గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ‘ఆర్ఆర్ఆర్’ టీం

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ‘ఆర్ఆర్ఆర్’ టీం

రోజుకో రాష్ట్రంలో తమ సినిమా ప్రమోషన్ చేస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ టీం.. ఈ రోజు హైదారాబాద్‎లో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంది. మరో రెండు రోజుల్లో తమ సినిమా విడుదల సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ టీం గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొంది. రాజ్య‌స‌భ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్‎తో కలిసి డైరెక్టర్ రాజమౌళి, జూ. ఎన్టీఆర్, రాంచరణ్  హైదరాబాద్ గచ్చిబౌలిలో మొక్కలు నాటారు. 

రాష్ట్రం, దేశం పచ్చబడాలనే సంతోష్ కుమార్‌ సంకల్పం చాలా గొప్పదని రాజమౌళి కొనియాడారు. వీలున్నప్పుడల్లా పచ్చదనం పెంపు కోసం మొక్కలు నాటుతానని ఆయన అన్నారు. తాను గతంలో బాహుబలి టీమ్‎తో కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌‎‎లో పాల్గొని మొక్కలు నాటిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పర్యావరణ మార్పులను గమనించి, ప్రతీ ఒక్కరూ ప్రకృతి రక్షణ కోసం చైతన్యవంతంగా ఉండాలని జూనియర్ ఎన్టీఆర్ సూచించారు. ఈ భూమిపై మనందరమూ అతిథులం మాత్రమే అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని పర్యావరణాన్ని కాపాడాలని ఆయన అన్నారు. పిల్లలను ఎలా పెంచుతామో మొక్కలనూ కూడా అలాగే జాగ్రత్తగా పెంచాలని ఎన్టీఆర్ తెలిపారు. మొక్కలు నాటిన ప్రతీసారి తెలియని ఉత్సాహం వస్తుందని హీరో రాంచరణ్ అన్నారు. 

ఇంట బిజీ షెడ్యూల్‎లో కూడా  గ్రీన్ ఇండియా ఛాలెంజ్‎లో పాల్గొనడానికి వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ టీంకు  ఎంపీ సంతోష్ కుమార్  ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సినిమా అత్యంత శక్తివంతమైనదని ఆయన అన్నారు. సమాజానికి చక్కని హరిత సందేశం ఇచ్చే స్ఫూర్తి హీరోలతో పాటు, చిత్ర నిర్మాణంలో భాగం అయ్యే 24 కళలకు చెందినవారికి ఉంటుందని ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు.