కేదారి ఫ్యామిలీకి రూ.10 లక్షల సాయం.. సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి ఆదేశాలు

కేదారి ఫ్యామిలీకి రూ.10 లక్షల సాయం.. సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి ఆదేశాలు
  • ప్రజల ఆకలి తీర్చి ఆస్తులు అమ్ముకున్న భార్యభర్తలు

హనుమకొండ, వెలుగు: వరంగల్‌‌‌‌ నగరంలో సాధారణ హోటల్‌‌‌‌ నడుపుతూ ప్రజల ఆకలి తీర్చేందుకు ఆస్తులన్నీ అమ్ముకోవడంతో పాటు తెలంగాణ ఉద్యమంలో అంకితభావంతో పని చేసిన లింగాల కేదారి, పుష్పలత దంపతులు ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు. 

దీంతో వారి కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల ఆర్థికసాయం అందించాలని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సీఎం సహాయనిధి నుంచి సాయం అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని హనుమకొండ కలెక్టర్‌‌‌‌కు ఆదేశాలు జారీ చేశారు. 

హనుమకొండ శాంతినగర్‌‌‌‌ పోస్టల్‌‌‌‌ కాలనీలో నివసించే లింగాల కేదారి దంపతులు అదాలత్‌‌‌‌ జంక్షన్‌‌‌‌ వద్ద హోటల్‌‌‌‌ నడుపుతూ తక్కువ ధరకే ప్రజలకు అన్నం పెట్టేవారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థులు, ఉద్యమకారులు, జర్నలిస్టులు.. ఇలా ఎంతోమందికి ఉచితంగా టీ, టిఫిన్లు, భోజనం అందించారు. వృథా చేసే అన్నంతో మరొకరి కడుపు నింపవచ్చనే ఉద్దేశంతో తమ హోటల్‌‌‌‌లో ఆహారాన్ని వృథా చేసేవారికి జరిమానా కూడా విధించేవారు.

ఆస్తులన్నీ కోల్పోయి..
కొన్నేళ్లుగా అదాలత్‌‌‌‌ జంక్షన్‌‌‌‌లో హోటల్‌‌‌‌ నడుపుతున్న లింగాల కేదారి దంపతులు ప్రజాసేవ కోసం ఆస్తులన్నీ కోల్పోయారు. హోటల్‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌ రెంట్‌‌‌‌ కట్టలేదని ఓనర్‌‌‌‌ ఇబ్బందులకు గురిచేయడంతో ఈ నెల 9న రాత్రి పెట్రోల్‌‌‌‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ దంపతులు తెలంగాణ ఉద్యమ  సమయంలో చేసిన సేవలను సీఎం గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందించాలని హనుమకొండ కలెక్టర్‌‌‌‌ను ఆదేశించారు.