
హైదరాబాద్: మణికొండ మున్సిపాలిటీలో కారు బీభత్సం సృష్టించింది. పుప్పాలగూడ అల్కాపూరీ కాలనీలో కారు బైక్‌ను బలంగా ఢీ కొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న తండ్రి కొడుకులు నవీన్ కుమార్, కుశల్ జోయల్ గాల్లో ఎగిరి కిందపడ్డారు. బాలుడు కుశల్ జోయల్ పై నుంచి కారు దూసుకెళ్లగా.. తండ్రి నవీన్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.
చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ బాలుడు మార్గ మధ్యలోనే మృతి చెందాడు. తండ్రి ఒడిలోనే కుశల్ జోయల్ ప్రాణాలు విడిచాడు. బాధితుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న నార్సింగ్ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. కారు నడుపుతున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రవీణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తండ్రికొడుకులు దీపావళి పండుగ వేళ టపాసుల కోసం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తన ఒడిలోనే కన్న కొడుకు ప్రాణాలు విడవడంతో నవీన్ కుమార్ గుండెలవిసేలా రోదించాడు. బాణా సంచా తెచ్చుకుందామని వెళ్తే.. కారు మృత్యువు రూపంలో వచ్చి కబలించడంతో కుశల్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.