IND vs SA: రిషబ్ పంత్ గాయంపై ఆందోళన.. మ్యాచ్ మధ్యలోనే రిటైర్డ్ హర్ట్

IND vs SA: రిషబ్ పంత్ గాయంపై ఆందోళన.. మ్యాచ్ మధ్యలోనే రిటైర్డ్ హర్ట్

టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ కు గాయాలు వెంటాడుతున్నాయి. ఇంగ్లాండ్ సిరీస్ లో కాలి పాదానికి గాయమైన పంత్ కు కోలుకోవడానికి రెండు నెలల సమయం పట్టింది. ఈ క్రమంలో వెస్టిండీస్ తో జరిగిన రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు  దూరమయ్యాడు. సౌతాఫ్రికాతో జరగబోయే టెస్ట్ సిరీస్ కు ఎంపికైన పంత్.. ప్రస్తుతం సౌతాఫ్రికా-ఏ తో మ్యాచ్ ఆడుతూ గాయపడ్డాడు. మూడో రోజు ఆటలో భాగంగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పంత్ శరీరానికి పలుమార్లు బంతి తగిలింది. షార్ట్ బాల్ ఆడే క్రమంలో టైమింగ్ మిస్ కావడంతో పంత్ రిటైర్డ్ హార్ట్ గా వెనుదిరిగాడు. 

సిక్సర్, రెండు ఫోర్లతో మంచి టచ్ లో కనిపించిన పంత్.. 17 పరుగుల వద్ద బ్యాటింగ్ చేయలేక పెవిలియన్ కు వెళ్ళాడు. వారం రోజుల్లో సౌతాఫ్రికా సిరీస్ ఉండడంతో పంత్ రిస్క్ తీసుకోవడానికి ఆసక్తి చూపించినట్టు తెలుస్తుంది. పంత్ గాయంపై ఇంకా ఎలాంటి అప్ డేట్ రాలేదు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగినా.. రెండో ఇన్నింగ్స్ లో భారత-ఏ జట్టు నిలకడగా ఆడుతుంది. ప్రస్తుతం 5వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. క్రీజ్ లో శుభం దూబే (52), జురెల్ (53) ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ లో 34 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించిన ఇండియా-ఏ ప్రస్తుతం 261 పరుగుల ఆధిక్యంలో ఉంది. 

ప్రసిధ్‌‌‌‌ కృష్ణ (3/35), మహ్మద్‌‌‌‌ సిరాజ్‌‌‌‌ (2/61), ఆకాశ్‌‌‌‌ దీప్‌‌‌‌ (2/28) సమయోచితంగా రాణించడంతో.. శుక్రవారం రెండో రోజు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 47.3 ఓవర్లలో 221 రన్స్‌‌‌‌కే ఆలౌటైంది. కెప్టెన్‌‌‌‌ మార్క్వెస్ అకెర్మాన్ (134) సెంచరీతో చెలరేగినా రెండో ఎండ్‌‌‌‌లో సహకారం కరువైంది. జోర్డాన్‌‌‌‌ హెర్మాన్‌‌‌‌ (26), ప్రేనేలన్ సుబ్రాయెన్ (20) ఓ మాదిరిగా ఆడారు. ఇన్నింగ్స్‌‌‌‌లో 8 మంది సింగిల్‌‌‌‌ డిజిట్‌‌‌‌కే పరిమితమయ్యారు. తొలి ఇన్నింగ్స్ లో జురెల్ సెంచరీ చేయడంతో (132) తొలి ఇన్నింగ్స్ లో ఇండియా-ఏ 255 పరుగులకు ఆలౌటైంది.