డిండి వద్దు.. లక్ష్మీదేవిపల్లి ముద్దు : హరగోపాల్, కోదండరాం

డిండి వద్దు.. లక్ష్మీదేవిపల్లి ముద్దు : హరగోపాల్, కోదండరాం
  • పాలమూరు నీటి కష్టాలపై రౌండ్​ టేబుల్ సమావేశం
  • పాల్గొన్న హరగోపాల్, కోదండరాం

పంజాగుట్ట, వెలుగు: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని డిండి ఎత్తిపోతల పనులను సత్వరమే నిలిపివేసి, ఉమా మహేశ్వరం, గొల్లపల్లి ఎత్తిపోతల రిజర్వాయర్ పనులను వెంటనే రద్దు చేయాలని పాలమూరు అధ్యయన వేదిక డిమాండ్ చేసింది. జిల్లాను సస్యశామలం చేసే లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్​ను వెంటనే నిర్మించాలని కోరింది. ఆదివారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో పాలమూరు అధ్యయన వేదిక విసృత రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రొ. హరగోపాల్ మాట్లాడుతూ.. నీళ్ల విలువ తెలిసినవారు అభివృద్ధిలో ముందున్నారని, విజయవాడ, రాజమండ్రి వంటి ప్రాంతాలు ప్రాజెక్టులతో అభివృద్ధి చెందాయని గుర్తుచేశారు.

తెలంగాణ పోరాటంలో పాలమూరు నీటి కష్టాల పాత్ర కీలకమని, నల్గొండ జిల్లా అవసరాలకు నాగార్జునసాగర్, గోదావరి నీరు వినియోగించాలని సూచించారు. జీవో నం.72ను పునరుద్ధరించి జూరాల నుంచి పాలమూరుకు నీళ్లు తేవాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు. డిండి ప్రాజెక్టు వల్ల జిల్లాకు ప్రయోజనాల కంటే అనర్థాలే ఎక్కువని పేర్కొన్నారు. ప్రొ. కోదండరాం మాట్లాడుతూ.. పాలమూరు, రంగారెడ్డి జిల్లాల ప్రయోజనాలు కాపాడేలా ప్రాజెక్టులు నిర్మించాలని, పడమర ప్రాంతంలో వలసలు అరికట్టేందుకు అభివృద్ధి చర్యలు తీసుకోవాలని కోరారు.  పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో పాలకులు విఫలమయ్యారని, సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు నీటి కష్టాలపై దృష్టి సారించాలని కోరారు.  ఈ సమావేశంలో అధ్యయన వేదిక నాయకులు తిమ్మప్ప, వెంకటరాములు, వెంకటగౌడ్, ఎండీ ఇక్బాల్ పాషా, కర్ణకోట రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.