ఇండియాలో రిలయన్స్ మరో అరుదైన ఘనత

ఇండియాలో రిలయన్స్ మరో అరుదైన ఘనత

ముంబై: ఆయిల్‌ నుంచి టెలికం దాకా విస్తరించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ శుక్రవారం మరో అరుదైన ఘనత సాధించింది. ఇండియా నుంచి రూ. 9 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పొందిన మొదటి కంపెనీగా రిలయన్స్‌ అవతరించింది. కిందటేడాది రూ. 8 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ అందుకున్న కంపెనీగానూ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ముఖేష్‌ అంబానీ నాయకత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు శుక్రవారం ఉదయం ట్రేడింగ్లో 2 శాతం పెరిగి రూ. 1,428 కి చేరడంతో మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ కూడా రూ. 9.03 లక్షలకు పెరిగింది. షేర్‌ ధర పెరగడం వల్లే  మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌లో ఈ ఘనతను రిలయన్స్ ఇండస్ట్రీస్‌ దక్కించుకోగలిగింది. ఒక దశలో మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌లో నువ్వా–నేనా అన్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌తో తలపడ్డ టెక్నాలజీ దిగ్గజం టీసీఎస్‌ ఇప్పుడు రూ. 7.66 లక్షల కోట్లతో రెండో స్థానంతో సరిపెట్టుకుంది. కిందటేడాది రూ. 8 లక్షల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ అందుకున్న రెండో కంపెనీగా టీసీఎస్‌ నిలిచింది. ఈ రెండు కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ. 8 లక్షల కోట్లను దాటాక మొదటి స్థానం కోసం పోటీ తీవ్రమైంది. అప్పటి నుంచి ఒకటి, రెండు స్థానాలూ చాలా సార్లు మారాయి. ప్రస్తుతానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఈ విషయంలో ముందంజలో ఉన్నట్లు.

100 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ అందుకున్న మొదటి కంపెనీగా 2007 లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నిలిచింది. మళ్లీ అదే ఫీట్‌ను కిందటేడాది జూలైలో కంపెనీ రిపీట్‌ చేసింది. ఎనర్జీ నుంచి టెలికం దాకా రెవెన్యూలను 2025 నాటికి రెట్టింపు చేయడమే తన లక్ష్యమని కిందటి ఏజీఎంలో ముఖేష్‌ అంబానీ ప్రకటించినప్పటి నుంచీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌కు రెక్కలొచ్చాయి. ఒక్క 2019 కేలండర్‌ ఇయర్‌లోనే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ ఇప్పటిదాకా 28 శాతం పెరగడం విశేషం.

రిజల్ట్స్మరోసారి అదుర్స్

  • ముంబై: ముఖేష్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ మరోసారి ఎనలిస్టుల అంచనాలకు మించిన ఆర్థిక ఫలితాలను శుక్రవారం ప్రకటించింది. సెప్టెంబర్‌ 2019 తో ముగిసిన రెండో క్వార్టర్లో కంపెనీ నికరలాభం అంతకు ముందు ఏడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే 18.32 శాతం పెరిగి రూ. 11,262 కోట్లకు చేరింది. తాజా క్వార్టర్‌కు ఆర్‌ఐఎల్‌ రికార్డు నికర లాభం ప్రకటించిందని సీఎండీ ముఖేష్‌ అంబానీ చెప్పారు. ఆర్‌ఐఎల్‌ లాభం రూ. 11 వేల కోట్ల దాకా ఉండొచ్చని అంతకు ముందు ఎనలిస్టులు అంచనా వేశారు.
  • రెండో క్వార్టర్లో రిలయన్స్‌ రెవెన్యూ 4.84 శాతం పెరిగి రూ. 1.64 లక్షల కోట్లకు చేరింది. అంతకు ముందు ఏడాది రెండో క్వార్టర్లో కంపెనీ రెవెన్యూ రూ. 1.56 లక్షల కోట్లు. ఆర్‌ఐఎల్‌ గ్రాస్‌ రిఫైనింగ్‌ మార్జిన్‌ (జీఆర్‌ఎం) కొద్దిగా తగ్గి 9.40 డాలర్లకు చేరింది. పెట్రో కెమికల్స్‌ డివిజన్‌ రెవెన్యూ 11.90 శాతం తగ్గి రూ. 38,538 కోట్లకు పరిమితమైంది. ఇక ఆయిల్‌ అండ్ గ్యాస్‌ డివిజన్‌ రెవెన్యూ కూడా 40.20 శాతం తగ్గి రూ. 790 కోట్లకు చేరడం గమనార్హం.
  • రిటైల్‌ బిజినెస్‌ రెవెన్యూ 27 శాతం పెరిగి రూ. 41,202 కోట్లకు పెరిగింది. తాజా క్వార్టర్లో రిలయన్స్‌ రిటైల్‌ కొత్తగా 337 స్టోర్లను తెరచింది. దీంతో మొత్తం స్టోర్ల సంఖ్య 10,901 కి చేరింది.
  • మీడియా బిజినెస్‌ రెవెన్యూ 5.1 శాతం తగ్గి రూ. 1,174 కోట్లకు పరిమితం కాగా, ఈబీఐటీ మార్జిన్‌ మాత్రం 4 శాతం పెరిగింది. న్యూ టారిఫ్‌ ఆర్డర్‌ (ఎన్‌టీఓ) నేపథ్యంలో సబ్‌స్క్రిప్షన్‌ ఆదాయం 43 శాతం పెరిగినా, ఎడ్వర్టైజింగ్‌ ఆదాయం పెరగకపోవడం ప్రతికూల ప్రభావం చూపించినట్లు ఆర్‌ఐఎల్‌ తెలిపింది.
  • డిజిటల్‌ సర్వీసెస్‌ రెవెన్యూ 42.70 శాతం పెరిగి రూ. 15,619 కోట్లకు చేరింది. రిలయన్స్‌ గ్రూప్‌ మొత్తానికి కలిపి అప్పులు సెప్టెంబర్‌ 2019 నాటికి రూ. 2,91,982 కోట్లకు చేరాయి.

జియో..

ఇక రిలయన్స్‌ టెలికం యూనిట్‌ జియో నికర లాభం సెప్టెంబర్‌ 2019 తో ముగిసిన క్వార్టర్లో 45.40 శాతం పెరిగి రూ. 990 కోట్లకు చేరింది. ఇదే క్వార్టర్లో ఏవరేజ్‌ రెవెన్యూ పర్ యూనిట్‌ (ఆర్పు) రూ. 120 కి చేరిందని కంపెనీ వెల్లడించింది.