రాష్ట్రాభివృద్ధి కోసమే గ్లోబల్ సమిట్ : సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రాభివృద్ధి కోసమే గ్లోబల్ సమిట్ : సీఎం రేవంత్ రెడ్డి
  •     తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచడమే లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి  

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 8, 9 తేదీల్లో ఫ్యూచర్‌‌ సిటీలో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్‌‌ గ్లోబల్‌‌ సమిట్‌‌.. రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చే కీలక వేదిక కానుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇది కేవలం విజన్ డాక్యుమెంట్​ఆవిష్కరణ మాత్రమే కాకుండా పూర్తిగా రాష్ట్ర ప్రగతిని కాంక్షించే ఆర్థిక సదస్సుగా ఉంటుందని పేర్కొన్నారు. 

తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చడంతో పాటు రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్‌‌ను అంతర్జాతీయ స్థాయిలో పెంచడమే లక్ష్యంగా ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. సదస్సు ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం ప్రజాభవన్‌‌లో ఏర్పాటు చేసిన వార్‌‌ రూమ్‌‌ను సీఎం రేవంత్ శుక్రవారం సందర్శించారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే 20 ఏండ్లలో రాష్ట్ర ఆర్థిక వృద్ధి, అభివృద్ధి ప్రణాళికలను ప్రతిబింబించే విధంగా తెలంగాణ రైజింగ్‌‌–2047 విజన్‌‌ డాక్యుమెంట్‌‌ ఉంటుందని తెలిపారు. దావోస్‌‌లో జరిగే వరల్డ్‌‌ ఎకనామిక్‌‌ ఫోరమ్‌‌ సదస్సులో గ్లోబల్ సమిట్ విజయాన్ని ఒక కేస్ స్టడీగా చెప్పాలన్నదే తన ఆలోచన అని పేర్కొన్నారు. విమానాల రద్దు నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.  

సాయుధ దళాల నిధికి లక్ష విరాళం.. 

సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకొని సైనిక్ వెల్ఫేర్ ప్రతినిధులు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి సీఎం రూ.లక్ష విరాళం అందజేశారు. అనంతరం ‘బోల్డ్ అండ్ బ్రేవ్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ కర్నల్ రమేశ్ కుమార్, కెప్టెన్ శ్రీనేశ్ కుమార్, కెప్టెన్ నరోత్తమ్ రెడ్డి, కెప్టెన్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.