
- సీఎస్‌తో పాటు అర డజన్ అధికారులపై చర్యలు తప్పవు
- లాంగ్ వీకెండ్‌ను ఆసరాగా చేసుకొని ప్రీప్లాన్డ్‌గా చెట్లను నరికేశారు
- అధికారుల తీరును సమర్థించొద్దు
- సీజేఐ జస్టిస్ గవాయ్ ఆగ్రహం
- మొక్కలను పెంచుతున్నట్లు తెలిపిన ప్రభుత్వ తరపు అడ్వకేట్ సింఘ్వీ
- సీఈసీ రిపోర్ట్‌కు కౌంటర్ దాఖలుకునాలుగు వారాల టైం కావాలని విజ్ఞప్తి
- జులై 23కు తదుపరి విచారణ వాయిదా
- ఈ అంశంలో సంబంధం లేని పలు పిటిషన్లపై సుప్రీం అసంతృప్తి
కంచ గచ్చిబౌలిలో పర్యావరణాన్ని పునరుద్ధరించకపోతే... జైలుకు వెళ్లాల్సిందే. ఇలాంటి అంశంలో అధికారులను సమర్థించుకునే ప్రయత్నం చేయొద్దు. చీఫ్ సెక్రటరీ, ఇతర అధికారులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. లాంగ్ వీకెండ్ (శుక్ర, శని, ఆదివారాల మూడు రోజుల సెలవులు)ను ఆసరాగా తీసుకొని ఇంత పెద్ద మొత్తంలో చెట్లు నరికేస్తారా? డజన్ల కొద్ది బుల్డోజర్లు తీసుకొచ్చి విధ్వంసం సృష్టిస్తారా?’’ అని సీజేఐ బీఆర్ గవాయ్ సీరియస్ అయ్యారు. వారాంతంలో చెట్లు నరకడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. అయితే సుస్థిర అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని తెలిపారు.
న్యూఢిల్లీ, వెలుగు: కంచ గచ్చిబౌలిలో చెట్లు నరికిన 100 ఎకరాల్లో తిరిగి చెట్లు పెంచకపోతే సీఎస్‌ను జైలుకు పంపిస్తామని సుప్రీంకోర్టు మరోసారి హెచ్చరించింది. సీఎస్‌తో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న అర డజన్ అధికారులను ఆ ప్రాంతంలోని కొలనులో తాత్కాలిక జైలు కట్టి అక్కడే పెడ్తామని వ్యాఖ్యానించింది. చెట్ల నరికివేత అనేది పూర్తిగా ప్రీప్లాన్డ్ చర్య అని, లాంగ్ వీకెండ్‌ను ఆసరాగా చేసుకొని డజన్ బుల్డోజర్లతో చెట్లు నరికారని మండిపడింది. కంచ గచ్చిబౌలి భూ వ్యవహారంలో సుమోటో కేసుతో పాటు ‘బీ ద ఛేంజ్ వెల్ఫేర్’ సొసైటీ, ఇతరుల ఇంప్లీడ్ పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపింది.
అమికస్ క్యూరీ పరమేశ్వర్, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్లు అభిషేక్ మనుసింఘ్వీ, మేనక గురుస్వామి, ‘బీ ద ఛేంజ్ వెల్ఫేర్ సొసైటీ’ పిటిషన్ తరఫున అడ్వకేట్పి.మోహిత్‌రావు, ఓ ఇంప్లిడ్ అప్లికేషన్తరఫున అడ్వకేట్ ఎస్.నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ గవాయ్ స్పందిస్తూ.. 100 ఎకరాల్లో తిరిగి చెట్లను పెంచకపోతే సహించేది లేదని, సీఎస్‌ను జైలుకు పంపుతామని హెచ్చరించారు.
అసలు చెట్లు నరికేందుకు ఎన్విరాన్మెంటల్ సర్టిఫికేట్(ఈసీ) తీసుకున్నారా? లేదా అని నిలదీసింది. తొలుత ప్రభుత్వ తరపు అడ్వకేట్ సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. గత ఆదేశాలను అనుసరించి కంచ గచ్చిబౌలి స్థలంలో అన్ని పనులను నిలిపివేశామని స్పష్టం చేశారు. వైల్డ్ లైఫ్ సంరక్షణ చర్యలు కూడా కొనసాగుతున్నాయని తెలిపారు. గత వారమే సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ(సీఈసీ) రిపోర్ట్ వచ్చిందని చెప్పారు. దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు కొంత సమయం కావాలన్నారు.
రెండు రాత్రుల్లో చదును చేశారు: అమికస్ క్యూరీ
కంచ గచ్చిబౌలిలో బుల్డోజర్లతో చదును చేసిన శాటిలైట్ ఫొటోలను సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ(సీఈసీ)కి ఫారెస్ట్ సర్వీస్ ఆఫ్ ఇండియా ఇచ్చిందని అమికస్ క్యూరీ పరమేశ్వర్ కోర్టుకు తెలిపారు. 104 ఎకరాలను కేవలం రెండు రాత్రుల్లో చదును చేశారని, ఇందులో 60 శాతం మోస్తారు, దట్టమైన అటవీ ప్రాంతం ఉందని వివరించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం రిప్లే ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటే తమకేమి అభ్యంతరం లేదన్నారు. ఈ సందర్బగా చెట్లు నరికివేసేందుకు అసలు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకున్నారా? లేదా అని సీజేఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఇందుకు సింఘ్వీ బదులి స్తూ.. సెల్ప్ సర్టిఫికెట్ తీసుకున్నామని తెలిపారు. గత విచారణ సందర్బంగా దీనిపై కోర్టు అభ్యంతరం తెలిపిందని, సుదీర్ఘ వాదనలు జరిగాయని చెప్పారు. 50 హెక్టార్లకుపైగా ఉంటే ఈసీ క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంటుందని, చెట్ల ఎత్తు ఆధారంగా సెల్ప్ సర్టిఫికెట్ తీసుకున్నట్లు కోర్టుకు నివేదించారు. కానీ.. ఈ వాదనలపై సీజేఐ బెంచ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ నుంచి అధికారులను కాపాడుకోవాలంటే.. అటవీని పునరుద్ధరించే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. లేదంటే సీఎస్, సంబంధిత అధికారులు కంచ గచ్చిబౌలి భూమిలోనే తాత్కాలిక జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది.
మొక్కలు నాటుతున్నం: సింఘ్వీ
గత ఆదేశాలను అనుసరించి అటవీ పునరుద్ధరణ చర్యల్లో భాగంగా మొక్కలు నాటుతున్నామని సీజేఐ బెంచ్ దృష్టికి అడ్వకేట్ సింఘ్వీ తీసుకెళ్లారు. పెద్ద మొ త్తంలో అటవీ పునరుద్ధరణ, మొక్కలు నాటే ప్రక్రియ కొనసాగుతున్నదని చెప్పారు. ఇందుకు సంబంధించి ఫొటోలతో కూడిన పూర్తి రిపోర్ట్ ను కోర్టుకు అందజేస్తామన్నారు. కోర్టు ఆదేశాలను అంతే స్ఫూర్తితో అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ వాదనలపై జస్టిస్ అగస్టీన్ జోక్యం చేసుకొని.. చెట్లు నరికివేసిన స్థలంలోనే మొక్కలు నాటుతున్నారా? అని ప్రశ్నించారు. ఇందుకు పిటిషనర్లు కాదని, మరోచోట మొక్క నాటారని తెలిపారు. అయితే ఈ వాదనలపై సింఘ్వీ అభ్యంతరం తెలపగా.. వాదనల్లోకి వెళ్లేందుకు కోర్టు నిరాకరించింది.
సుస్థిర అభివృద్ధికి మేం వ్యతిరేకం కాదు: సీజేఐ
‘కంచ గచ్చిబౌలిలో పర్యావరణాన్ని పునరుద్ధరించకపోతే.. జైలుకు వెళ్లాల్సిందే. ఇలాంటి అంశంలో అధికారులను సమర్థించుకునే ప్రయత్నం చేయొద్దు. చీఫ్ సెక్రటరీ, ఇతర అధికారులు ఇందులో ఇన్వాల్స్ అయ్యారు. ‘‘లాంగ్ వీకెండ్ (శుక్ర, శని, ఆదివారాల మూడు రోజుల సెలవులు)ను ఆసరాగా తీసుకొని ఇంత పెద్ద మొత్తంలో చెట్లు నరికేస్తారా? డజన్ల కొద్ది బుల్డోజర్లు తీసుకొచ్చి విధ్వంసం సృష్టిస్తారా?’’ అని సీజేఐ బీఆర్ గవాయ్ సీరియస్ అయ్యారు. వారాంతంలో చెట్లు నర కడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. అయితే సుస్థిర అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని తెలిపారు. ఇందుకు సింఘ్వీ వాదించేందుకు సిద్ధం కాగా.. ‘‘మీరు బుల్డో జర్ల ఫొటోలు చూశారా? డజన్ బుల్డోజర్లను అంత తక్కువ టైంలో మోహరించగలరా? ఇది పూర్తిగా ప్రీ ప్లాన్డ్గా జరిగింది’’ అని సీజేఐ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇందుకు సింఘ్వి బదులిస్తూ.. అలాంటి ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. పదేండ్లుగా ఆ స్థలం వివాదంలో ఉందని, 2024 లో సుప్రీంకోర్టు ఈ స్థలంపై తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. అలా దాదాపు ఏడాదిగా ఈ స్థలంపై ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదని, కేవలం లాంగ్ వీకెండ్లో తీసుకున్న నిర్ణయం కాదని కోర్టు దృష్టికి తెచ్చారు. అది వాస్తవమైతే.. ఎందుకు సోమవారం బుల్డోజర్ పనులు ప్రారంభించలేదని సీజేఐ ప్రశ్నించారు. సీఈసీ రిపోర్డ్పై కౌంటర్ దాఖలు చేసేందుకు ఎంత టైం కావాలని అడిగారు. 4 వారాల సమయం ఇవ్వాలని సింఘ్వీ కోరారు. అటవీ పునరు ద్ధరణ చర్యలకు రాబోయే వర్షాకాలం సరైందని, హైదరాబాద్‌లో మాన్ సూన్ సీజన్ 10 జూన్ నుంచి ప్రారంభమవుతుందని అడ్వకేట్ నిరంజన్ రెడ్డి కోర్టు దృష్టికి తెచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం ఐటీ కన్స్ట్రక్షన్ కోసం ఆలోచన చేస్తోందని ఆరోపించారు. అయితే అటవీ పునరుద్దరణకు సంబంధించి ప్రభుత్వం దగ్గర ఎలాంటి ప్లాన్ లేదన్నారు. ఐటీ కన్స్ట్రక్షన్ ఆరోపణలపై సింఘ్వీ అభ్యంతరం తెలిపారు. వైల్డ్ లైఫ్ గురించి రిపోర్ట్ లోని అంశా లను సింఘ్వీ ప్రస్తావించేందుకు సిద్ధం కాగా.. సీజేఐ అడ్డుకున్నారు. అసలు వైల్డ్లైఫ్లో జింకలు, నెమళ్లు ఉన్నట్లు ఫొటోల్లో స్పష్టంగా ఉందని తెలిపారు. తాము అక్కడ ఏం నిర్మిస్తారనే అంశంలోకి వెళ్లడం లేదన్నారు. సుస్థిర అభివృద్ధికి తాము సహకరిస్తామని చెప్పారు.
డోంట్ మిక్సఫ్ ది ఇష్యూస్...
ఇదే అంశంపై మరికొన్ని పిటిషన్లను న్యాయవాదులు లేవనెత్త ప్రయత్నం చేయగా.. ‘‘డోంట్ మిక్సప్ ది ఇష్యూ(అన్ని సమస్యలను కలపకండి). ఇది సుప్రీంకోర్టుకు కూడా డిఫికల్ట్‌గా మారుతుంది. ఈ అంశంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్నవాళ్లు సుప్రీంకోర్టుకు వస్తున్నారు’’ అని సీజేఐ అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తాము ఆందోళన చూపిస్తుంటే.. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్వాన్ టేజ్ గా తీసుకునే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. అనంతరం ఇదే కేసులో రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు అడ్వకేట్ మోహిత్ రావు.. బుల్డోజర్ల తో చదును, అటవీని నిర్మూలిస్తున్నట్లున్న పొటో గ్రాఫ్ లను అటాచ్ చేసినట్లు చెప్పారు.
దీనిపై ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కౌంటర్‌ను పైల్ చేయలేదన్నారు. ఇందుకు సింఘ్వీ బదులిస్తూ.. సుమోటో కేసులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లో అన్ని అంశా లు ఉన్నాయని, దీంతో ఆ కౌంటర్ కాపీని సంబంధించి అడ్వకేట్‌కు అందజేయాలని సీజేఐ బీ ఆర్ గవాయి ఆదేశించారు. తదుపరి విచారణను జూలై 23కు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్, ఎన్వీరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీం, ప్రిన్సిపల్ చీఫ్ కంజర్ వేషన్ ఆఫ్ ఫారెస్ట్స్(హెచ్ఓఎఫ్ఎఫ్) సి. సువర్ణతో పాటు మరో ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు కోర్టుకు హాజరైన వారిలో ఉన్నారు.
మూడు స్కూళ్లను బుల్డోజ్ చేశారు: ఐఏ
విజిల్ బ్లోయర్స్, స్టూడెంట్స్ పై కేసులు నమోదు చేసినట్లు పలువురు అడ్వకేట్లు కోర్టు దృష్టికి తెచ్చారు. ఇందుకు సంబంధించి ఇంప్లీడ్ అప్లికే షన్(ఐఏ) దాఖలు చేసినట్లు నివేదించారు. ఈ ప్రాంతంలో మూడు రన్నింగ్స్ స్కూల్స్ ను కూల్చివేశారని ఆరోపించారు. అయితే స్కూల్స్ బుల్డోజ్ చేశారన్న వాదనపై సీజేఐ బీఆర్ గవాయ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఫస్ట్ టైం ఈ ఆరోపణ వింటున్నామని ప్రభుత్వ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ అన్నారు. ఈ ఐఏను ఈ కేసుతో కలిపి విచారించడం కుదరదని సీజేఐ స్పష్టం చేశారు. కావాలంటే వేరే పిటిషన్ దాఖలు చేసుకొవాలని ఆదేశిస్తూ... ఐఏను విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు.