సమ్మె కాలానికి వేతనాలు..  కేసులన్నీ మాఫ్

సమ్మె కాలానికి వేతనాలు..  కేసులన్నీ మాఫ్
  •  ఆర్టీసీలో ఒక్క డ్రైవర్‌‌‌‌నూ తొలగించం..  నేతల విజ్ఞప్తికి సీఎం రేవంత్‌‌రెడ్డి ఓకే
  •  కార్మికులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని అధికారులకు ఆదేశాలు
  •  డీజిల్ ఖర్చు తగ్గించేందుకే ఈవీ బస్సులకు ప్రోత్సాహం
  •  విలీనం, గుర్తింపు ఎన్నికలపై సమగ్ర కార్యాచరణతోరావాలని సూచన  
  • సీఎంకు జేఏసీ నేతల కృతజ్ఞతలు

హైద‌‌రాబాద్, వెలుగు:- ఆర్టీసీ కార్మికులు మూడు రోజులపాటు చేసిన సమ్మె కాలానికి వేతనాలు ఇవ్వాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని సీఎం రేవంత్‌‌రెడ్డి ఆదేశించారు.ఈ సమ్మె సందర్భంలో ఆర్టీసీ కార్మికులపై పెట్టిన కేసులను కూడా ఎత్తివేయాలని అధికారులకు సూచించారు. శుక్రవారం జూబ్లీహిల్స్ లోని  నివాసంలో సీఎం రేవంత్‌‌రెడ్డిని ఆర్టీసీ జేఏసీ నేతలు కలిసి కృతజ్ఞతలు చెప్పారు. సమ్మె విరమణ కోసం, కార్మికుల డిమాండ్లపై  సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్‌‌ను ఈ సందర్భంగా జేఏసీ నాయకులు అభినందించారు.  జేఏసీ నాయకులు చేసిన విజ్ఞప్తులపై సీఎం అప్పటికప్పుడు స్పందించినందుకు పలు యూనియన్ల నేతలు సంతోషం వ్యక్తం చేశారు.

అనంతరం జేఏసీ నేతలను ఉద్దేశించి సీఎం రేవంత్‌‌రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, గుర్తింపు సంఘం ఎన్నికలు ..ఈ రెండు అంశాలపై అన్ని కార్మిక సంఘాల నాయకులు సమావేశమై, సమగ్ర కార్యాచరణను రూపొందించుకొని రావాలని సూచించారు. ఒకవేళ యూనియన్ల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే..ఏ యూనియన్‌‌కు ఆ యూనియన్ తమ ఆప్షన్లు ఇస్తే కామన్‌‌గా ఉన్నవాటికి ఆమోదం తెలిపి, భిన్నాభిప్రాయాలు  ఉన్నవాటిపై చర్చిద్దామని స్పష్టం చేశారు. “నేను వేరు.. మీరు వేరు అన్న భావన నాకు ఎప్పుడూ లేదు. అందరం కలిస్తేనే ప్రభుత్వం.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ఆర్టీసీ కార్మికులు కోరుకున్నారు. మీ పోరాటాల్లో మేం పాల్గొన్నాం” ” అని కార్మికులనుద్దేశించి సీఎం అన్నారు.  

వెయ్యి ఈవీ బస్సులను మెట్రోతో అనుసంధానిస్తాం..

ప్రతి ఏడాది ఆర్టీసీలో రూ. 2 వేల కోట్లు డీజిల్ ఖర్చు అవుతుందని, ఈ ఖర్చు తగ్గించడానికే ఈవీ బస్సులను తీసుకువస్తున్నామని సీఎం రేవంత్‌‌రెడ్డి చెప్పారు. ఆదాయం పెంచుకోవాలంటే ఖర్చు తగ్గించుకోవాలని, దీనికోసం పక్కా ప్రణాళిక అవసరం అని పేర్కొన్నారు. ఆర్టీసీలో బకాయిలు తమ హయాంలో పెట్టినవి కావని, కానీ వాటిని చెల్లించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. పెండింగ్‌‌లో ఉన్న కారుణ్య నియామకాలు చేపట్టామని వివరించారు.

వెయ్యి ఈవీ బస్సులను కొనుగోలు చేసి మెట్రోతో అనుసంధానం చేస్తున్నామని, శంషాబాద్‌‌లో 150 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి బస్ టెర్మినల్ నిర్మిస్తున్నామని, గాజుల రామారంలో వంద ఎకరాల్లో బస్ టర్మినల్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈసారి ఉద్యోగులకు వెయ్యి కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేశామని చెప్పారు. మినీ బస్సులను కూడా కొనుగోలు చేసి ఆర్టీసీకి అందిస్తామని తెలిపారు.

సంస్థ అభివృద్ధి, మనుగడ, గౌరవాన్ని పెంపొందించి, ప్రజలకు మంచి సేవలు అందించడానికి కార్యాచరణతో ముందుకు వచ్చినందుకు జేఏసీ నేతలకు సీఎం అభినందనలు చెప్పారు. ప్రజలకు సేవలు అందించే విషయంలో కార్మికులు పట్టుదలతో పనిచేయడం వల్లనే ఆర్టీసీ దేశంలోనే గొప్ప సంస్థగా నిలిచిందని ప్రశంసించారు.

సమస్యలను 100 శాతం పరిష్కరిస్తం

ఆర్టీసీ సమస్యలు ఏవైనా సరే తన దృష్టికి తీసుకువస్తే వంద శాతం  పరిష్కరిస్తానని సీఎం రేవంత్‌‌ చెప్పారు. కార్మికులతోనే ప్రభుత్వం ఉంటుందని అన్నారు. సంస్థ ఆగిపోతే ఊపిరి ఆగిపోయినట్లేనని, సంస్థకు నష్టం జరిగే పనులు చేయవద్దని కోరారు. కార్మికులు, యాజమాన్యం మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలని కోరారు.  ఆర్థిక అంశాలతో కూడిన పీఆర్సీ లాంటిపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుం దని, ఆర్టీసీ అప్పులపై ఉన్న వడ్డీ భారాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.  సంస్థను బలోపేతం చేసుకొని నిలబెట్టుకోవడానికి కార్మికులు సహకరించాలని కోరారు. ఆర్టీసీలో ఒక్క డ్రైవర్‌‌‌‌ను కూడా తొలగించబోమని స్పష్టం చేశారు.

మహాలక్ష్మి పథకంతో రూ. 8 వేల కోట్లు ఆర్టీసీకి ఇచ్చామని అన్నారు. ఆర్టీసీని బాగుచేసుకునే అవకాశం కార్మికులపైనే ఉందని, కార్మికులు, డిపో మేనేజర్ల మధ్య ఎలాంటి వివాదాలు లేకుండా చూసుకోవాలని కోరారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల హక్కులను కాపాడుతుందని సీఎం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, జేఏసీ నేతలు వెంకన్న, థామస్ రెడ్డి, అశ్వథామరెడ్డి తదితరులు పాల్గొన్నారు.