మళ్లీ మొదలైన రిసార్ట్ రాజకీయాలు

మళ్లీ మొదలైన రిసార్ట్ రాజకీయాలు

రాజ్యసభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ నేతల దృష్టి సడెన్ గా క్యాంప్ రాజకీయాలపై మళ్లింది.భారత్ లో ఎన్నికల హడావిడి మొదలవగానే రహస్యంగా మంతనాలు జరపడం, రిసార్ట్స్ లో పార్టీ నాయకులను ఉంచడం కొత్తేమీ కాదు. అదే తరహాలో ఈ సారి కూడా పలు ప్రధాన రాజకీయ పార్టీలు తమ ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో చర్చలు జరుపుతున్నాయి. ఈ నెల 10న 16 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ఆయా పార్టీల నేతలు పలు ప్రయత్నాలు కొనసాగిస్తుండగా... మహారాష్ట్రలో కూడా రాజకీయం రోజురోజుకూ వేడెక్కుతుంది. ఈక్రమంలో శివసేన  పార్టీ తమ ఎమ్మెల్యేలను ప్రత్యేక బస్సులో ముంబై సబర్బన్ మలాడ్ లోని రిసార్ట్ నుంచి ట్రైడెంట్ హోటల్ కు తరలించింది. తమ పార్టీ ఎమ్మెల్యేలు చేజారకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టింది. ‘‘ శివసేనకు చెందిన శాసనసభ్యులందరినీ ముంబైకి పిలిపించారు. జూన్ 10న ఎన్నికలు జరిగే వరకు ఎమ్మెల్యేలంతా ఒకేచోట ఉంటారు" అని శివసేన ఎమ్మెల్యే ఒకరు తెలిపారు.

ఇంకో ముఖ్య విషయమేమిటంటే సాధారణంగా మహారాష్ట్రలో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేవారు. గత 22 ఏళ్లుగా అదే జరుగుతోంది. కానీ 22 ఏళ్ల విరామం తర్వాత ఇప్పుడు మళ్లీ ఓటింగ్ జరగనుండడంతో ఉత్కంఠ నెలకొంది. ఇదే తరహాలో రాజస్థాన్, కర్ణాటక, హర్యానాలోనూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు, ఫిరాయింపులను అడ్డుకునేందుకు తమ ప్రజాప్రతినిధులను రిసార్టులకు తరలిస్తున్నాయి. పలువురు నేతలు పదవీ విరమణ పొందుతున్న కారణంగా 15 రాష్ట్రాల్లో 57 స్థానాలకు గానూ ఖాళీలు ఏర్పడ్డాయి. కాగా వారిలో 41మంది 11 రాష్ట్రాల నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక మరియు హర్యానా నాలుగు రాష్ట్రాల నుంచి మిగిలిన 16 మంది ఎంపీలను ఎన్నుకోవడం కోసం పోటీ జరుగుతోంది. మహారాష్ట్రలో అత్యధికంగా 6 సీట్లకు ఎన్నికలు జరగనుండగా.. రాజస్థాన్ లో 4, కర్ణాటకలో 4, హర్యానాలో 2 సీట్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. హర్యానా, రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్రలలో అభ్యర్థులు ఎవరూ పోటీ నుంచి తప్పుకోలేదు. దీంతో ఆ రాష్ట్రాల్లో తీవ్రమైన పోటీ నెలకొంది.