నల్లాలకు మోటార్లు పెట్టి గుంజుతున్నరు!

నల్లాలకు మోటార్లు పెట్టి గుంజుతున్నరు!
  • దాదాపు 40 శాతం మంది ఇదే పని చేస్తున్నరు. 
  • నీటి దోపిడీపైవాటర్​బోర్డు సీరియస్
  • దొరికితే రూ.5 వేల ఫైన్, కనెక్షన్ కట్

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్​పరిధిలో గ్రౌండ్​వాటర్​తగ్గి బోర్ల నుంచి నీళ్లు రాకపోవడంతో జనాలు మంచినీటి నల్లాలకు మోటార్లు పెట్టి గుంజుతున్నారు. ఇది ఎంతకు పెరిగిందంటే.. నల్లా కనెక్షన్లు ఉన్నవారిలో సుమారు 40 శాతం మంది ఇదే పని చేస్తున్నారు. అంటే బోర్డు పరిధిలో 14.25 లక్షల నల్లా కనెక్షన్లు ఉండగా, వీటిలో దాదాపు 6 లక్షల కనెక్షన్​దారులు నీటి సరఫరా జరుగుతున్న టైంలో నల్లాలకు మోటార్లను బిగిస్తున్నారు. దీంతో ఇతర ప్రాంతాల వారికి సరైన ప్రెషర్​తో నీళ్లు రాక ఇబ్బందులు పడుతున్నారు.

నీళ్లొచ్చినప్పుడల్లా లోప్రెషర్​సమస్య ఎదుర్కొంటున్నామని బోర్డులోని కస్టమర్​కేర్​కు ఫిర్యాదులు చేస్తున్నారు. అపార్ట్​మెంట్లు, కమర్షియల్​ప్రాంగణాలు, బస్తీలు, కాలనీల్లో ఎక్కువగా ఈ పని చేస్తున్నారని గుర్తించారు. ఈ క్రమంలో త్వరలోనే డివిజన్ల వారీగా నీటి సరఫరా జరుగుతున్న సమయాల్లో విజిలెన్స్​ విభాగంతో కలిసి తనిఖీలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. నల్లాలకు మోటార్లను బిగించే వారి కనెక్షన్​ కట్​చేయడంతో పాటు రూ.5 వేల జరిమానా విధించాలని భావిస్తున్నారు.