
సింగరేణిలో మొన్నటి వరకు అధికార యూనియన్‌గా వ్యవహరించిన బీఆర్‌ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) అధ్యక్షులు బి.వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగెర్ల మల్లయ్య తమ పదవులకు రాజీనామా చేశారు. సింగరేణి కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ పోటీ చేసే విషయంలో ఆలోచిస్తున్నామని యూనియన్ గౌరవాధ్యక్షురాలు కవిత చెప్పడం, ఎన్నికలను ఈ నెల 27న నిర్వహించాలని హైకోర్టు గురువారం తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈ ముగ్గురు కీలక నేతలు రాజీనామా నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లో మాజీ సీఎం కేసీఆర్ ఇంటి వద్ద యూనియన్ గౌరవాధ్యక్షురాలు కవిత ఉండడంతో ఆమెను కలిసేందుకు ఈ ముగ్గురు లీడర్లు గురువారం ఉదయం వెళ్లారు.
తాము వచ్చిన విషయాన్ని కవిత పీఏకు తెలిపినప్పటికీ ఆమె మధ్యాహ్నం వరకు బయటకు రాలేదు. దీంతో సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్ యూనియన్ పోటీ చేసే విషయంలో బీఆర్‌ఎస్ హైకమాండ్ సానుకూలంగా లేదనే భావనకు వచ్చిన వెంకట్రావు, రాజిరెడ్డి, కెంగెర్ల మల్లయ్య తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు రాసి ఆ పత్రాన్ని కవిత పీఏకు వాట్సప్ ద్వారా పంపించారు. అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఎన్నికల్లో పోటీ చేయని యూనియన్‌కు నాయకత్వం వహించడమేందని నారాజ్‌తో ఉన్న ఈ ముగ్గురు కీలక నేతలు తమ రాజీనామా విషయాన్ని శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాకు వెల్లడించేందుకు సిద్ధమయ్యారు.
కాగా, సింగరేణిలో మొత్తం 11 డివిజన్లు ఉండగా 2012లో జరిగిన గుర్తింపు ఎన్నికల్లో కొత్తగూడెం, రామగుండం 3, భూపాలపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ డివిజన్లలో గెలిచి టీబీజీకెఎస్ మొదటి సారిగా గుర్తింపు సంఘంగా వ్యవహరించింది. ఆ తర్వాత 2017లో జరిగిన ఎన్నికల్లో కొత్తగూడెం కార్పొరేట్, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు, శ్రీరాంపూర్, బెల్లంపల్లి, రామగుండం 1, రామగుండం 2, రామగుండం 3 డివిజన్లలో గెలిచి రెండోసారి కూడా గుర్తింపు హోదా సాధించింది. రెండు పర్యాయాలు కలిపి 10 ఏళ్లకు పైగా టీబీజీకేఎస్ అధికార యూనియన్‌గా వ్యవహరించడం, యూనియన్ లీడర్లపై అవినీతి, లంచగొండితనం వంటి ఆరోపణలు రావడంతో పాటు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోల్‌బెల్ట్ పరిధిలోని ఎనిమిది నియోజకవర్గాలలో బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఓడిపోయారు. వాళ్ల ఓటమికి టీబీజీకేఎస్ యూనియన్ నేతల తీరే కారణమనే భావనతో హైకమాండ్ ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్ పోటీకి దూరంగా ఉంచినట్టు తెలుస్తున్నది. తాము యూనియన్‌కు రాజీనామా చేశామని ఏరియా, బ్రాంచి లీడర్లకు వారు చెప్పారు. దీంతో చాలామంది టీబీజీకేఎస్నాయకులు ఐఎన్టీయూసీలో చేరాలని భావిస్తున్నారు.