కరీంనగర్ జిల్లాలో రూ.121.11 కోట్లు ఎగ్గొట్టిన్రు..సీఎంఆర్ డబ్బులను ఇతర వ్యాపారాల్లోకి మళ్లించిన మిల్లర్లు

కరీంనగర్ జిల్లాలో రూ.121.11 కోట్లు ఎగ్గొట్టిన్రు..సీఎంఆర్ డబ్బులను ఇతర వ్యాపారాల్లోకి మళ్లించిన మిల్లర్లు
  • ఆర్ఆర్ యాక్ట్ కింద నోటీసులు
  • ఏండ్లు గడుస్తున్నా సొత్తు రికవరీలో ఆఫీసర్ల నిర్లక్ష్యం
  • కరీంనగర్ జిల్లాలో 11 డీఫాల్ట్​ రైస్​ మిల్లులు 

కరీంనగర్, వెలుగు: జిల్లాలో కొందరు రైస్ మిల్లర్ల అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. ఆఫీసర్ల అండ, పర్యవేక్షణ లోపంతో సర్కార్ కు కుచ్చుటోపీ పెట్టి రూ.కోట్లు వెనకేసుకున్నారు. సీఎంఆర్(కస్టమ్​మిల్లింగ్ ​రైస్)​కోసం ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి, ఇతర రాష్ట్రాల్లో అమ్మేశారు.

వచ్చిన డబ్బులను రియల్ ఎస్టేట్, డెయిరీ, హోటల్ బిజినెస్ తదితర రంగాల్లోకి మళ్లించారు. వారికి రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఆఫీసర్లు నోటీసులు పంపగా.. ఒక్కరు మాత్రమే డబ్బులు చెల్లించారు. మిగతా వాళ్లు ఏండ్లు గడుస్తున్నా చెల్లించకుండా మొండికేస్తున్నారు. అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. 

రెండు మిల్లుల బకాయిలు రూ.104 కోట్లు

కరీంనగర్ జిల్లాలో 12 మంది మిల్లర్లు ధాన్యాన్ని దారి మళ్లించి డీఫాల్టర్లుగా తేలారు. వీరిలో చల్లూరు వాసుదేవ ఇండస్ట్రీస్ 2011–-12 వానాకాలం సీజన్​కు సంబంధించి 11,158 క్వింటాళ్లకు రూ.1,57,46,408 చెల్లించాల్సి ఉండగా.. ఆర్ఆర్ యాక్ట్ ప్రయోగించడంతో ఆ మొత్తాన్ని యాజమాన్యం చెల్లించింది.

మిగతా 11 మిల్లుల్లో ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లికి చెందిన శ్రీసీతారామ ఆగ్రో ఇండస్ట్రీస్ 2022–23 యాసంగి సీజన్ లో 1,68,646 క్వింటాళ్ల ధాన్యానికి సంబంధించి రూ.41,18,39,300, 2023– 24 వానాకాలం సీజన్​కు సంబంధించి 52,575 క్వింటాళ్లకు రూ.13,77,78,405 చెల్లించాల్సి ఉంది. జమ్మికుంట మండలం కోరపల్లి మహాశక్తి ఆగ్రో ఇండస్ట్రీస్ యాజమాన్యం 2023–24 వానాకాలం సీజన్​లో 74,828 క్వింటాళ్లకు రూ.19,60,93,858, 2022–23 యాసంగి సీజన్ లో 1,23,773 క్వింటాళ్లకు రూ.30,22,57,745 చెల్లించాలి.

దంపతుల పేరిట ఉన్న ఈ రెండు మిల్లుల నుంచే మొత్తం రూ.104 కోట్లు సర్కారుకు రావాల్సి ఉంది. రెండు సీజన్లలో ఒక్క బియ్యపు గింజ కూడా ఎఫ్ సీఐకి చేరకున్నా సివిల్ సప్లై విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్, జిల్లా సివిల్ సప్లై​ఆఫీసర్లు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయన్న ఆరోపణలున్నాయి. జమ్మికుంట, ఇల్లందకుంట తహసీల్దార్లు ఆర్ఆర్ యాక్ట్ కింద నోటీసులిచ్చి చేతులు దులుపుకున్నారన్న విమర్శలున్నాయి. 

దశాబ్దం దాటినా రికవరీ చేయట్లే..

జిల్లాలోని డీఫాల్ట్​రైస్ మిల్లుల్లో కొన్ని 2012 నుంచి బకాయి ఉన్నాయి. శంకరపట్నం మండలం రాజాపూర్ లోని  శ్రీలక్ష్మి మోడ్రన్ రైస్ మిల్లు, మానకొండూరు మండలం అన్నారంలోని లక్ష్మీశ్రీ రైస్ మిల్లు, మానకొండూరులోని శ్రీవసుధ ఇండస్ట్రీస్, శ్రీవైష్ణవి ఇండస్ట్రీస్, కరీంనగర్ రాంనగర్ లోని సాయికృష్ణ రైస్ మిల్లు, హుజూరాబాద్ మండలం సిర్సపల్లిలోని సూర్య ఇండస్ట్రీస్, పెద్దపాపయ్యపల్లిలోని పరమేశ్వర ఇండస్ట్రీస్, జమ్మికుంటలోని ఎస్వీ ఇండస్ట్రీస్, శంకరపట్నం మండలం మొలంగూరులోని పవనసుత ట్రేడర్స్ ఈ జాబితాలో ఉన్నాయి. వీటన్నింటి నుంచి రూ.17 కోట్ల వరకు రివకరీ చేయాల్సి ఉంది. 

డీఫాల్ట్ రైస్ మిల్లులు                ధాన్యం (క్వింటాళ్లలో)    రావాల్సిన మొత్తం (రూ.లో)  

శ్రీసీతారామ ఆగ్రో ఇండస్ట్రీస్             2,21,221                            54,96,17,705
మహాశక్తి ఆగ్రో ఇండస్ట్రీస్                    1,98,601                            49,83,51,603
పవనసుత ట్రేడర్స్                                23,504                            5,48,30,630
పరమేశ్వర ఇండస్ట్రీస్                            14,144                             3,33,74,432
లక్ష్మీశ్రీ పీబీఆర్ఎం                                 12,225                              1,96,07,541
శ్రీవైష్ణవి ఇండస్ట్రీస్                                  9,578                              1,53,62,685
శ్రీవసుధ ఇండస్ట్రీస్                                 9,674                              1,55,16,688
శ్రీలక్ష్మి ఎంఆర్ఎం                                   4,401                                 70,60,833
ఎస్వీ ఇండస్ట్రీస్                                       3,317                                  61,59,439
సాయికృష్ణ                                                3,614                                  57,97,905
సూర్య ఇండస్ట్రీస్                                      2,918                                55,08,126
మొత్తం                                                   5,03,197                           121,11,87,587