ముంబై: బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కింగ్‌గా అవతరించగా.. ఏక్నాథ్ షిండే సారథ్యంలోని శివసేన కింగ్‌మేకర్‌గా మారింది. ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌ను బీజేపీ పాలించాలంటే షిండే శివసేన మద్దతు తప్పనిసరి. బీఎంసీలోని మొత్తం 227 సీట్లలో 114 స్థానాలు వచ్చిన పార్టీకి మేయర్ పీఠం దక్కుతుంది. ఈ ఎన్నికల్లో మహాయుతి కూటమికి 118 సీట్లు వచ్చాయి.
ఇందులో బీజేపీ 89 సీట్లు గెలవగా.. షిండే శివసేన 29 సీట్లు సాధించింది. ఈ నేపథ్యంలో బీఎంసీపై మహాయుతి జెండా ఎగరనుంది. బీఎంసీ చరిత్రలోనే ఇది చాలా పెద్ద మార్పు. గత 25 ఏండ్లుగా థాకరే కుటుంబం (శివసేన) బీఎంసీపై ఆధిపత్యం చెలాయించింది. ఇప్పుడు ఆ ఆధిపత్యానికి గండిపడింది. ఉద్ధవ్ థాకరే శివసేన(యూబీటీ)కి ఈ ఎన్నికల్లో 65 సీట్లు మాత్రమే వచ్చాయి. థాకరే సోదరులు ఇద్దరూ కలిసి పోటీచేసినా ఉపయోగం లేకుండా పోయింది.
మేయర్ పదవి కోరుతున్న షిండే శివసేన
బీజేపీ ఈ ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించినా పూర్తి మెజారిటీ మాత్రం రాలేదు. బీఎంసీ పీఠం దక్కాలంటే షిండే శివసేన మద్దతు తప్పనిసరి. దీంతో ఏక్నాథ్ షిండే కీలకంగా మారారు. ప్రస్తుతం ముంబై మేయర్ పోస్టుపై చర్చ జరుగుతున్నది. మేయర్ పోస్టు తమకే దక్కాలని బీజేపీ, షిండే శివసేన పట్టుబడుతున్నాయి.
బాలాసాహెబ్ థాకరే వారసత్వం పేరుతో వారు ఈ డిమాండ్ చేస్తున్నారు. ఫలితాల వెల్లడి తర్వాత షిండే సేన తన 29 కార్పొరేటర్లను ముంబైలోని ఓ ప్రైవేటు ఫైవ్‌స్టార్ హోటల్‌కు తరలించింది. దీంతో ముంబైలో రిసార్ట్ రాజకీయాలు మళ్లీ మొదలయ్యాయని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మేయర్ పదవి ఏ పార్టీని వరించనుందనే ఉత్కంఠ నెలకొంది.
