హైదరాబాద్లో14 బ్యాంకుల నుంచి రూ.1,700 కోట్ల లోన్ ఫ్రాడ్.. బేగంపేటలో పలు కంపెనీల్లో సోదాలు

హైదరాబాద్లో14 బ్యాంకుల నుంచి రూ.1,700 కోట్ల లోన్ ఫ్రాడ్.. బేగంపేటలో పలు కంపెనీల్లో సోదాలు
  • ఎస్‌‌ఈడబ్ల్యూ, ప్రసాద్ అండ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్​లో ఈడీ సోదాలు
  • బేగంపేట సహా ఆరు చోట్ల తనిఖీలు
  • రూ.120 కోట్లు విలువైన ప్రాపర్టీ డాక్యుమెంట్లు సీజ్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఎస్​ఈడబ్ల్యూ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రసాద్ అండ్ గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో ఈడీ సోదాలు చేసింది. 14 బ్యాంకుల్లో రూ.1,700 కోట్ల లోన్ ఫ్రాడ్ కేసులో భాగంగా ఈ తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్ బేగంపేటలోని ఎస్​ఈడబ్ల్యూ కార్పొరేట్ ఆఫీస్, ఆయా కంపెనీల ప్రమోటర్లు, డైరెక్టర్ల ఇండ్లు సహా మొత్తం ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో మంగళవారం (జులై 22) రాత్రి వరకు తనిఖీలు కొనసాగాయి. ఈ సోదాల్లో రూ.120 కోట్లు విలువ చేసే ప్రాపర్టీ డాక్యుమెంట్లు, 33 బ్యాంక్ అకౌంట్లను ఈడీ సీజ్ చేసింది. ఈ

 మేరకు తనిఖీలకు సంబంధించిన వివరాలను బుధవారం హైదరాబాద్ జోనల్ ఆఫీస్​లో ఈడీ వెల్లడించింది. యూపీ స్టేట్ హైవే అథారిటీతో సబ్ కాంట్రాక్టుల్లో భాగంగా ఎస్‌‌‌‌‌‌‌‌ఈడబ్ల్యూ, ప్రసాద్ అండ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలు స్పెషల్ పర్పస్ వెహికల్‌‌‌‌‌‌‌‌ పేరుతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఎస్ఈడబ్ల్యూ ఎల్ఎస్ వై హైవేస్ లిమిటెడ్ మరికొన్ని కంపెనీల పేరుతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ సహా 14 బ్యాంకుల నుంచి రూ.1,700 కోట్ల టర్మ్ లోన్లు తీసుకున్నారు. వివిధ కంపెనీల పేరుతో వాటిని దారి మళ్లించారు. 

లోన్లు చెల్లించకపోవడంతో ఆయా బ్యాంకులు సీబీఐకి ఫిర్యాదు చేశాయి. సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా సోదాలు నిర్వహించింది. ఎస్‌‌‌‌‌‌‌‌ఈడబ్ల్యూ ట్రాన్స్ పోర్ట్ నెట్ వర్క్స్ లిమిటెడ్ సహా సబ్ కాంట్రాక్టుల పేరుతో ఇతర కంపెనీలకు రూ.603.68 కోట్లు దారి మళ్లించినట్లు ఆధారాలు సేకరించింది. ఆయా కంపెనీల ప్రమోటర్లు, డైరెక్టర్లు వారి కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్న రూ.120 కోట్లు విలువ చేసే ఆస్తుల డాక్యుమెంట్లను సీజ్ చేసినట్లు ఈడీ వెల్లడించింది.