దేశంలో పేదరికం తగ్గుతున్నది : ప్రధాని మోదీ

దేశంలో పేదరికం తగ్గుతున్నది : ప్రధాని మోదీ

భోపాల్: దేశంలో 2014కు ముందు ‘అవినీతి, స్కామ్​’ల యుగం నడిచిందని, ఇప్పుడు ప్రతి పైసా నేరుగా ప్రజల అకౌంట్లకు చేరుతున్నదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నీతి ఆయోగ్ రిపోర్టు ప్రకారం ఈ ఐదేండ్లలో 13.50 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి( బీపీఎల్​ వర్గం అధిగమించారు) బయటపడ్డారని తెలిపారు. సోమవారం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌‌‌‌లో నిర్వహించిన ‘సీఎం రైజ్ గవర్నమెంట్ మహాత్మా గాంధీ హయ్యర్ సెకండరీ స్కూల్‌‌‌‌’ విభాగంలో కొత్తగా రిక్రూట్​అయిన 5,580 మంది టీచర్ల ట్రైనింగ్, -ఓరియెంటేషన్ కార్యక్రమంలో మోదీ వర్చువల్​​గా మాట్లాడారు. 

దేశంలో ప్రజల ఆదాయం పెరుగుతున్నదని చెప్పారు. తొమ్మిదేండ్లలో పౌరుల సగటు ఆదాయం రూ.4 లక్షల నుంచి రూ.13 లక్షలకు పెరిగిందని ఆదాయపు పన్ను రిటర్న్‌‌‌‌ల సంఖ్య స్పష్టం చేస్తోందన్నారు. ‘అమృత్ కాల్’ మొదటి సంవత్సరంలోనే మంచి వార్తలు రావడం మొదలైందని, ఇది పెరుగుతున్న సంక్షేమం, తగ్గుతున్న పేదరికాన్ని చూపుతుందని ప్రధాని చెప్పారు. దేశంలో అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్నాయని, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పెరిగిందని తమ ప్రతి పైసా దేశాభివృద్ధికే ఖర్చు చేస్తారనే విశ్వాసంతో పన్నులు కట్టేందుకు ముందుకు వస్తున్నారని వెల్లడించారు. 

ఎన్ఈపీతో సంప్రదాయ జ్ఞానానికి ప్రాధాన్యం 

వ్యవస్థలో లూప్​ హోల్స్ ను పూడ్చితే పేదల సంక్షేమానికి ఎక్కువ డబ్బును  వెచ్చించినట్లే  అవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నూతన జాతీయ విద్యా విధానం (ఎన్‌‌‌‌ఈపీ) ని అమలు చేయడంలో కొత్త టీచర్లు ముఖ్య పాత్ర పోషిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందిన భారత దేశాన్ని రూపొందించాలనే సంకల్పాన్ని నెరవేర్చడానికి వారు గొప్ప సపోర్ట్​ అందిస్తారని పేర్కొన్నారు. 

నూతన జాతీయ విద్యా విధానంలో సంప్రదాయ జ్ఞానంతో పాటు భవిష్యత్ సాంకేతికతకు ఇంపార్టెన్స్ ఇచ్చామని తెలిపారు. మాతృభాషలో విద్యా బోధన విషయంలో పురోగతి సాధించామని చెప్పారు. దేశ ప్రాథమిక విద్యా రంగంలో కొత్త లెసన్స్ ను ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. దీనితో విద్యారంగంలో కీలక మార్పులకు నాంది పలికామని  ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.