
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రం తన రాజ్యమని సీఎం కేసీఆర్ అనుకున్నారని, లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఆయనకు చెంపపెట్టు వంటివని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. మల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా గెలిచిన ఆయన, కౌటింగ్ తర్వాత మీడియాతో మాట్లాడారు. తండ్రి, కొడుకుల అహంకారాన్ని అణచేందుకే ప్రజలు ఇలాంటి ఫలితాలనిచ్చారని చెప్పారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఆస్తులు పెంచుకునేందుకే కేసీఆర్ వాడుకున్నారని ఆరోపించారు.
మోడీ వితండవాద వైఖరిని, కేసీఆర్‌ని ప్రశ్నించినందుకే ప్రజలు తనను గెలిపించారని అన్నారు. తనకు ఓటువేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ సాధించుకున్న విద్యార్థుల పాత్రే తన గెలుపులో ఎక్కువగా ఉందని అన్నారు. ఎంపీగా పూర్తి బాధ్యతలు నిర్వహిస్తానని, పార్లమెంట్‌లో విభజన హామీలపై పోరాడుతానని, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఉక్కు కర్మాగారం, ట్రైబల్ వర్సిటీల సాధన కోసం పని చేస్తానన్నారు.