కేసీఆర్ రాజకీయ జూదగాడు : రేవంత్ రెడ్డి

కేసీఆర్ రాజకీయ జూదగాడు : రేవంత్ రెడ్డి

బీఆర్‌‌ఎస్‌‌  రాజ్యసభ సభ్యుడు, హెటిరో అధినేత​ పార్థసారథిరెడ్డికి చెందిన సాయి సింధు ఫౌండేషన్‌‌కు రాష్ర్ట ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించి భూమి కేటాయించిందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ర్టంలోని భూములను సీఎం కేసీఆర్ ఆదాయ వనరుగా చూస్తున్నారని చెప్పారు. కేసీఆర్ దగ్గర కనీసం లక్ష కోట్ల రూపాయల దోపిడీ సొమ్ము ఉందని వ్యాఖ్యానించారు. ఏ ఎన్నికలు వచ్చినా (ఉపఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు) వందల కోట్లు ఖర్చుపెట్టడం ద్వారా ప్రజా తీర్పును కొనుగోలు చేద్దామన్న ఆలోచన చేస్తున్నారని,  ప్రజాస్వామ్య స్ఫూర్తి కాపాడాలనే ఆలోచన కేసీఆర్ కు లేదంటూ వ్యాఖ్యానించారు. 

భూ దోపిడీకి పాల్పడి లక్ష కోట్ల రూపాయలు సంపాదించి.. ఆ సొమ్ముతో దేశ రాజకీయాలను శాసించాలని సీఎం కేసీఆర్ ఆలోచని అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న నిజాం భూములతో పాటు ఇతర ముఖ్యమైన భూములను తన అనుచరులకు పంచిపెడుతున్నారని ఆరోపించారు. ‘‘హెటిరో అధినేత​ పార్థసారథిరెడ్డి.. కేసీఆర్ కు అత్యంత అనుంగ శిష్యుడు. ఇప్పటికే ఆయన ఈడీ, ఐటీ కేసులను ఎదుర్కొంటున్నాడు. కరోనా సమయంలో రెమీడీస్ వేర్ ఇంజక్షన్లను ప్రభుత్వం చెప్పిన ధరకు అమ్మకుండా దాదాపు 30 వేల నుంచి 50 వేల రూపాయల వరకూ బ్లాక్ లో అమ్మి.. వందల కోట్లు అక్రమంగా సంపాదించాడు’’ అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 

‘‘2014లో పార్థసారథిరెడ్డి.. సాయి సింధు ఫౌండేషన్ ను స్థాపించి.. ఆ తర్వాత క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణం చేపడుతానని చెప్పి.. ప్రభుత్వానికి భూమి కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో 2016 లో 15 ఎకరాల భూమిని.. కోకాపేటలో రాష్ర్ట ప్రభుత్వం కేటాయించింది. అనాడే చీఫ్ సెక్రటరీ 10 ఎకరాలు సరిపోతాయని చెప్పారు. కానీ.. సీఎం కేసీఆర్ 15 ఎకరాల భూమిని కేటాయించారు. 15 ఎకరాల భూమికి 1500  కోట్ల చొప్పున లెక్కలు వేయాల్సిన అధికారులు ప్రభుత్వ ఒత్తిడితో 505 కోట్లకే తగ్గించారు. 570 జీవో ప్రకారం..  505 కోట్లనే పరిగణలోకి తీసుకుంటే.. ఏడాదికి 50 కోట్ల 50 లక్షల రూపాయలు రెంటు వసూలు చేయాలి. కానీ.. సీఎం కేసీఆర్ 15 ఎకరాలు కేటాయిస్తూ  1 లక్ష 47 వేల 743 రూపాయలకు రెంట్ కు ఇచ్చారు. ఇది కూడా 60 ఏండ్లకు లీజుకు ఇచ్చారు. అంటే 60 ఏండ్లలో వచ్చే రెంటు విలువ ఒక కోటి 40 లక్షలు మాత్రమే. ప్రభుత్వ అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం చూస్తే.. 60 ఏండ్లల్లో 5 వేల 346 కోట్ల రూపాయల రెంటు రావాలి. ఇంతకంటే దోపిడీ ఎక్కడైనా ఉంటుందా..?’’ అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

కేసీఆర్ భూ దోపిడీపై ప్రతిరోజూ ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడిస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు. యశోద ఆసపత్రికి కేటాయించిన భూమి గురించి రేపు .. ఆ తర్వాత రోజు కుర్ర శ్రీనివాస్ కు కేటాయించిన భూముల గురించి వివరాలు చెబుతానని చెప్పారు. ‘‘సీఎం కేసీఆర్ రాజకీయ జూదగాడు. దేశ రాజకీయాలను కలుషితం చేసేందుకు బీఆర్ఎస్ పేరుతో బయలుదేరాడు’’ అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.