ఇండియాకు ఇద్దరు కెప్టెన్లు?

ఇండియాకు ఇద్దరు కెప్టెన్లు?
  • రోహిత్‌‌ శర్మకు వన్డే, టీ20 సారథ్యం   
  • టెస్టులకే  నాయకుడిగా విరాట్‌‌
  • త్వరలోనే బీసీసీఐ నిర్ణయం?
  • ఇద్దరికీ పడడం లేదన్న వార్తలపై విచారించే చాన్స్‌

న్యూఢిల్లీ: ఎన్నో అంచనాలతో బరిలోకి దిగి వరల్డ్‌‌కప్‌‌ సెమీ ఫైనల్లోనే ఇంటిదారి పట్టిన టీమిండియా అందరినీ నిరాశ పరిచింది. టాపార్డర్‌‌పై అతిగా ఆధారపడడం.. చాన్నాళ్లుగా వేధిస్తున్న మిడిలార్డర్‌‌ సమస్యను పరిష్కరించుకోకపోవడం.. అనుభవజ్ఞులను కాదని కొత్త ప్లేయర్లకు టీమ్‌‌లోకి తీసుకోవడం.. తుది జట్టు ఎంపిక.. ఇలా చాలా విషయాలు ఇండియా ఓటమికి కారణమయ్యాయి. వీటన్నింటికంటే  కెప్టెన్‌‌ కోహ్లీ, వైస్‌‌ కెప్టెన్‌‌ రోహిత్‌‌ శర్మ మధ్య వివాదాలు ఉన్నాయన్న వార్తలు  ఆశ్చర్యపరుస్తున్నాయి. ప్లేయర్లు రెండు గ్రూపులుగా విడిపోయారన్న ఆరోపణలు కూడా రావడం బీసీసీఐని కలవరపెడుతోంది. దాంతో, వరల్డ్‌‌కప్‌‌ ఓటమికి కారణాలతో పాటు జట్టులో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు బోర్డు  రంగంలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది. ఫ్యూచర్‌‌ను దృష్టిలో ఉంచుకొని పలు చర్యలు తీసుకోవాలని బోర్డు పెద్దలు భావిస్తున్నట్టు వినికిడి. ఇందులో భాగంగా  ఇండియాకు ఇద్దరు కెప్లెన్లను నియమించే ఆలోచనతో  ఉన్నట్టు సమాచారం.

ప్రస్తుతం అన్ని ఫార్మాట్లకు నాయకుడిగా ఉన్న విరాట్‌‌ కోహ్లీని టెస్ట్‌‌లకు మాత్రమే సారథిగా కొనసాగించి, రోహిత్‌‌కు లిమిటెడ్‌‌ ఓవర్ల (వన్డే, టీ20)  కెప్టెన్సీ అప్పగించాలన్న ప్రతిపాదన చేసినట్టు తెలుస్తోంది. ఒక టోర్నీ ముగిసిన వెంటనే భవిష్యత్‌‌ ప్రణాళికలు రెడీ చేసుకుంటే మెరుగైన ఫలితాలు వస్తాయి. దానికి  ఇంగ్లండ్‌‌ వరల్డ్‌‌ కప్‌‌ను నెగ్గడమే ఉదాహరణగా చెప్పొచ్చు. గత ఎడిషన్‌‌లో దారుణంగా ఓడిన ఆ జట్టు… సొంతగడ్డపై జరిగే  ఈ కప్పును దృష్టిలో  ఉంచుకొని ముందడుగు వేసింది. అందువల్ల వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్‌‌కప్‌‌, 2023లో ఇండియా ఆతిథ్యం ఇచ్చే  వన్డే వరల్డ్‌‌కప్‌‌ దృష్ట్యా  రోహిత్‌‌కు వన్డే సారథ్యం అప్పగించాలని బోర్డు వర్గాలు భావిస్తున్నాయి.

‘50 ఓవర్ల ఫార్మాట్‌‌లో రోహిత్‌‌కు కెప్టెన్సీ ఇచ్చేందుకు ఇదే రైట్‌‌ టైమ్‌‌. ప్రస్తుత కెప్టెన్‌‌కు, మేనేజ్‌‌మెంట్‌‌కు అందరి సపోర్ట్‌‌ ఉంది. కానీ, వచ్చే వరల్డ్‌‌కప్‌‌ను దృష్టిలో ఉంచుకొని మనం ఇప్పటి నుంచే ప్లాన్‌‌ చేసుకోవాలి. అందుకోసం పాత ఐడియాలను, ప్లాన్స్‌‌ను పక్కన బెట్టాలి.  కొన్ని విషయాల్లో మార్పు అవసరమని మనందరికీ తెలుసు. లిమిటెడ్‌‌ ఓవర్లకు కెప్టెన్‌‌గా రోహిత్‌‌ సరైన వ్యక్తి’ అని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బోర్డు అధికారి ఒకరు చెప్పారు.  దీనికంటే కూడా కోహ్లీకి రోహిత్‌‌కు పడడం లేదని, జట్టు ఆటగాళ్లు రెండు గ్రూపులుగా చీలిపోయారని వస్తున్న వార్తలపైనే బోర్డు ఎక్కువగా ఆందోళన వ్యక్తం చేస్తోందని  తెలిపారు. వరల్డ్‌‌కప్‌‌ పెర్ఫామెన్స్‌‌పై  కమిటీ ఆఫ్‌‌ అడ్మినిస్ట్రేటర్స్‌‌ (సీఓఏ) రివ్యూ మీటింగ్‌‌లో ఈ అంశం చర్చకు
రానుందన్నారు.

19న విండీస్‌‌ టూర్‌‌కు టీమ్‌‌ సెలెక్షన్‌‌.. ధోనీ ఫ్యూచర్​పై డైలమా

మాజీ కెప్టెన్‌‌, వెటరన్‌‌ ప్లేయర్‌‌ ధోనీ ఫ్యూచర్‌‌పై  డైలమా నెలకొన్నంది. వచ్చే నెల ఆరంభంలో మొదలయ్యే  వెస్టిండీస్‌‌ టూర్‌‌కు వెళ్లే  ఇండియా టీమ్‌‌ను సెలెక్టర్లు ఈ నెల 19న ప్రకటించనున్నారు. అయితే, ఈ టూర్‌‌లో ఆడేందుకు ధోనీ సిద్ధంగా ఉన్నాడో లేదో తెలియడం లేదు. దాంతో, అతడిని సెలెక్ట్‌‌ చేయాలో, వద్దో అని సెలెక్టర్లు తేల్చుకోలేకపోతున్నారు. వరల్డ్‌‌కప్‌‌ సెమీస్‌‌లో ఇండియా ఓటమి తర్వాత మహీ కెరీర్‌‌పై అనేక ఊహాగానాలు వస్తున్నాయి. అతను ఆఖరి ఇంటర్నేషనల్‌‌ మ్యాచ్‌‌ ఆడేసినట్టే అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తన కెరీర్‌‌పై  38 ఏళ్ల ధోనీ తొందర్లోనే ఒక ప్రకటన చేస్తాడన్న వార్తలు వస్తున్నాయి.  టెస్ట్‌‌లకు గతంలో రిటైర్మెంట్‌‌ ఇచ్చిన మహీ ప్రస్తుతం వన్డేలు, టీ20లు మాత్రమే ఆడుతున్నాడు. విండీస్‌‌ టూర్‌‌లో భాగంగా ఆగస్టు 3న లిమిటెడ్‌‌ ఓవర్ల సిరీస్‌‌ మొదలవుతుంది. కాగా, టీ20, వన్డేలకు కెప్టెన్‌‌ కోహ్లీ, పేసర్‌‌ జస్‌‌ప్రీత్‌‌ బుమ్రాకు రెస్ట్‌‌ ఇచ్చే అవకాశం ఉంది. వచ్చే నెల 22న మొదలయ్యే రెండు టెస్ట్‌‌ల సిరీస్‌‌లో మాత్రం ఈ ఇద్దరు బరిలోకి దిగనున్నారు. అదే విధంగా వరల్డ్‌‌కప్‌‌లో గాయపడ్డ ఓపెనర్‌‌ శిఖర్ ధవన్‌‌ అందుబాటుపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు.