
- షూరిటీ బాండ్లు ఇవ్వాలని యూఎస్ రూల్స్
- బిజినెస్, టూరిస్ట్ వీసాలకు వర్తింపు
- హై వీసా ఓవర్‌స్టే రేటు ఉన్న దేశాలపై ప్రభావం
న్యూఢిల్లీ: వీసా నిబంధనలను అమెరికా మరింత కఠినతరం చేసింది. గడువు ముగిసినా అమెరికాలో ఉంటున్న వివిధ దేశాల పౌరులకు చెక్ పెట్టే విధంగా పైలట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఇకపై ఆయా దేశాల నుంచి అమెరికాకు వచ్చే పౌరులు రూ.13.17 లక్షల (15 వేల డాలర్లు) వరకు బాండ్ల రూపంలో సెక్యూరిటీ డిపాజిట్ (షూరిటీ) చేయాల్సి ఉంటుంది. అట్లయితేనే వారిని యూఎస్‌లోకి అనుమతిస్తారు. సెక్యూరిటీ డిపాజిట్‌కు తోడు ఇంటిగ్రిటీ ఫీజు కూడా కట్టాల్సి ఉంటుంది. ఇది బిజినెస్ (బీ1), టూరిస్ట్ (బీ2) వీసాలకు వర్తిస్తుంది. ఈ వీసాదారులు ఎంపిక చేసిన కొన్ని ఎయిర్‌పోర్టుల ద్వారానే అమెరికాకు రాకపోకలు సాగించాలి. వీసా గడువు ముగిసిన వెంటనే యూఎస్ నుంచి వెళ్లిపోవాలి. అప్పుడే షూరిటీ కింద పెట్టిన రూ.13.17 లక్షలు తిరిగి చెల్లిస్తారు. ఈమేరకు అమెరికా విదేశాంగ శాఖ పైలట్ ప్రోగ్రామ్‌ను రూపొందించింది. దీనిపై సోమవారం (లోకల్ టైమ్) నోటీస్ విడుదల చేసింది. ఇది ఈ నెల 20 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
ఏడాది పాటు అమలు..
వీసా గడువు ముగిసినా కొంతమంది అమెరికాలోనే ఉంటున్నారని, అలాంటి వాళ్లతో తమ దేశ భద్రతకు ముప్పు పొంచి ఉందని డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. ఈ క్రమంలోనే కొత్త పైలట్ ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చారు. దీన్ని ఏడాది పాటు అమలు చేస్తారు. ఇది గడువు ముగిసినా అమెరికాలో ఎక్కువమంది పౌరులు ఉంటు న్న దేశాలు, సెక్యూరిటీ స్ర్కీనింగ్ సరిగాలేని దేశాలకు వర్తించనుంది. ఇకపై ఇలాంటోళ్లు బిజినెస్ (బీ1), టూరిస్ట్ (బీ2) వీసాలతో అమెరికా వెళ్లాలంటే రూ.5 వేల డాలర్లు, రూ.10 వేల డాలర్లు, రూ.15 వేల డాలర్ల చొప్పున సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఏయే దేశాలకు ఈ రూల్స్ వర్తిస్తాయనేది విదేశాంగ శాఖ వెల్లడించలేదు. హై వీసా ఓవర్‌స్టే రేట్ల ఆధారంగా దేశాల జాబితాను ప్రకటించనుంది.