పీసీసీ రేసులో రేవంత్‌‌ ..సెకండ్​ ఆప్షన్​గా జీవన్​రెడ్డి?

పీసీసీ రేసులో రేవంత్‌‌ ..సెకండ్​ ఆప్షన్​గా జీవన్​రెడ్డి?

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ కాంగ్రెస్ కు ఆగస్టు మొదటి వారంలో  కొత్త అధ్యక్షుడు రానున్నారు. మహారాష్ట్ర, ఢిల్లీ, గోవా రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ఇటీవలే మహారాష్ట్రకు పార్టీ చీఫ్ ను నియమించారు. మిగిలిన ఢిల్లీ, గోవా రాష్ట్రాలతో పాటే  తెలంగాణలో సైతం పార్టీ అధ్యక్షుడిని నియమించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలతో పాటే టీపీసీసీకి ప్రెసిడెంట్​ను నియమించాలని  భావిస్తున్నారంటే  ఇక్కడి పార్టీ వ్యవహారాలపై తమ అధినాయకత్వం ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చని ఓ సీనియర్ నేత చెప్పారు. వచ్చే నెల 10 వ తేదీ లోపు కోత్త పీసీసీ చీఫ్ నియామకం ఉంటుందనీ, ఈ మేరకు ఢిల్లీలో పరిణామాలు  వేగంగా మారుతున్నాయని  ఓ మాజీ ఎంపీ వ్యాఖ్యానించారు.

వేణుగోపాల్​ కేంద్రంగా..

ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్​చార్జి కేసీ వేణుగోపాల్ కేంద్రంగా ఢిల్లీలో  తెలంగాణ పీసీసీ చీఫ్ నియామకంపై సీరియస్ గా  కసరత్తు సాగుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వారం రోజులుగా రాష్ట్రానికి చెందిన పలువురు సీనియర్ నేతలతో వేణుగోపాల్ విడి విడిగా భేటీలు నిర్వహించి పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై వారి అభిప్రాయాలు తీసుకున్నట్లు  తెలుస్తోంది. ఈ క్రమంలో అధిష్ఠానం ఇప్పటికే ఓ స్పష్టతకు వచ్చిందనీ, తెలంగాణ పీసీసీ చీఫ్ గా మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డిని నియమించనున్నట్లు రాష్ట్ర నేతలకు హైకమాండ్ పరోక్ష సంకేతాలు పంపిందని విశ్వసనీయ సమాచారం.

ఎవరి ప్రయత్నాల్లో వారు..

పీసీసీ చీఫ్ పదవిపై ఎంతో కాలంగా ఆశలు పెట్టుకున్న పలువురు సీనియర్లు చివరి ప్రయత్నంగా ఏఐసీసీ నేతల వద్ద తమకు అనుకూలంగా  లాబీయింగ్ చేసుకుంటున్నారు.  తనకు అనుకూలుడైన నేత పీసీసీ చీఫ్ గా ఉండాలని ప్రస్తుత అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరుకుంటున్నట్లు తెల్సింది. ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్న అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ను దళిత కోటాలో పీసీసీ చీఫ్ గా నియమించాలని ఉత్తమ్ అధిష్ఠానంపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.  ఇక సీఎల్పీ నేతగా ఉన్న మల్లు భట్టి విక్రమార్క ఇస్తే తనకు, లేదంటే మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు ఇవ్వాలని హైకమాండ్ వద్ద మెలిక పెట్టినట్లు సమాచారం. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పీసీసీ ప్రెసిడెంట్​ పదవి కోసం గట్టిగానే పట్టుపడుతున్నప్పటికీ తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కొంత మైనస్ గా మారినట్లు తెలుస్తోంది. ఇటీవల విధేయుల ఫోరం పేరుతో కొత్త కుంపటి పెట్టిన సీనియర్లు కొందరు, తమలో ఎవరికైనా ఒకరికి పీసీసీ పదవి ఇవ్వాలని, ఇతర పార్టీల నుంచి తమ పార్టీలో చేరిన వారికి కనుక ఈ పదవి ఇస్తే తమ దారి  తాము చూసుకుంటామని తేల్చి చెప్పినట్లు సమాచారం. రేవంత్ ను పీసీసీ చీఫ్ గా నియమించే  విషయంలో తెలంగాణ సీనియర్ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తే  ప్రత్యామ్నాయంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని అధిష్ఠానం తెరపైకి తీసుకువచ్చే అవకాశమున్నట్లు పీసీసీ తరపున ఏఐసీసీలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ నేత చెప్పారు. అందరినీ కలుపుకుపోయే నేతగా, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకగా, సీనియర్ నేతగా జీవన్ రెడ్డికి ఉన్న పేరే  ఇందుకు కారణమని సదరు నేత వివరించారు.

వర్కింగ్​ ప్రెసిడెంట్​ 
రేసులో షబ్బీర్ అలీ..

పీసీసీ  వర్కింగ్ ప్రెసిడెంట్ గా సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీని నియమించే విషయంలోనూ ఏఐసీసీ ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం పీసీసీకి నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉండగా, కొత్త పీసీసీకి మాత్రం ఒక్కరినే నియమించాలనే నిర్ణయానికి హైకమాండ్ వచ్చినట్లు ఇక్కడి నేతల్లో చర్చ సాగుతోంది.  మొత్తానికి నెల లోపే తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడు, వర్కింగ్​ ప్రెసిడెంట్​ రానుండడంతో ఆ తర్వాతే   రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలు ఊపందుకుంటాయని కాంగ్రెస్​ శ్రేణులు ఆశిస్తున్నాయి.