రివర్ బోర్డులను లైట్ తీసుకుంటున్నరు డీపీఆర్ ఇవ్వట్లేదు

రివర్ బోర్డులను లైట్ తీసుకుంటున్నరు డీపీఆర్ ఇవ్వట్లేదు

హైదరాబాద్, వెలుగు: కృష్ణా, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డులను తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు లైట్ తీసుకుంటున్నాయి. ఈ నదులపై చేపట్టిన ప్రాజెక్టుల డీపీఆర్లు ఇవ్వాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించినా పట్టించుకోవడం లేదు. రెండోసారి డెడ్ లైన్ పెడుతూ ఇంకో లెటర్ రాసినా ఏ ప్రభుత్వమూ రిప్లయ్ కూడా ఇవ్వడం లేదు. ప్రాజెక్టులపై తెలంగాణ, ఏపీ మొండి వైఖరి అనుసరిస్తున్నందున ఇక కేంద్ర జలశక్తి శాఖే నేరుగా రంగంలోకి దిగనున్నట్టు తెలిసింది. ఇకపై రెండు రాష్ట్రాలకు ఢిల్లీ నుంచే లెటర్లు రాయనున్నారు. ఏపీ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టు ఫోర్ షోర్లో కొత్తగా సంగమేశ్వరం లిఫ్ట్ స్కీం చేపట్టడంతోపాటు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీని 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచుతూ 203 జీవో జారీ చేసింది. విభజన చట్టానికి విరుద్ధంగా ఏపీ కొత్త ప్రాజెక్టులు చేపడుతోందని తెలంగాణ కేఆర్ఎంబీకి కంప్లయింట్ చేసింది. ఈ ఫిర్యాదుపై ఏపీ వివరణ ఇస్తూనే తెలంగాణలో గోదావరి, కృష్ణా నదులపై చేపట్టిన ప్రాజెక్టులన్నింటిపైనా కంప్లయింట్ చేసింది.

ఢిల్లీ నుంచి ఫాలో అప్

బోర్డుల మీటింగుల్లో రెండు రాష్ట్రాల అధికారులు తమ ప్రభుత్వ అనుమతి తీసుకొని డీపీఆర్లు సమర్పిస్తామని తెలిపారు. బోర్డులు పెట్టిన మొదటి గడువు ముగిసిన తర్వాత కేంద్ర జలశక్తి శాఖ సెక్రటరీ యూపీ సింగ్ కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ చైర్మన్లతో ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డీపీఆర్లు వచ్చాయా అని ప్రశ్నించారు. పది రోజుల వ్యవధిలో మరోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి డీపీఆర్లపై రెండు బోర్డుల చైర్మన్లకు క్లాస్ తీసుకున్నారు. డీపీఆర్లు ఇవ్వాలంటూ మరోసారి లెటర్లు రాయాలని, అప్పటికీ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు స్పందించకుంటే తామే రంగంలోకి దిగుతామని తేల్చిచెప్పారు. కేంద్రం ఆదేశాలతో రెండు బోర్డులు వారం రోజుల్లోగా డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టులు ఇవ్వాలంటూ డెడ్ లైన్ పెట్టినా ఏ ఒక్క రాష్ట్రం స్పందించలేదు. ఒక రాష్ట్రంలో ఎక్కడ కొత్తగా ప్రాజెక్టు చేపట్టినా వెంటనే సంబంధిత రివర్ బోర్డుకు రెండో రాష్ట్రం ఫిర్యాదు చేస్తోంది. ఇలా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీకి అనేక ఫిర్యాదులు చేశాయి. కంప్లైంట్ బాక్స్లాగే బోర్డులను వాడుకుంటున్నాయి తప్ప ఆయా బోర్డుల ఆదేశాలను మాత్రం పట్టించుకోవడం లేదు. బోర్డులకు వర్కింగ్ మ్యానువల్స్ లేకపోవడంతోనే రెండు రాష్ట్రాలు ఇలా వ్యవహరిస్తున్నాయని
తెలుస్తోంది.

జలశక్తి శాఖ నుంచే కమ్యూనికేషన్

2014 జూన్ 2 తర్వాత ఏపీ, తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులపై కేంద్ర జలశక్తి శాఖే నేరుగా రంగంలోకి దిగనుంది. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ ఆదేశాలను రెండు రాష్ట్రాలు సీరియస్ గా తీసుకోకపోవడంతో ప్రాజెక్టుల విషయంలో సాధికారికంగా లెటర్లు రాయనున్నట్టు తెలుస్తోంది. అన్ని ప్రాజెక్టులకు రివర్ బోర్డు, సీడబ్ల్యూసీ టెక్నికల్ అప్రైజల్, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం త ప్పనిసరి అని జల శక్తి శాఖ ఇప్పటికే చెప్పింది. అనుమతి లేని ప్రాజెక్టుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని బోర్డులను ఆదేశిస్తూ వస్తోంది. ఇకపై కేంద్రం నుంచే ఈ విషయమై 2 రాష్ట్రాలకు లెటర్లు రాసి డీపీఆర్లపై ఒత్తిడి తీసుకురానున్నట్టు తెలిసింది.

సంజయ్ లెటర్తో సెంట్రల్ జోక్యం

సంగమేశ్వరం లిఫ్టుతోపాటు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణను ఆపాలంటూ బీజేపీ స్టేట్ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్కు లెటర్ రాశారు. ఈ లేఖపై స్పందించిన కేంద్ర మంత్రి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న జలవివాదాల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తన శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. జలశక్తి శాఖ ఆదేశాలతోనే జూన్ నాలుగు, ఐదు తేదీల్లో కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ సమావేశాలు నిర్వహించారు. ప్రాజెక్టుల డీపీఆర్లే ప్రధాన ఎజెండాగా సాగిన ఈ మీటింగ్స్లో రెండు నదులపై నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులపై చర్చించారు. కేఆర్ఎంబీ పది రోజుల్లోగా డీపీఆర్ లు సమర్పించాలని ఆదేశించగా, జీఆర్ఎంబీ జూన్ 10లోగా అన్ని ప్రాజెక్టులకు సంబంధించి కనీసం ఒకటి, రెండు వ్యాల్యూమ్లైనా సమర్పించాలని డెడ్ లైన్ పెట్టింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం