
నిరుద్యోగుల అండతో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం, నిరుద్యోగులకు న్యాయం చేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య కోరారు. బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేయకూడదని సూచించారు. హైదరాబాద్ ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరుద్యోగుల మహా ధర్నా కార్యక్రమంలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగులను విస్మరించిందనే కారణంగా గత బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టి, కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారని ఆయన అన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్లు ప్రారంభమైనా వాటిలో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు నష్టపోతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన డిఎస్సి 11 వేల పోస్టులకు బదులుగా, 25 వేల పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించాలన్నారు. అలాగే డిఎస్సి ఎగ్జామ్ ను రెండు నెలల పాటు వాయిదా వేసి, నిరుద్యోగులకు ప్రిపేర్ అయ్యేందుకు సమయం ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పుకొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వారి డిమాండ్లను పరిష్కరించి తన చిత్తశుద్ధి చాటాలని ఆర్ కృష్ణయ్య హితవు పలికారు.