ప్రధాని విందుకు రేవంత్‌‌‌‌‌‌‌‌ హాజరు

ప్రధాని విందుకు రేవంత్‌‌‌‌‌‌‌‌ హాజరు
  •     ఇంటర్నేషనల్‌‌‌‌ లీడర్లు, టెక్ దిగ్గజాలు, పారిశ్రామికవేత్తలతో ముచ్చటించిన సీఎం

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీలోని భారత్‌‌‌‌ మండపంలో నిర్వహిస్తున్న ‘ఇండియా–ఏఐ ఇంపాక్ట్ సమిట్ –2026’ కు హాజరైన ప్రపంచ నేతలకు ప్రధాని మోదీ  విందు ఏర్పాటు చేశారు. బుధవారం సాయంత్రం ముంబై నుంచి ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి..ఈ విందుకు హాజరయ్యారు. దాదాపు అరగంటకుపైగా భారత్ మండపంలో గడిపారు. ఈ సందర్భంగా ఫ్రెంచ్ ప్రెసిడెంట్‌‌‌‌ ఇమ్మాన్యూయేల్ మాక్రాన్, బ్రెజిల్ ప్రెసిడెంట్‌‌‌‌ లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా, అంతర్జాతీయ టెక్‌‌‌‌ దిగ్గజాలు, పారిశ్రామికవేత్తలతో ముచ్చటించారు. అలాగే, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలను మర్యాదపూర్వకంగా పలకరించారు.  

నేడు ఏఐ సమిట్‌‌‌‌లో శ్రీధర్‌‌‌‌‌‌‌‌బాబు ప్రజెంటేషన్ 

తెలంగాణను గ్లోబల్‌‌‌‌ ఏఐ హబ్‌‌‌‌గా మార్చే దిశలో ‘ఇండియా-ఏఐ ఇంపాక్ట్ సమిట్ -2026’ ను ఉపయోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌‌‌‌ బాబు ఏఐ ఇంపాక్ట్‌‌‌‌ సమిట్‌‌‌‌ ప్రారంభోత్సవంలో పాల్గొని.. ప్రజెంటేషన్‌‌‌‌ ఇవ్వనున్నారు. అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. 

శుక్రవారం సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి తెలంగాణ ఏఐ పాలసీ కీ పాయింట్స్‌‌‌‌పై సమిట్‌‌‌‌లో ప్రసంగించనున్నారు. తెలంగాణలో ఏఐ రంగంలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సహకారాన్ని  వివరించనున్నారు. 

ఖర్గే, రాహుల్‌‌‌‌తో మంత్రి వాకిటి శ్రీహరి భేటీ 

అధిష్టానం పిలుపు మేరకు బుధవారం ఢిల్లీకి వచ్చిన రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి.. ఏఐసీసీ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మున్సిపల్‌‌‌‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌ గెలుపు, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, ఇతర అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో 87 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో విజయఢంకా మోగించిన సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్‌‌‌‌ టీమ్‌‌‌‌ను ఖర్గే, రాహుల్‌‌‌‌ అభినందించారు. పార్టీ పటిష్టత కోసం నేతలంతా మరింత సమన్వయంతో పనిచేయాలని నేతలు దిశా నిర్దేశం చేశారు.