మరాఠీలో సంచలన విజయం సాధించిన లేటెస్ట్ మూవీ ‘రాజా శివాజీ’. ఈ సినిమా సక్సెస్ సందర్భంగా నిర్వహించిన వేడుకలో నటుడు, దర్శకుడు, జెనీలియా భర్త రితేష్ దేశ్‌ముఖ్ వివాదంలో చిక్కుకున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రంతో ఉన్న టీషర్ట్ ధరించి బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, కొందరు ఆయన మద్యం సేవించి డ్యాన్స్ చేశారని కూడా ఆరోపిస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.
ఈ వివాదంపై స్పందించిన రితేష్.. శివాజీ మహారాజ్‌ను అవమానించే ఉద్దేశం తనకు అస్సలు లేదని స్పష్టం చేశారు. అయితే, తాను సినిమా ప్రమోషన్ల నుంచి నేరుగా వేడుకకు వెళ్లడంతో టీషర్ట్ మార్చుకోవడం మర్చిపోయానని, అది అనుకోకుండా జరిగిన పొరపాటేనని తెలిపారు. ఒకవేళ తన చర్య వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిన్నట్లయితే క్షమాపణలు కోరుతున్నట్లు వెల్లడించారు.
రితేష్ దేశ్‌ముఖ్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా వివరణ ఇస్తూ.. ‘‘ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రంతో ఉన్న టీషర్ట్ వేసుకుని వేడుక చేసుకోవడం వెనుక ఎలాంటి అవమానకర ఉద్దేశం లేదు. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా అదే టీషర్ట్ ధరించానని, ఆ రోజు కూడా ప్రమోషన్లు ముగించుకుని నేరుగా వేడుకకు వెళ్లడంతో టీషర్ట్ మార్చుకోవడం మరిచిపోయాను. నేను శివాజీ భక్తుడిని. ఒకవేళ నా చర్య వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాన’’అని రితేష్ పేర్కొన్నారు.
అలాగే సోషల్ మీడియాలో వస్తున్న మద్యం ఆరోపణలను కూడా ఆయన ఖండించారు. ‘‘నా జీవితంలో ఎప్పుడూ మద్యం సేవించలేదు. భవిష్యత్తులో కూడా తాగను. నాపై వస్తున్న ఈ ఆరోపణలు పూర్తిగా అసత్యం" అని స్పష్టం చేశారు. వైరల్ వీడియోను తీసిన వ్యక్తి ఆ వేడుకకు ఆహ్వానించి వ్యక్తి కాదని’’ కూడా వెల్లడించారు.
ఇదిలా ఉంటే, మే 1న విడుదలైన ‘రాజా శివాజీ’ బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.120 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన తొలి మరాఠీ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో రితేష్ దేశ్‌ముఖ్‌తో పాటు జెనీలియా దేశ్‌ముఖ్, సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, విద్యా బాలన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
