రేవంత్ పాలనలో ఉద్యమకారులకు గౌరవం: డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు

రేవంత్ పాలనలో ఉద్యమకారులకు గౌరవం: డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు

ముషీరాబాద్‌, వెలుగు: రాష్ట్రంలో ఉద్యమకారులను గుర్తించి వారి పోరాటానికి తగిన న్యాయం చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని మాజీ సమాచార కమిషనర్‌, రాష్ట్ర పోలీసు కంప్లైంట్‌ అథారిటీ సభ్యుడు డాక్టర్​ వర్రె వెంకటేశ్వర్లు తెలిపారు.

‘52 ఏళ్ల అరుణోదయంలో 50 ఏళ్ల విమలక్క ప్రస్థానం’పై ఆదివారం హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉద్యమ కళాకారిణిగా తన గొంతుతో ఎన్నో పాటలు పాడి, ఎంతో మందిని చైతన్యవంతులను చేస్తూ 50 ఏళ్లుగా విమలక్క తన ప్రస్థానాన్ని కొనసాగించడం గర్వకారణమన్నారు. ప్రస్తుత సమాజంలోని ప్రతి మహిళ విమలక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

తెలంగాణ చలనచిత్ర రంగంలో రాణిస్తున్న వారికి గద్దర్‌ పేరిట నంది అవార్డులు ఇవ్వడం, అందెశ్రీ రాసిన పాటను రాష్ట్ర గీతంగా గుర్తించడం, చాకలి ఐలమ్మ పేరిట యూనివర్సిటీకి పేరు పెట్టడం, సర్దార్‌ పాపన్నగౌడ్‌ విగ్రహాన్ని రాష్ట్ర సచివాలయం ఎదుట ఏర్పాటు చేయడం, సీతక్కను మంత్రిని చేయడం, తెలంగాణ ఉద్యమ జేఏసీ అధ్యక్షుడు కోదండరాంను ఎమ్మెల్సీగా చేయడం, శ్రీకాంత్‌చారి తల్లిని గౌరవించడం వంటి చర్యల ద్వారా ఉద్యమకారులను గుర్తించి గౌరవించిన ఘనత కాంగ్రెస్​ ప్రభుత్వానికి దక్కుతోందని గుర్తుచేశారు.