బీజేపీ ప్రభుత్వం కవితను ఎందుకు అరెస్ట్ చేస్తలేదు : రేవంత్ రెడ్డి

బీజేపీ ప్రభుత్వం కవితను ఎందుకు అరెస్ట్ చేస్తలేదు : రేవంత్ రెడ్డి

టీఆర్ఎస్ పాలనలో కొడంగల్ నియోజకవర్గం తుప్పు పట్టిందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. కొడంగల్ను కేటీఆర్ దత్తత తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని అన్నారు. 2019 జనవరి 1 నుంచి కొడంగల్కు టీఆర్ఎస్ వ్యక్తే ఎమ్మెల్యేగా ఉన్నా జరిగిన అభివృద్ధి శూన్యమని అన్నారు. గత నాలుగేళ్లలో కొడంగల్ లో చేసిన అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ శ్వేత పత్రం విడుదల చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కొడంగల్పై అసెంబ్లీలో నిర్దిష్టమైన ప్రకటన చేయాలని, లేనిపక్షంలో గ్రామగ్రామాన టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడతామన్నారు. కొడంగల్ డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసే వరకు ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేయాలని సూచించారు. కొడంగల్ అభివృద్ధికి నిధులు వచ్చుడో.. ఎమ్మెల్యే సచ్చుడో తేలాలని చురకలంటించారు. ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు ఉపయోగపడే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు పూర్తి చేయలేదని రేవంత్ రెడ్డి నిలదీశారు. 

కాంగ్రెస్ను దెబ్బతీసేందుకు టీఆర్ఎస్, బీజేపీలు కుట్రలు చేస్తున్నాయని రేవంత్ ఆరోపించారు. రాష్ట్రంలో బెంగాల్ తరహా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం ఎమ్మెల్సీ కవితను, రాష్ట్ర ప్రభుత్వం బీఎల్ సంతోష్ను అరెస్ట్ చేయడం లేదని వాపోయారు. గాంధీ కుటుంబం మాత్రమే విచారణ సంస్థలను గౌరవించిందన్న రేవంత్ టీఆరెస్, బీజేపీ నేతలు విచారణకు హాజరు కాకుండా ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు.