పగబట్టిన కాకులు : పొడుస్తూ హింసిస్తున్నాయి

పగబట్టిన కాకులు : పొడుస్తూ హింసిస్తున్నాయి

పాము పగ జన్మజన్మలుంటదని అంటూ ఉంటారు. అదెంత వరకు నిజమో తెలియదు గానీ, ఓ మనిషికి మాత్రం కాకులు చుక్కలు చూపిస్తున్నాయి. పగబట్టి ముక్కులతో పొడిచి పొడిచి హింసిస్తున్నాయి. గడపదాటి కాలు బయటపెడితే చాలు మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి. నమ్మలేకపోయినా ఇది నిజం. మధ్యప్రదేశ్​లోని శివపురికి సమీపంలో ఉన్న సుమేలా అనే ఊరికి చెందిన శివ కేవత్​కు మూడేళ్లుగా రోజూ ఎదురవుతున్న కాకుల కష్టం ఇది. బయటికెళ్తే అతడు మొక్కుకుంటున్నది ఒక్కటే.. దేవుడా ఈ రోజైనా కాకులు రాకుండా చూడు అని. అవును మరి, అంతలా అవి అతడిని పగబట్టేశాయట. అంతలా పగబట్టడానికి అతడేం అంత పెద్ద పాపం చేశాడు అంటారా? మూడేళ్ల కిందట ఒక రోజు.. ఇనుప వలలో చిక్కుకున్న కాకి పిల్లను కాపాడేందుకు ప్రయత్నించాడట.

కానీ, పాపం ఆ కాకి పిల్ల అప్పటికే చనిపోయిందట. దీంతో తన పిల్లను అతడే చంపాడన్న కసి, పగ కాకుల్లోకి చేరిపోయిందట. అప్పట్నుంచి ఇలా శివ ఎక్కడ కనిపించినా ముక్కులతో పొడిచేసి, కాళ్ల గోళ్లతో రక్కేస్తున్నాయట. రోజూ తనకెదురవుతున్న ఈ కష్టాన్ని చెప్పుకుని చాలా బాధపడుతున్నాడు శివ. ‘‘నేను చంపకపోయినా ఆ కాకి పిల్ల నా చేతుల్లో చచ్చిపోయింది. నేనే చంపేశానని కాకులు నాపై దాడి చేశాయి. నేను చంపలేదు, కాపాడేందుకు ప్రయత్నించానని చెప్దామంటే వాటికేమో అర్థం కాదాయె. ఏం చేయను?” అంటూ శివ నిట్టూర్చాడు. అయితే, కాకుల బారి నుంచి తప్పించుకునేందుకు ఎప్పుడు బయటికెళ్లినా ఓ కర్ర పట్టుకుని వెళుతున్నాడట.