె వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ను కలిసి వాళ్లు గోడు వెళ్లబోసుకున్నారు. తాము 50 ఏండ్ల నుంచి అక్కడే ఉంటున్నామని, కరెంట్, నల్లా కనెక్షన్లు ఉన్నా, ట్యాక్స్​లు కడుతున్నా అది ప్రైవేటు భూమి అంటూ తమను బలవంతంగా ఖాళీ చేయించారని చెప్పారు.

ఇండ్లకు సంబంధించిన అన్ని ఒరిజినల్ పేపర్లను గుంజుకుపోయారని, పిల్లలున్నారని కూడా చూడకుండా 50 కుటుంబాలను రోడ్డున పడేశారని కన్నీరు పెట్టుకున్నారు.3 రోజులుగా రోడ్డుపైనే ఉంటున్నామన్నారు. ఇండ్లకు సంబంధించి ప్రస్తుతం తమ వద్ద జిరాక్స్​ డాక్యుమెంట్లే ఉన్నాయన్నారు. వారికి అండగా ఉంటామని సంజయ్ భరోసా ఇచ్చారు. వెంటనే వారందరికీ నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని పార్టీ నేతలకు చెప్పారు. వాళ్ల జిరాక్స్ డాక్యుమెంట్లను పరిశీలించాలని పార్టీ లీగల్ టీంకు పంపించారు.