
- హరితహారం, ఓడీఎఫ్ టార్గెట్లతో మెడపై కత్తి
- ఊర్లలో జనంపై ఒత్తిడి చేయలేని పరిస్థితి
- నాయకుల దాడులు ఓవైపు..సర్కారు హెచ్చరికలు మరోవైపు..
- ఇప్పటికే పలుచోట్ల సస్పెన్షన్లు, షోకాజ్ నోటీసులు
- అసెంబ్లీలో సీఎం చేసిన వ్యాఖ్యలతో పెరిగిన అభద్రత
- సర్కారు తీరుతో ఆందోళన.. టెన్షన్ తట్టుకోలేక రాజీనామాలు
హైదరాబాద్, వెలుగు: జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు కొలువొచ్చిన సంబురం లేకుండా పోయింది. ఇన్నాళ్లుగా పంచాయతీ కార్యదర్శులకు ఉన్న చెక్‌పవర్ పోవడం, మరిన్ని అధికారాలకూ కత్తెరపడటం, పైగా బాధ్యతలు పెరగడం ఇబ్బందికరంగా మారింది. కొలువులో చేరిన 3 నెలలకే హరితహారం, ఓడీఎఫ్ టార్గెట్ల పేరిట మెడపై సస్పెన్షన్ కత్తి వేలాడుతుండటం, రాజకీయ నాయకుల దాడులు, దౌర్జన్యాలు పెరగడంతో టెన్షన్‌కు లోనవుతున్నారు. హరితహారం, ఓడీఎఫ్ పథకాల అమల్లో స్థానికంగా సర్పంచ్‌లు, కొందరు ప్రజలు సహకరించకపోయినా.. దానికి తాము బలికావాల్సి వస్తోందని వాపోతున్నారు.
దాడులు, దౌర్జన్యాలతో..
పలు ప్రభుత్వ పథకాల అమల్లో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. టాయిలెట్లు నిర్మించాల్సిందేనని ఒత్తిడి పెంచితే.. గ్రామస్తుల నుంచి దాడులు, దౌర్జన్యాలకు గురికావాల్సి వస్తోంది. ఓడీఎఫ్ పూర్తి చేయలేకపోతే అధికారుల నుంచి షోకాజ్ నోటీసులు, సస్పెన్షన్ ఉత్తర్వులు అందుకోవాల్సి వస్తోంది. కొత్తగూడెం జిల్లా గాంధీనగర్ జూనియర్ పంచాయతీ కార్యదర్శిపెద్ది లక్ష్మికి ఇదే పరిస్థితి ఎదురైంది. గ్రామంలో టాయిలెట్లు నిర్మించుకోని తొమ్మిది ఇళ్లకు సంబంధించి పై అధికారుల ఆదేశాల మేరకు జూన్ 27న కరెంట్ సరఫరా నిలిపివేశారు. దీంతో ఇద్దరు గ్రామస్తులు లక్ష్మిపై దాడి చేశారు. దాంతో ఆమె చేతికి గాయాలయ్యాయి.
కరీంనగర్ జిల్లా ఇరుకుల్ల గ్రామ జూనియర్ పంచాయతీ కార్యదర్శి సర్ల పద్మ ఈ నెల 23న లబ్ధిదారులకు పింఛన్ ఉత్తర్వు పత్రాలు పంపిణీ చేస్తుండగా.. గ్రామ సర్పంచ్ భర్త బలుసుల శంకర్ వచ్చి పెన్షన్ ఉత్తర్వులు పంచాలని ఎవరు చెప్పారంటూ కుర్చీతో దాడికి ప్రయత్నించాడు. అంతకుముందు కూడా అతను పంచాయతీ రికార్డులు రాయకుండా ఆమె దగ్గర నుంచి లాక్కున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మర్రిగూడెంలో స్థానిక నర్సరీని సందర్శించడానికి వెళ్లిన జూనియర్ పంచాయతీ కార్యదర్శి నిమ్మల వెంకట్‌ను స్థానిక వన సేవక్ భర్త, టీఆర్‌ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడైన రమేశ్ తిట్టాడు. ‘మొక్కల వివరాలు నీకు చెప్పాల్సిందేంట’ని తిడుతూ, బెదిరించినట్టుగా వెంకట్ విడుదల చేసిన ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇలా రోజూ ఏదో ఒక చోట పంచాయతీ కార్యదర్శులపై దౌర్జన్యాలు జరుగుతూనే ఉన్నాయని, ఉద్యోగం కాపాడుకునేందుకు మౌనంగా భరించాల్సి వస్తోందని జూనియర్లు వాపోతున్నారు. పంచాయతీ కార్యదర్శులపై ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల తర్వాత చాలా చోట్ల జనం తమను చులకనగా చూస్తున్నారని, ఉద్యోగం విషయంలో అభద్రతకు గురవుతున్నామని ఓ జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి యూనియన్లు పెట్టొద్దని సర్కారు ఒప్పంద పత్రం తీసుకోవడంతో కలిసి మాట్లాడుకునే పరిస్థితి కూడా లేకుండా పోయిందని వాపోయారు.
కొలువుకు రాం రాం..
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల్లో కొందరు ఒత్తిళ్లు, దౌర్జన్యాలు తట్టుకోలేక నౌకరీని వదిలేసి వెళుతున్నారు. రాజకీయ ఒత్తిళ్లు, రోజువారీ విధి నిర్వహణపై అవగాహన లేకపోవడం, పెరిగిన పని భారం, తగిన వేతనం లేకపోవడం, ఉద్యోగ భద్రతపై ఆందోళన వంటివి ఇబ్బందికరంగా మారాయి. అయితే మంచి ఉద్యోగాలు రావడంతో ఉద్యోగం మానేస్తున్నవారూ ఉన్నారు. మొత్తంగా 9,355 మందికి జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వగా.. సుమారు 1,100 మందికిపైగా అసలు విధుల్లో చేరలేదని తెలిసింది. ప్రస్తుతం 8,178 మంది కార్యదర్శులు విధులు నిర్వర్తిస్తున్నట్టు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఇక విధుల్లో చేరినవారిలో గత మూడు నెలల్లోనే 200 మంది వరకు వివిధ కారణాలతో రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ వర్గాల సమాచారం మేరకు.. సంగారెడ్డి జిల్లాలో16 మంది, సిద్దిపేట జిల్లాలో 38, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 8, మహబూబాబాద్ జిల్లాలో 10, జనగామ జిల్లాలో 9 మంది, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇద్దరు మానేసిన జాబితాలో ఉన్నారు. పంచాయతీరాజ్ ఉన్నతాధికారులకు ఇప్పటివరకు 36 మంది రాజీనామా లేఖలు చేరినట్టు తెలిసింది. మరో 200 మంది రిజైన్ లెటర్లు వివిధ జిల్లాల డీపీవోలు, ఎంపీడీవోల వద్ద ఉన్నట్టు సమాచారం. రాజీనామా చేసినవారిలో ఫారెస్ట్, టీఆర్టీ, గ్రూప్–2 ఉద్యోగాలు వచ్చినవారు 50 మంది వరకు ఉన్నట్టు తెలుస్తోంది.
జూనియర్లకు అండగా ఉంటం
– పర్వతాలు, పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు