
- సీఎం కామెంట్స్‌తో రెవెన్యూ ఉద్యోగుల్లో ఆవేదన
- వీఆర్ వో, వీఆర్ఏ జేఏసీ
హైదరాబాద్, వెలుగు: ‘‘పని ఒత్తిడితో రెవెన్యూ ఉద్యోగులు శ్రమ దోపిడీకి గురవుతున్నారు. శాఖలో ఉన్న సమస్యలు పరిష్కరించకుండా ప్రజల ముందు మమ్మల్ని దోషులుగా నిలబెట్టడం ప్రభుత్వానికి తగదు. వీఆర్ వో, వీఆర్ఏ, ఇతర రెవెన్యూ ఉద్యోగులపై సీఎం కేసీఆర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి.. సమాజంలో ఉద్యోగుల ఆత్మస్థైర్యం దెబ్బతీశారు” అని వీఆర్ వో, వీఆర్ఏ జేఏసీ నేతలు గరికే ఉపేందర్ రావు, లక్ష్మీనారాయణ, బాల నర్సయ్య పేర్కొన్నారు. ఈ తప్పును సరిదిద్దాలంటే రెవెన్యూ సంఘాలతో సీఎం సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జేఏసీ నేతల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. నేతలు మాట్లాడుతూ సీఎం వ్యాఖ్యలతో ఉద్యోగులు మనోవేదనతో కుమిలిపోతున్నారని, అవమాన భారంతో ఆందోళన చెందుతున్నారని, వారిని రక్షించుకోవాల్సిన బాధ్యత సంఘాలపై ఉందన్నారు. రెవెన్యూ ఉద్యోగులపై అపవాదుపోవాలంటే శాఖలో సంస్కరణలు తీసుకురావాలని, గ్రామ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలని నేతలు డిమాండ్ చేశారు. రెవెన్యూ ఉద్యోగులు ప్రజల్లో ఉండి పనిచేయాలంటే ప్రతి 3 వేల జనాభాకు లేదా ప్రతి 1,500 ఎకరాలకు వీఆర్ వో, వీఆర్ఏ, సర్వేయర్ ను నియమించాలని, గ్రామాల్లో వీఆర్ వో కార్యాలయం నిర్మించాలన్నారు. సమావేశంలో నేతలు మఠం శివశంకర్, సుధాకర్, విజయరామారావు, సుదర్శన్, రాములు, నర్సింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు.