టీఎస్​పీఎస్సీలో అర్హులను నియమించి.. పరీక్షలు జరపాలె : రేవంత్ రెడ్డి

టీఎస్​పీఎస్సీలో అర్హులను నియమించి.. పరీక్షలు జరపాలె : రేవంత్ రెడ్డి

టీఎస్​పీఎస్సీ సభ్యుల నియామకంపై తెలంగాణ హైకోర్టు రాష్ర్ట ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. వెంటనే  టీఎస్​పీఎస్సీ సభ్యులను తొలగించి.. అర్హులను వెంటనే నియమించి.. పరీక్షలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. 

‘‘ఎన్నికల ముందు సీఎం కేసీఆర్.. ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఇవ్వలేదు. చివరకు ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఇవాళ తెలంగాణలో ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం దాదాపు 50 లక్షల మంది నిరుద్యోగులు సంవత్సరాల తరబడి రోడ్లపై తిరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం కనికరం లేదు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోంది. టీఎస్​పీఎస్సీ సభ్యుల నియామకం లోపభూయిష్టంగా ఉంది. చైర్మన్ నుంచి సభ్యుల వరకూ అందరూ ఓనమాలు రాని వాళ్లను నియమించారు. అర్హతలు లేని వాళ్లను నియమించారు. ఇదే విషయాన్ని  నిన్న (జూన్ 16న, శుక్రవారం) తెలంగాణ హైకోర్టు చెప్పింది. క్వశ్వన్ పేపర్లను సంతలో అమ్మినట్లు అమ్మారు. జీరాక్స్ సెంటర్లలోనూ ప్రశ్నాపత్రాలు దొరుకుతున్నాయి. లక్షలాది మంది జీవితాలతో చెలగాటమాడారు. ప్రభుత్వంలో ఉండే పెద్దలను కాపాడేందుకు విచారణకు సంబంధించిన పూర్తి వివరాలను బయటపెట్టడం లేదు. అందుకే ప్రశ్నాపత్రాల లీకేజీపై కాంగ్రెస్ పోరాడుతోంది. ఈడీ కేసు కాంగ్రెస్ పార్టీ నమోదు చేయించింది. సీబీఐ కోసం కూడా హైకోర్టులో కోట్లాడుతున్నాం’’ అని రేవంత్ రెడ్డి మాట్లాడారు. 

అర్హులను నియమించాలె

వెంటనే పరీక్షలను వాయిదా వేసి, టీఎస్​పీఎస్సీ సభ్యులను తొలగించి.. అర్హులైన వారిని కొత్తగా పారదర్శకంగా నియమించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇదే అంశంపై పార్లమెంటులోనూ తాము కొట్లాడుతామన్నారు. ‘‘పేపర్ లీకేజీకి మంత్రి కేటీఆరే కారణం. కేటీఆర్ ధన దాహం, స్వార్థమే ఈ రోజు ప్రశ్నాపత్రాల లీకేజీ. దీనికి కేటీఆర్ బాధ్యత వహించాలి. తక్షణమే ఆయన్ను మంత్రి పదవిని నుంచి భర్తరఫ్ చేయాలి’’ అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 

బెల్లంపల్లి ఎమ్మెల్యేపై ఆగ్రహం

బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్గం చిన్నయ్యపై లైంగిక ఆరోపణలు వస్తుంటే సీఎం కేసీఆర్ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ‘‘బెల్లంపల్లి ఎమ్మెల్యే గురించి మాట్లాడేందుకు నాకే సిగ్గవుతోంది. మరీ ఆయన్ను పక్కన కూర్చోబెట్టుకున్న కేసీఆర్ కు సిగ్గు అవుతుందా..? లేదా అనేది నాకైతే అర్థమైతలేదు. రాష్ట్రంలో, దేశంలో గత కొన్ని రోజులుగా బెల్లంపల్లి ఎమ్మెల్యేపై ఆరోపణలు వస్తున్న విషయం ప్రజలందరికీ తెలిసింది. కానీ.. కేసీఆర్ దీనిపై ఎందుకు స్పందించడం లేదు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్బిద్ధి చిన్నయ్యనో..లేక దుర్గం చిన్నయ్యనో నాకు తెల్వదు’’ అని వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి. 

ఎమ్మెల్యేలపై ఆరోపణలు

‘‘రాష్ట్రంలో దండుపాళ్యం (బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు) ముఠా ఎక్కడికక్కడ దోచుకుంటోంది. ఇసుక, ల్యాండ్, మైనింగ్, లిక్కర్ వ్యాపారంలోనూ బరితెగించింది. చివరకు రేప్ కేసుల్లో ఎక్కువగా బీఆర్ఎస్ వాళ్లే ఉంటున్నారు. మాట మాట్లాడితే కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, అల్లుడు మంత్రి హరీష్ రావు దేశానికి తెలంగాణ రోల్ మోడల్ అంటున్నారు. రేప్ కేసుల్లో బీఆర్ఎస్ నేతలు రోడ్ మోడలా..?’’ అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 

30శాతం కమీషన్ ప్రభుత్వం

మొన్నటి వరకూ కర్నాటకలో అధికారంలో ఉన్న బీజేపీకి, తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ కు పెద్ద తేడా లేదన్నారు రేవంత్ రెడ్డి. ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం30 శాతం కమీషన్ తీసుకుంటే.. అక్కడ (కర్నాటక) బీజేపీ ప్రభుత్వం 40 శాతం కమీషన్ తీసుకుందని ఆరోపించారు. అందుకే ఎన్నికల్లో బీజేపీని ప్రజలు ఘోరంగా ఓడించారని చెప్పారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ను ఓడించాలని, కాంగ్రెస్ నాయకుల్లో విబేధాలు సృష్టించి.. చీలికలు తీసుకువచ్చేందుకు సీఎం కేసీఆర్ కుట్రలు పన్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.  వందల కోట్లు ఖర్చుపెట్టి కాంగ్రెస్ ను దెబ్బతీయాలని కుట్ర చేశారని చెప్పారు. ఎన్నికల్లో జేడీఎస్ ను గెలిపించి.. ఆ తర్వాత హంగ్ అసెంబ్లీ ఏర్పడేలా చేసి, బీజేపీకి మద్దతు ఇచ్చేలా చేయాలనుకున్నారని వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి.