పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ పద్మారావునగర్‌లోని ‘జ్యోతి మెడికల్ హాల్’ ఆఫీసులో ఆదివారం తెల్లవారుజామున దుండుగులు దోపిడీకి పాల్పడ్డారు. ముసుగులు ధరించిన 8 మంది దుండగులు కార్యాలయంలోకి చొరబడి, విధుల్లో ఉన్న ఇద్దరు సెక్యూరిటీ గార్డులను కత్తులతో బెదిరించి బంధించారు. అనంతరం గ్యాస్ సిలిండర్, ఇతర పనిముట్లతో ఆఫీస్ తలుపులు పగలగొట్టి నాలుగో అంతస్తులోని నగదు కౌంటర్ నుంచి రూ.27,500 అపహరించారు.
సెక్యూరిటీ గార్డుల వద్ద ఉన్న మరో రూ.2,500 నగదును కూడా లాక్కుని, ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి పరారయ్యారు. చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి, ఏసీపీ శశాంక్ రెడ్డి, ఇన్‌స్పెక్టర్ మధుబాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి దర్యాప్తును ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు.
