- కాళేశ్వరంపై సీబీఐ విచారణను అడ్డుకునేందుకే బీఆర్ఎస్
- లీడర్ల రహస్య పర్యటన: సీఎం
- హరీశ్, వినోద్‌రావు, బీఆర్ఎస్ ఎంపీ ఢిల్లీలో ఎవరిని కలిశారో వివరాలు బయటపెట్టాలి
- లేదంటే హరీశ్ ఢిల్లీ పర్యటనపై విచారణకు ఆదేశిస్తా.. ఏయే ఆర్ఎస్ఎస్ ప్రముఖులను కలిసి కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చారో తేలుస్తానని వెల్లడి
హైదరాబాద్/జయశంకర్భూపాలపల్లి, వెలుగు: కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరగకుండా బీజేపీ నేతల కాళ్లు పట్టుకునేందుకే బీఆర్ఎస్ నేతలు హరీశ్‌రావు, వినోద్‌రావు సోమవారం ఢిల్లీకి రహస్యంగా వెళ్లారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. హరీశ్‌రావు, వినోద్‌రావు, మరో ఎంపీ ఢిల్లీలో ఎవరెవరిని కలిశారో వివరాలు బయటపెట్టాలని, లేదంటే బీఆర్ఎస్ నేతల ఢిల్లీ పర్యటనపై తానే విచారణకు ఆదేశించి, వారు ఏయే ఆర్ఎస్ఎస్ ప్రముఖులను కలిసి కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చారో తేలుస్తానని సీఎం హెచ్చరించారు.
ప్రజల సొమ్ముతో నిర్మించిన కాళేశ్వరం బ్యారేజీలను పునరుద్ధరించి రాష్ట్ర అవసరాల కోసం ఉపయోగించుకుంటామని, అదే సమయంలో ప్రాజెక్ట్‌లో జరిగిన అవినీతికి కారకులైన దోషులను శిక్షిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్‌తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సోమవారం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి, అక్కడ జరుగుతున్న జియో టెక్నికల్, జియో ఫిజికల్ టెస్టులు, జీపీఆర్, శాంపిల్స్ సేకరణ పనులను పరిశీలించారు. అనంతరం అక్కడే ఎన్డీఎస్ఏ అధికారులతో కలిసి ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ మాట్లాడారు. ‘కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఆదేశించకపోతే త్వరలోనే ఆందోళన కార్యక్రమం చేపడ్తామని కేంద్రాన్ని హెచ్చరించాం. ఒకవేళ కేంద్రం విచారణకు ఆదేశిస్తుందేమోనని భయపడే హరీశ్‌రావు, వినోద్‌రావు, ఆ పార్టీ ఎంపీ.. బీజేపీ నాయకుల కాళ్లు పట్టుకోవడానికి ఢిల్లీకి పరుగెత్తిన్రు.
ఒక పక్క జీవన్ రెడ్డి మా పార్టీలోకి వస్తున్నడు.. జీవన్టోన్ దొరికింది అంటూనే మరో పక్క ఢిల్లీకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో ప్రజలకు చెప్పాలి’ అని సీఎం డిమాండ్ చేశారు. కేసుల కోసమా, ఇంకా దేనికోసమైనా ప్రజలకు తెలియకుండా రహస్యంగా ఎందుకు వెళ్లారో చెప్పాలన్నారు. ‘హరీశ్‌రావు ఢిల్లీ పర్యటన గురించి మీడియా బయటపెట్టే వరకు తెలియలేదంటే మీ ఉద్దేశం ఏంటి? ఎంతకాలం బీజేపీని ప్రసన్నం చేసుకొని సీబీఐ విచారణ జరగకుండా ఆపుకుంటరు? బీజేపీని అడ్డుపెట్టుకొని అవినీతిని కాపాడుకోవానే ఆలోచనను చూస్తూ ఊరుకోం. ఒకపక్క కాళేశ్వరం ప్రాజెక్టును పునరుద్ధరిస్తూనే దోషులనూ శిక్షిస్తం’ అని సీఎం రేవంత్ స్పష్టతనిచ్చారు.
ఎవరి ముందు వాదిస్తున్నరు? ఎవరిని మేనేజ్ చేస్తున్నరు?
‘కాళేశ్వరంపై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. 22న జడ్జిమెంట్ ఉంది. తీర్పు రిజర్వ్ అయ్యాక హరీశ్‌రావు న్యాయ నిపుణులను కలవాల్సిన అవసరం ఏముంది? ఎవరి ముందు వాదిస్తున్నరు? ఎవరిని మేనేజ్ చేస్తున్నరు? ఎవరి కాళ్లు పట్టుకుంటున్నరు?’ అని సీఎం రేవంత్ నిలదీశారు. ‘మీడియా బయటపెట్టినా వాళ్లు దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. బీజేపీని అడ్డు పెట్టుకుని అవినీతి కేసుల నుంచి బయటపడతామంటే రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. అవసరమైన ప్రణాళికలతో ముందుకు వెళతాం. దోషులను శిక్షిస్తం’ అని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
నిపుణుల పర్యటన ఉందని తెలిసే జగిత్యాల సభ పెట్టిన్రు..
కాళేశ్వరంలో సాంకేతిక నిపుణుల పర్యటన ఉందని, అవినీతి అంశాలు.. నిజాలు బయటపడ్తాయని తెలిసే బీఆర్ఎస్ లీడర్లు జగిత్యాలలో పొలిటికల్ మీటింగ్ పెట్టుకున్నరని సీఎం రేవంత్ విమర్శించారు. 48 గంటల్లో సీబీఐ విచారణ అన్న కేంద్రం ఎందుకు మౌనంగా ఉండిపోయిందో చెప్పాలని సీఎం డిమాండ్ చేశారు. మేము పదే పదే లేఖలు రాస్తున్నా ఎందుకు స్పందిస్తలేరో.. బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య ఉన్న సంబంధం ఏంటో ప్రజలకు వివరించాలన్నారు. కాళేశ్వరం అవినీతి, దోపిడీపై పీసీ ఘోష్ కమిటీ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో చర్చించి సీబీఐ ఎంక్వైరీకి ప్రభుత్వం తరఫున తీర్మానం చేసి పంపించి 8 నెలలు గడిచినా ఇంకా కేంద్రం చర్యలు తీసుకోకపోవడం వెనక ఉన్న అంతర్యం ఏమిటని సీఎం నిలదీశారు. ‘కాళేశ్వరం అవినీతిపై చర్యలు తీసుకునే దమ్ము మీకు లేదు.. మాకు అవకాశం ఇస్తే మేము కొద్ది రోజుల్లోనే కేసీఆర్, హరీశ్‌రావును జైళ్లో వేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆనాడు అన్నారు.. ఇప్పుడు ఎందుకు ఆ పనిచేయడం లేదు?’ రేవంత్ ప్రశ్నించారు.
అవి కాళేశ్వరం నీళ్లు కాదు.. ఎల్లంపల్లి నీళ్లు..
హరీశ్‌రావు నిక్కర్లు వేయకముందే కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లంపల్లి రిజర్వాయర్ నిర్మించిందని సీఎం రేవంత్ అన్నారు. కాంగ్రెస్ కట్టిన ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి నీటితోనే రాష్ట్రంలో అత్యధిక వరి పంట పండుతోందని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లేకపోతే నీళ్లు ఎక్కడివి అంటూ హరీశ్ తెలివి ఉండి మాట్లాడుతున్నాడో, తెలివి లేక మాట్లాడుతున్నాడో తనకు తెలియదన్నారు.
కాళేశ్వరంలో జరిగిన అవినీతిని సాక్షాత్తూ ప్రకృతే రాష్ట్ర ప్రజలకు తెలియజేసిందన్నారు. కేసీఆర్ 2023 ఎన్నికల్లో ప్రయోజనం పొందాలనుకోగా దాచినా దాగని నిజాలను ప్రకృతి బయటపెట్టిందని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీ కూలిపోయాక కేసీఆర్ ప్రభుత్వంలోనే 2023, నవంబర్ 1న ఎన్డీఎస్ఏ మూడు బ్యారేజీల్లో నీళ్లు నింపవద్దని ప్రాథమిక రిపోర్ట్ ఇచ్చిందని గుర్తుచేశారు. ఇది కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే జరిగిందన్నారు. ఆ నివేదికను కేసీఆర్ పట్టించుకోలేదని చెప్పారు.
రాజకీయ లబ్ధి కోసం ప్రాజెక్ట్ పేరు.. ప్లేస్ మార్చిన్రు..
కేసీఆర్ తన రాజకీయ లబ్ధి, ప్రజల సొమ్ము కాజేయాలనే దురుద్దేశంతోపూ రూ.11 వేల కోట్లు ఖర్చు చేసిన ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ పేరు, ప్లేస్ మార్చి మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం పేరుతో ప్రాజెక్ట్ మొదలుపెట్టారని రేవంత్ చెప్పారు. గోదావరి జలాలతో ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేయాలని 1975 లో జలగం వెంగళ రావు ఆనాటి మహారాష్ట్ర సీఎంతో ఒప్పందం చేసుకున్నారని తెలిపారు.
ఆ తర్వాత వైఎస్ హయాంలో 2009లో రూ.38,063 కోట్లతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మొదలు పెట్టారని గుర్తుచేశారు. ప్రాణహిత చేవేళ్లతో ఆర్థిక, రాజకీయ ప్రయోజనం లేదని కేసీఆర్ రీ డిజైనింగ్ పేరుతో పేరు, ఊరు అంచనాలు మార్చినట్టు ఆరోపించారు. 2016 లో మొదలు పెట్టిన మేడిగడ్డను 2019 లో పూర్తిచేసి ఇది అద్భుతమని భ్రమలు కల్పించి 2018 ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందారన్నారు. ఏకంగా ఆనాటి రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌తో అబద్ధాలు పలికించారని చెప్పారు.
198 కోట్లతో కాళేశ్వరం టెంపుల్ అభివృద్ధి పనులు..
రూ.198 కోట్ల వ్యయంతో చేపట్టనున్న శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర దేవాలయ అభివృద్ధి పనులను, రూ.3.70 కోట్లతో నిర్మించనున్న కాళేశ్వరం బస్ స్టేషన్ నిర్మాణ పనులను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దర్శనం చేసుకుని మహా రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం శుభానంద దేవి ఆలయంలో పూజలు చేశారు. దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు.. స్వామి వారి శేష వస్త్రాలు, తీర్థప్రసాదాలు పట్టు వస్త్రాలతో సీఎం రేవంత్ రెడ్డిని ఘనంగా సన్మానించారు.
నెల కింద పెట్టుకున్న షెడ్యూల్ ఇది: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
‘మేడిగడ్డ బ్యారేజీ వద్ద జరుగుతున్న టెస్టింగ్ పనులు పరిశీలించడానికి రాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల కింద పెట్టుకున్న ప్రోగ్రాం ఇది’ అని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎవరో ఎక్కడో మీటింగ్ పెట్టారని, తాము ఇక్కడికి వచ్చామనే దానిలో వాస్తవం లేదన్నారు. ప్రపంచంలో మానవ తప్పిదంతో జరిగిన అతి పెద్ద నష్టం ఇదన్నారు. అవినీతి, తొందర పాటు అన్నీ ఈ ప్రాజెక్ట్ లో కనిపిస్తున్నాయని చెప్పారు. అవగాహన లోపంతో ఈ ప్రాజెక్ట్ ను నిర్మించారన్నారు.
రూ.38 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్ట్‌ను లక్షా 47 వేల కోట్లకు చేర్చారని తెలిపారు. ‘ఈ ప్రాజెక్ట్‌లో బేసిక్ కాన్సెప్ట్, డిజైన్, ప్లానింగ్ అన్నీ ఫెయిల్యూర్. రాష్ట్ర ప్రజలందరినీ తాకట్టు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. 2025లో కాళేశ్వరం అప్పుకు రూ.16 వేల కోట్లు రీ పేమెంట్ చేశాం. ప్రజల సొమ్ముతో కట్టిన ఈ ప్రాజెక్ట్‌ను రిపేర్ చేసి రాష్ట్ర అవసరాల కోసం ఉపయోగించుకుంటాం’ అని మంత్రి స్పష్టం చేశారు. వీరి వెంట మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ తదితరులు ఉన్నారు.

