డబుల్ ఇండ్లు ఇప్పిస్తామని రూ.కోటి వసూలు..హైదరాబాద్ అల్వాల్లో ముగ్గురు అరెస్ట్

డబుల్ ఇండ్లు ఇప్పిస్తామని రూ.కోటి వసూలు..హైదరాబాద్ అల్వాల్లో ముగ్గురు అరెస్ట్

పద్మారావునగర్, వెలుగు: డబుల్ బెడ్‌‌రూమ్ ఇండ్లు ఇప్పిస్తామని నమ్మించి పేద ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసిన కిలాడీ ముఠాను అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. 7 మంది సభ్యుల ఈ ముఠాలో ముగ్గురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 79 నకిలీ ఇండ్ల కేటాయింపు ధ్రువపత్రాలు, 3 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 

మల్కాజ్‌‌గిరి జోన్ డీసీపీ శ్రీధర్  గురువారం వివరాలు వెల్లడించారు. తిరుమలగిరికి చెందిన తిమ్మిరి గోపీనాథ్ పుష్పలత(54) గతంలో జీహెచ్‌‌ఎంసీలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేసేది. సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో అల్వాల్‌‌కు చెందిన జయరాజు గంగాధరన్‌‌తో చేతులు కలిపింది. ఇద్దరూ కలిసి నిరుపేదలను లక్ష్యంగా చేసుకుని డబుల్ బెడ్‌‌రూమ్ ఇళ్లు మంజూరు చేయిస్తామని నమ్మబలికారు. తాను జీహెచ్‌‌ఎంసీలో ఉన్నతాధికారినని చెప్పి పుష్పలత బాధితుల్లో నమ్మకం కల్పించింది. 

ఒక్కో బాధితుడి నుంచి ప్రాసెసింగ్ చార్జీల పేరుతో రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేశారు. ఇలా 99 మంది బాధితుల నుంచి దాదాపు రూ.కోటి వరకు కాజేశారు. డబ్బులు తీసుకున్న తర్వాత నకిలీ కేటాయింపు పత్రాలు ఇచ్చారు. నకిలీవని గుర్తించిన బాధితులు నిలదీయగా, అసలు పత్రాలు త్వరలో ఇస్తామని మూడేళ్లుగా కాలయాపన చేశారు. 

అల్వాల్‌‌కు చెందిన బాధితుడు గొగికర్ ప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, జూన్ 24న ప్రధాన నిందితురాలు పుష్పలతతో పాటు ఆమె కొడుకు తిమ్మిరి గోపీనాథ్ విశాల్(21), నకిలీ పత్రాలను ముద్రించిన జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడు మహేందర్ సింగ్(45)ను అరెస్ట్ చేశారు. మిగిలిన నిందితులు జయరాజ్ గంగాధరన్, అతని కూతురు నిషారాజ్, కొడుకు చింటు రాజ్, నకిలీ రబ్బర్ స్టాంపులు తయారు చేసిన రాణిగంజ్‌‌కు చెందిన వ్యక్తులు పరారీలో ఉన్నారని డీసీపీ తెలిపారు.