ఇది కాలం మిగిల్చిన జ్ఞాపకం. రోమన్ల మతపరమైన ప్లేస్‌లలో ఒకటి. ఈ ఆలయాన్ని ఎందుకు కట్టారు? ఎవరి కాలంలో కట్టారు? అనే విషయాలు మాత్రం ఇప్పటికీ మిస్టరీనే. సుమారు 2వేల ఏండ్ల కిందట దీన్ని కట్టారు. రోమన్ల ఆలయాలన్నీ కూలిపోయినా... ఇది మాత్రం అప్పటి ఇంజినీరింగ్ టెక్నాలజీకి నిదర్శనంగా ఇప్పటికీ మిగిలి ఉంది.
ఆలయ నిర్మాణ శైలిని బట్టి దీన్ని క్రీస్తు శకం రెండో శతాబ్దంలో కట్టినట్టు అంచనా. ఈ ఆలయం లెబనాన్ దేశంలోని బెకా వ్యాలీకి దగ్గరలో ఉన్న ఎత్తైన మట్టిదిబ్బపై ఉంది. దీన్ని ‘‘బాల్బెక్ టెంపుల్’’ అని పిలుస్తుంటారు. ఈ ఆలయం చాలా పెద్దది. దొరికిన కొన్ని ఆధారాలను బట్టి ఇక్కడ గతంలో బాల్బెక్ అనే నగరం ఉండేదని, ఆ నగరంలోనే ఈ ఆలయం కట్టారని తెలిసింది. అందుకే దీన్ని ‘టెంపుల్ ఆఫ్ బాల్బెక్’ అని పిలుస్తుంటారు. ఇక్కడ ఉన్న ఆలయం ఏ దేవుడి కోసం కట్టారనేది ఇప్పటికీ తెలియలేదు. కొందరు రీసెర్చర్లు మాత్రం ఇది బాచస్, బృహస్పతి, శుక్రుడి కోసం కట్టిన మూడు ఆలయాల సమూహం అని చెప్తుంటారు. రోమన్ సామ్రాజ్యంలో కట్టిన అతిపెద్ద ఆలయాలు ఇవి అని కూడా చెప్తుంటారు.
పదివేల ఏండ్ల నాటిదా?
కొందరు ఆర్కియాలజిస్ట్‌లు ఈ నగరం ఉన్న ప్రాంతానికి పదివేల ఏండ్ల చరిత్ర ఉందని చెప్తున్నారు. అంటే.. పదివేల ఏండ్ల నుంచి ఈ ప్రాంతంలో మనుషులు ఉంటున్నారు. వాళ్లలో రోమన్లు కూడా ఉన్నారు. బాల్బెక్ నగరంలో దాదాపు 300 ఏండ్ల పాటు రోమన్లు ఉన్నట్టు ఆధారాలు దొరికాయి. వేల ఏండ్ల నుంచి ఇక్కడి ప్రజలు బెకా లోయను ఆధారంగా చేసుకుని బతికారు. ‘‘బాల్బెక్’’ అనే పదం రెండు పదాల నుంచి పుట్టింది. ‘బాల్’ అంటే.. సెమెటిక్ లార్డ్ ఆఫ్ గాడ్స్ అని అర్థం. ‘నెబెక్’ అంటే ‘‘సూర్యుని నగరం” అని అర్థం. ఈ నగరంలో 80 వేల కంటే ఎక్కువమంది ప్రజలు ఉండేవాళ్లని ఒక అంచనా.
మొదటి స్థావరం
మనుషులు స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం మొదలుపెట్టినప్పుడు.. ఇక్కడ వాటర్ సోర్సెస్ ఎక్కువ. దాంతో పది వేల ఏండ్ల క్రితం ఇక్కడ కొందరు స్థావరం ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ దొరికిన వాటిలో ఒక వస్తువు ఏడు వేల ఏండ్ల క్రితం నాటిది. రెండో శతాబ్దపు విగ్రహం మొండెం లాంటి ఆధారాలు కూడా దొరికాయి.
పెద్ద పెద్ద రాళ్లు
ఇక్కడ మరో మిస్టరీ ఏంటంటే.. ఈ టెంపుల్‌కి వాడిన రాళ్లు. బాల్బెక్ ఆలయ నిర్మాణానికి చాలా పెద్ద రాళ్లు వాడారు. అంత పెద్ద రాళ్లను ఈ ఎత్తైన మట్టి దిబ్బ మీదకు ఎలా తీసుకొచ్చారు? ఎలా చెక్కారు? టెక్నాలజీ పెద్దగా లేని ఆ రోజుల్లో ఫర్ఫెక్ట్‌గా ఎలా పేర్చారు? అనే ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానాలు దొరకలేదు. ఆలయం పోడియం కట్టడానికి దాదాపు 20 మీటర్ల ఎత్తైన రాళ్లను వాడారు. ఇవి ఒక్కోటి వెయ్యి టన్నుల బరువు ఉన్నాయి. ఈ ఆలయ పునాది రాళ్లు కూడా చాలా బరువున్నాయి. ‘ది గ్రేట్ పిరమిడ్ ఆఫ్- గిజా’కు వాడిన రాళ్లతో పోలిస్తే.. వీటి బరువు పది రెట్లు ఎక్కువ. అప్పుడున్న టెక్నాలజీతో వాటిని కదపడం కూడా సాధ్యం కాదు. కానీ.. రోమన్లు వాటిని ఎక్కడినుంచో ఇక్కడికి తీసుకొచ్చి, చెక్కి ఒకదానిపై ఒకటి పేర్చారు. ఇందుకోసం ఎలాంటి టెక్నాలజీ వాడారు? ఇదంతా ఎలా సాధ్యమైంది? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి ఇప్పటికీ ఆర్కియాలజిస్ట్‌లు ప్రయత్నిస్తున్నారు.
ఎందుకు కట్టారు?
ఈ ఆలయాన్ని కట్టిన కాలంలో రోమ్‌ని పాలించిన చక్రవర్తులు మరెక్కడా ఇలాంటివి కట్టించలేదు. మరి ఇక్కడే ఎందుకు కట్టారు? వాళ్ల మాతృభూమిలో కట్టకుండా లెబనాన్‌లో ఇంతటి అద్భుతాన్ని నిర్మించాల్సిన అవసరం ఏముంది? అనే ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానాలు దొరకలేదు. పైగా ఇంత పెద్ద రాళ్లను ఈ మట్టి దిబ్బమీదకి కష్టపడి తీసుకొచ్చి ఎందుకు కట్టాలి? అంటే దీని వెనక పెద్ద రహస్యమే ఉండి ఉంటుంది అంటున్నారు ఆర్కియాలజిస్ట్‌లు. ఎందుకో తెలియదు కానీ.. రోమన్లు ఈ ఆలయాన్ని రహస్యంగా ఉంచాలనుకున్నారట.
