
గోదావరిఖని, వెలుగు: రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ(ఆర్ఎఫ్సీఎల్)లో ఉద్యోగం కోసం దళారులకు డబ్బులిచ్చి మోసపోయిన గోదావరిఖని తిలక్‌నగర్‌కు చెందిన అపరాది శ్రీనివాస్ సోమవారం గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గోదావరి ఒడ్డున సమ్మక్క గద్దెల దగ్గర ఆత్మహత్య చేసుకుంటున్నానని బాధితుడు వన్ టౌన్ సీఐ రమేశ్‌బాబుకు ఫోన్ చేసి చెప్పడంతో సీఐ హుటాహుటిన అక్కడికి వెళ్లారు. గడ్డిమందు తాగి పడి ఉన్న శ్రీనివాస్‌ను హాస్పిటల్‌కు తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది.
పోలీస్ స్టేషన్లోనే బెదిరించిన్రు..
ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఉద్యోగం పెట్టిస్తామన్న కరీంనగర్ జిల్లా గంగాధర మండలం పత్తికుంటపల్లికి చెందిన తూం నర్సయ్య, తూం తిరుపతికి రూ.5.70 లక్షలు చెల్లించినట్టు శ్రీనివాస్ తన సూసైడ్ నోట్లో రాశాడు. మధ్యవర్తి సంతోష్‌కు రూ.20 వేలు, సొసైటీ పెద్ద మనుషులు సీహెచ్ ఉపేందర్, పసునూటి రామస్వామి, కాశవేణి రాజయ్య ముగ్గురికి కలిపి మరో రూ.2.30 లక్షలు ఇచ్చానని తెలిపాడు. తనకు ఇచ్చింది గవర్నమెంట్ జాబ్ కాదని, అది కూడా కాంట్రాక్ట్ వర్క్ అని తెలిసి మధ్యవర్తిని అడిగితే తనకు సంబంధం లేదన్నట్లు చెప్పాడు. గోదావరిఖని వన్‌టౌన్ సీఐకి కంప్లైంట్ ఇచ్చి నెలరోజులు తిరిగినా పట్టించుకోలేదని, పైగా దళారులు, కొందరు నాయకులు వచ్చి పోలీస్ స్టేషన్ లోనే తనను బెదిరించారని పేర్కొన్నాడు. తాను చనిపోయిన తర్వాతైనా తన కుటుంబానికి న్యాయం చేయాలని కోరాడు.