ఎన్నికలు జరగని 58 పంచాయతీలకు.. రూ.33.62 కోట్లు విడుదల

ఎన్నికలు జరగని 58 పంచాయతీలకు.. రూ.33.62 కోట్లు విడుదల
  • జీపీలపై కేంద్రం కక్ష సాధింపు సరికాదు: మంత్రి సీతక్క

హైదరాబాద్, మంగపేట, వెలుగు: కోర్టు కేసులు, ఇతర కారణాలతో తెలంగాణలో ఎన్నికలు జరగని 58 గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.33.62 కోట్ల నిధులను విడుదల చేసింది. మంత్రి సీతక్క చొరవతో ఆర్థిక శాఖ ఈ నిధులను మంజూరు చేయగా, ఇప్పటికే ఆయా జీపీల ఖాతాల్లో జమ అయ్యాయి.

రాష్ట్రంలోని 58 జీపీల్లో కోర్టు కేసులు, సాంకేతిక కారణాల వల్ల గతంలో ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో కేంద్ర ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని మంత్రి.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధి కుంటుపడకుండా నిధులు కేటాయించాలని కోరారు.

దీంతో రాష్ట్ర ఆర్థిక శాఖ ఆ జీపీలకు రూ.33.62 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ మొత్తాన్ని ఆయా పంచాయతీల ఖాతాల్లోకి ప్రభుత్వం బదిలీ చేసింది. మంత్రి సీతక్క స్పందిస్తూ ఎన్నికలు జరగలేదన్న కారణంతో గ్రామాలపై కక్ష సాధింపు ధోరణి సరికాదన్నారు.

కేంద్రం పునరాలోచించి నిలిపివేసిన ఆర్థిక సంఘం నిధులను రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఎన్నికలు జరగని గ్రామాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో మంగపేట గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.