త్వరలో ఇందిరాపార్క్ ఫ్లై ఓవర్ ప్రారంభిస్తాం

త్వరలో ఇందిరాపార్క్ ఫ్లై ఓవర్ ప్రారంభిస్తాం
  • బల్దియా కమిషనర్ రోనాల్డ్ రోస్
  • స్టీల్ బ్రిడ్జి పనుల పరిశీలన

హైదరాబాద్, వెలుగు : ఇందిరాపార్క్ – వీఎస్టీ  ఫ్లై ఓవర్ ను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని బల్దియా కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. సోమవారం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్, ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి స్టీల్ బ్రిడ్జిని పరిశీలించి మాట్లాడారు. 

సిటీలో  ట్రాఫిక్  లేకుండా సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఎస్ఆర్డీపీ ద్వారా 48 పనులు చేపట్టగా, ఇప్పటివరకు 35 పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు.  ఇందులో భాగంగా రూ.450 కోట్ల వ్యయంతో  నిర్మిస్తున్న  స్టీల్ బ్రిడ్జి సిటీలో 20వ ఫ్లై ఓవర్ అని చెప్పారు. మిగతా 13 పనులను స్పీడ్ గా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.  సీఈ దేవానంద్, ఎస్ఈ రవీందర్ రాజు ఉన్నారు. 

ఓటరు జాబితాలో తప్పులు రావొద్దు 

తప్పులు లేకుండా  ఓటరు జాబితాను తయారు చేసేందుకు ఆర్ఓ లు, ఈఆర్ఓ, బీఎల్ఓ లు చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, బల్దియా కమిషనర్ రోనాల్డ్ రోస్ ఆదేశించారు. బల్దియా హెడ్డాఫీసులో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు, ఆర్ఓ, ఈఆర్ఓ లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ జిల్లాలో పారదర్శకమైన ఓటరు జాబితా తయారీకి  బీఎల్ఓ లు, ఈఆర్ఓ, ఆర్ఓలు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఓటరు నమోదుకు తప్పనిసరిగా మొబైల్, ఆధార్ నెంబర్లను అనుసంధానించాలని పేర్కొన్నారు. 

పోలింగ్ స్టేషన్ వారీగా ఇంటినెంబర్ ల డ్రాఫ్ట్ ను ప్రచురణ చేస్తామని,  ఓటర్లు హెల్ప్ లైన్, సీఈఓ వెబ్ సైట్, ఎలక్షన్ కమిషన్ టోల్ ఫ్రీ నంబర్ 1950 ద్వారా తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని సూచించారు. ఫైనల్ ఓటరు జాబితా ను ప్రతి పోలింగ్ స్టేషన్ లో, బిఎల్ఓ వద్ద, వార్డు ఆఫీస్ లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు.  ఈ సమావేశంలో జాయింట్ సీఈఓ సర్ఫరాజ్ అహ్మద్, కంటోన్మెంట్ ఆర్ఓ, ఎన్నికల అధికారి శంకరయ్య, జాయింట్ కమిషనర్ మంగతాయారు, ఆర్ఓ, ఈఆర్ఓలు పాల్గొన్నారు.