RR vs MI: రోహిత్ వివాదాస్పద నిర్ణయం.. టైమ్ అయిపోయాక DRS తీసుకున్న హిట్ మ్యాన్

RR vs MI: రోహిత్ వివాదాస్పద నిర్ణయం.. టైమ్ అయిపోయాక DRS తీసుకున్న హిట్ మ్యాన్

జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ వివాదాస్పద రివ్యూ కోరి విమర్శల పాలవుతున్నాడు. గురువారం (మే 1) మాన్సింగ్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రెండో ఓవర్లో  ఈ సంఘటనచోటు చేసుకుంది. రెండో ఓవర్ ఐదో బంతికి ఫజల్హాక్ ఫరూఖీ లెగ్ సైడ్ వేసిన బంతిని రోహిత్ ఆడడంలో విఫలమయ్యాడు. హిట్ మ్యాన్ ప్యాడ్లకు తగిలిన ఈ బంతిని రాజస్థాన్ రాయల్స్ ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేసింది. అంపైర్ వెంటనే ఔటిచ్చాడు. 

ఈ దశలో రోహిత్ శర్మ  DRS తీసుకునే ఆలోచనలో కనిపించాడు. సహచరుడు రికెల్ టన్ దగ్గరకు వెళ్లి మాట్లాడుతున్నాడు. ఈ లోపు DRS సమయం ముగిసింది. టైం కౌంట్ డౌన్ 0 పడిన తర్వాత రోహిత్ అంపైర్ ను రివ్యూ కోరాడు. ఈ విషయాన్ని రాజస్థాన్ లో ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆన్ ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ కు సిగ్నల్ ఇచ్చాడు.  బాల్-ట్రాకర్ పిచ్ ఔట్ సైడ్ పడినట్టు చూపించడంతో రోహిత్ నాటౌట్ గా అంపైర్లు ప్రకటించారు. దీంతో 7 పరుగుల వద్ద రోహిత్ బతికిపోయాడు. ఈ మ్యాచ్ లో ఓవరాల్ గా రోహిత్ శర్మ 36 బంతుల్లో 9 ఫోర్లతో 53 పరుగులు చేశాడు. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు రికెల్ టన్ (38 బంతుల్లో 61:7 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్ శర్మ (36 బంతుల్లో 53:9 ఫోర్లు ) మెరుపులకు తోడు సూర్య కుమార్ యాదవ్(23 బంతుల్లో 48:4 ఫోర్లు, 3 సిక్సులు) హార్దిక్ పాండ్య(23 బంతుల్లో 48: 6 ఫోర్లు, సిక్సర్) దంచి కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోర్ చేసింది. రాజస్థాన్ రాయల్స్ లో తీక్షణ, పరాగ్ చెరో వికెట్ తీసుకున్నారు.